కపిల్ సిబల్ కొత్త 'ఇన్సాఫ్ '
Mar 5, 2023, 07:21 IST
|
దేశ ప్రజలపై జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడటానికి 'ఇన్సాఫ్' అనే కొత్త వేదికను ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్
ప్రకటించారు. ఈ పోరాటంలో బీజేపీయేతర ముఖ్యమంత్రులు, విపక్ష నేతలు సహా ప్రతి ఒక్కరూ తనకు మద్దతివ్వాలని కోరారు. ఈనెల 11న ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద బహిరంగ సభ నిర్వహిస్తానని, అక్కడే భారతదేశ కొత్త విజన్‌ను వెల్లడిస్తానని చెప్పారు. శనివారం తన నివాసంలో విలేకరుల సమావేశంలో ఆ వివరాలను ఆయన వెల్లడించారు. 'ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రతిపక్ష నేతలు, సామాన్య ప్రజలు సహా ప్రతి ఒక్కరికీ ఇదే నా బహిరంగ ఆహ్వానం' అని ప్రకటించారు. ఇదంతా ప్రధానమంత్రి మోదీని విమర్శించడానికి కాదని, ఆయనలో మార్పు తీసుకురావడానికేనని చెప్పారు. 'దేశంలోని ప్రతి ప్రాంతంలోనూ పౌరులకు, సంస్థలకు, రాజకీయ ప్రత్యర్థులకు, జర్నలిస్టులకు, ఉపాధ్యాయులకు, చిన్న, మధ్యతరహా వ్యాపారాలకు అన్యాయం జరుగుతోంది. ఇన్సాఫ్ కే సిపాహి పేరిట మేమొక వెబ్‌సైట్‌ను ప్రారంభించాం. అందులో ఎవరైనా నమోదు కావొచ్చు. ఇదొక జాతీయస్థాయి వేదిక. ఇందులో న్యాయవాదులు ముందువరుసలో ఉంటారు. ఇదో గొప్ప చర్చ. ప్రజలు మేల్కోవాల్సిన అవసరం ఉంది. ఇన్సాఫ్ కి సిపాహి(న్యాయాన్ని కాపాడే సైనికుడు)గా మారాలని వారందరినీ కోరుతున్నా. ఎక్కడ అన్యాయం జరిగినా వారు పోరాడాలి.
ఈ బానిసత్వం నుంచి మనల్ని విముక్తి చేసుకొనేందుకు ఒక జాతీయ ఉద్యమాన్ని ప్రారంభిద్దాం' అన్నారు. ఈ ఉద్దేశం వెనుక రాజకీయం లేదని, రాజ్యాంగ విలువల కోసమే ఈ పోరాటమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఇందులో చేరాలని కోరారు. తన ప్రయత్నమంతా ప్రజా ఉద్యమం కోసమేనని, తానేమీ రాజకీయ పార్టీని స్థాపించడం లేదని తేల్చిచెప్పారు. 'ఆర్‌ఎ్‌సఎస్ శాఖలు ప్రతి ప్రాంతంలోకీ తమ భావజాలాన్ని వ్యాపింపజేశాయి. ఆ భావజాలమే నిర్దిష్టంగా కొన్ని అన్యాయాలు పెరగడానికి కారణం. ఆ అన్యాయాలపైనా మేం పోరాడతాం' అని ప్రకటించారు. ఈడీ సాయంతో రాజకీయ ప్రత్యర్థులను అంతం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. '2014 తర్వాత మేఘాలయ, మణిపూర్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర సహా ఎనిమిది రాష్ట్రాల్లో ప్రభుత్వాలను బీజేపీ కూల్చివేసింది. ఇది రాజకీయ అన్యాయం 100 మంది వద్ద సుమారు రూ.54 లక్షల కోట్ల సంపద ఉంది. ఇది ఆర్థిక అన్యాయం కాదా'' అని కపిల్ సిబ్బల్ ప్రశ్నించారు.