రుషికొండ పై కేంద్ర కమిటీ రహస్య విచారణ!
అధికారుల పర్యటన అంతా గోప్యం?
విశాఖ తీరంలో వున్నా రుషికొండ ప్రాంతంలో పర్యావరణానికి భంగం కలిగిస్తూ కొండను బోడుగుండు చేసిన జగన్ సర్కార్ నిర్వాకం పై తనిఖీ చేసి నివేదిక ఇవ్వాల్సిన కేంద్ర పర్యావరణ శాఖ కమిటీ రహస్యంగా రుషికొండ ప్రాంతాన్ని సందర్శించింది. హై కోర్ట్ ఆదేశాల మేరకు జనవరి లో నివేదిక ఇవ్వాల్సిన కమిటీ రెండు నెలలు ఆలస్యం గా వచ్చింది. అయితే స్థానికులకు ఎవరికి చెప్పకుండా అధికారులు జాగ్రత్త పడ్డారు.
రుషికొండ మీద జరిగిన తవ్వకాల్లో అక్రమాలపై వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు హైకోర్టు సూచన మేరకు కేంద్ర ప్రభుత్వ శాఖల అధికారులతో నియమించిన కమిటీ కొద్దిరోజుల కిందట ప్రాజెక్టును పరిశీలించింది. కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ (ఎంవోఈఎఫ్) ఏర్పాటు చేసిన జాతీయ సముద్ర అధ్యయన శాస్త్రం, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, కేంద్ర సుస్థిర తీర ప్రాంత నిర్వహణ సంస్థ, కేంద్ర ప్రభుత్వ పనుల విభాగాల నిపుణులు కొండ మీద జరిగిన పనుల తీరు, చేపట్టిన మట్టి తవ్వకాలను తనిఖీ చేసినట్లు తెలిసింది. ఈ పర్యటన అంతా గోప్యంగా సాగింది. వివిధ పనులకు సంబంధించిన అనుమతులు.. క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించారు. ముఖ్యంగా రిసార్టు పునరుద్ధరణ ప్రాజెక్టు పేరుతో విచక్షణారహితంగా తవ్వేస్తూ పరిధికి మించి నిర్మాణాలు ఏమైనా చేపట్టారా? వంటి అంశాలను పరిశీలించినట్లు సమాచారం. దీంతో పాటు రుషికొండ-భీమిలి బీచ్ రోడ్డులో మట్టి తవ్వకాలు, ఎంవోఈఎఫ్ నిబంధనలు మీరడం వంటి వాటిపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా తనిఖీలు చేసినట్లు తెలిసింది.