లోక్ సభ సభ్యత్వం కోల్పోనున్న బిఎస్పీ ఎంపీ అన్సారీ
నాలుగు సంవత్సరాల జైలు శిక్ష ఫలితం
బి ఎస్పీ ఎంపీ అన్సారీ ఒకరు జైలు శిక్ష కారణంగా లోక్ సభ సభ్యత్వాన్ని కోల్పోనున్నారు. గతంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ సూరత్ కోర్టు తీర్పు కారణంగా వాయనాడు లోక్ సభ సభ్యత్వo కోల్పోయారు. ఇప్పుడు బఎస్పీ ఎంపీ వంతు వచ్చింది.
2005 నాటి బీజేపీ మాజీ ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్ కిడ్నాప్ - హత్య కేసుతో పాటు 1996 నాటి విశ్వహిందూ పరిషత్ ఆఫీస్ బేరర్ నంద కిషోర్ రుంగ్తా కిడ్నాప్ కేసులో సోదరులు ముక్తార్ అన్సారీ, అఫ్జల్ అన్సారీ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ఈ గ్యాంగ్ స్టర్ యాక్ట్ కేసును విచారించిన ఘాజీ పూర్ ప్రజాప్రతినిధుల కోర్టు.. వివిధ కేసుల్లో ఇప్పటికే దోషిగా తేలి ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ ఎమ్మెల్యే ముక్తార్ అన్సారీ కి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష , ఐదు లక్షల జరిమానా విధించింది. ఇక అఫ్జల్ అన్సారీకి నాలుగేళ్ల జైలు శిక్ష , లక్ష రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. దీంతో అఫ్జల్ లోక్‌సభ సీటును కోల్పోయే పరిస్థితి వచ్చింది. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 8లోని ఆర్టికల్ 102(1)(ఈ) నిబంధన ప్రకారం.. రెండేండ్లు లేదా అంతకంటే ఎక్కువ జైలు శిక్ష పడిన వ్యక్తి తీర్పు వెలువడిన తేదీ నుంచి రాజ్యాంగ పదవిలో కొనసాగే అర్హతను కోల్పోతారు. జైలు శిక్షాకాలంతో పాటు మరో ఆరేండ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకూ అనర్హులు అవుతారు.
సెక్షన్ 8లో పేర్కొన్న నేరాలకు ఈ అనర్హత వేటు వర్తిస్తుంది. ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా 2019 పరువు నష్టం కేసులో దోషిగా తేలడంతో కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నిబంధలన ప్రకారం.. లోక్‌సభ సెక్రటేరియట్ రాహుల్‌పై అనర్హత వేటు వేసింది. దీంతో ఆయన తన ఎంపీ సభ్యత్వాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఇక ముక్తార్ అన్సారీ, అఫ్జల్ అన్సారీలకు సంబంధించిన కేసులో తీర్పు వెలువడనున్న నేపథ్యంలో ఘాజీపూర్ కోర్టు వెలుపల గట్టి భద్రతను ఏర్పాటు చేశారు.గత 8 నెలల వ్యవధిలో ( 2022 సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు) ముక్తార్ అన్సారీకి వివిధ కేసుల్లో నాలుగుసార్లు శిక్ష పడటం గమనార్హం.
అఫ్జల్ అన్సారీ రాజకీయ నేపథ్యం..
అఫ్జల్ అన్సారీ తన రాజకీయ జీవితాన్ని సీపీఐతో ప్రారంభించారు. 1985లో మొదటిసారి ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 1989, 91, 93, 96 వరకు వరుసగా సీపీఐ తరఫున విజయం సాధించారు. 1996 ఎన్నికల్లో ఎస్పీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. 2002 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి చెందిన కృష్ణానంద్ రాయ్ చేతిలో ఆయన ఓడిపోయారు. దీంతో సమాజ్ వాదీ పార్టీ అఫ్జల్ అన్సారీకి 2004లో లోక్‌సభ టిక్కెట్ ఇచ్చింది.
ఈ ఎన్నికల్లో బీజేపీకి చెందిన మనోజ్ సిన్హాపై ఆయన గెలిచారు. 2005 నవంబర్ 29న ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్ హత్య తర్వాత అఫ్జల్ అన్సారీ పై బలమైన కేసులు నమోదయ్యాయి. కోర్టులో ఎన్నో అభియోగాల అనంతరం ఆయన జైలుకు వెళ్లారు. జైలుకు వెళ్లే సమయంలో సమాజ్ వాదీ పార్టీ తో రాజకీయ విభేదాల కారణంగా.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఘాజీపూర్ నుంచి బీఎస్పీ టికెట్‌పై పోటీ చేసి గెలిచారు.