home page

అవినాష్ రెడ్డి, భాస్కర రెడ్డి అరెస్ట్ ఖాయం : రఘురామ్ రాజు

మళ్ళీ మళ్ళీ అబద్దాలు చెబితే జనం నమ్మరుగా 

 | 
Raghu
అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిల అరెస్టు ఖాయం 
 అరెస్టు చేయకపోతే ఇప్పటికే అప్రతిష్ట పాలైన సిబిఐ మరింత అప్రతిష్ట పాలయ్యే ప్రమాదం
 కస్టోడియల్ టార్చర్ పై పట్టాభి హైకోర్టును ఆశ్రయించాలి
 ఒక్క అవకాశం అంటే నమ్మారు కదా అని మళ్ళీ.. మళ్ళీ అబద్ధాలను చెబితే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు
 పెట్టుబడులు పెట్టే కంపెనీలకు భూములు ఎక్కడ నుంచి తెచ్చి ఇస్తారు?
 విద్యుత్ పెట్టుబడుల సాధ్యాసాధ్యాలపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాలి
 నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు 
 మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిల అరెస్టు తప్పనిసరని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘు రామకృష్ణంరాజు పేర్కొన్నారు. పోలీసు అధికారి చెప్పిన దాని ప్రకారం అరెస్టు తప్పనిసరి, కానీ అరెస్టు కాకూడదు అన్నది నా కోరిక... అవుతారనేది నా నమ్మకం అని అన్నారు. 
 వివేక హత్య కేసులో నిందితుడిగా అభియోగాలను ఎదుర్కొంటున్న సునీల్ యాదవ్ బెయిలు పిటిషన్ పై సిబిఐ దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్ ఆధారంగా వైయస్ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిల అరెస్ట్ ఒకసారి తప్పదని మాజీ పోలీసు అధికారి ఒకరు తనకు వెల్లడించారని వివరించారు. సోమవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామ కృష్ణంరాజు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... వైయస్ వివేకానంద రెడ్డి హత్యకు ముందు, తరువాత వైయస్ భాస్కర్ రెడ్డి నివాసంలో నిందితులంతా సమావేశమైనట్టు గూగుల్ టేక్ అవుట్ ద్వారా స్పష్టమైన ఆధారాలు లభించినట్లుగా సిబిఐ తన కౌంటర్ పిటిషన్ లో పేర్కొందని చెప్పారు. ఇదే విషయాన్ని సదరు పోలీసు అధికారి ప్రస్తావిస్తూ, ఒకవేళ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి లను అరెస్టు చేయకపోతే, అదే న్యాయస్థానంలో సిబిఐ పెను సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారన్నారు. ఇప్పటికే అప్రతిష్ట పాలైన సిబిఐ, మరింత అప్రతిష్ట పాలయ్యే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారని రఘురామకృష్ణంరాజు తెలిపారు. చార్జిషీట్లో మోపిన అభియోగాలే తప్పయితే శివ శంకర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, సునీల్ కుమార్ యాదవ్, దస్తగిరి వీళ్ళు ఎవరు కూడా వైయస్ వివేకానంద రెడ్డిని హత్య చేయలేదని ఆకాశము నుంచి గంధర్వులు, కిం పురుషులు దిగివచ్చి హత్య చేసి వెళ్లిపోయారని అంటే ఏమీ చేయలేమన్నారు. విచారణ చేసేది సిబిఐ సంస్థ, సాక్షి దినపత్రిక యాజమాన్యం కాదని ఎద్దేవా చేశారు. సిబిఐ ఛార్జ్ షీట్ లో పేర్కొన్న అంశాలే చెల్లుతాయని, సాక్షి దినపత్రికలో రాసే ఊహాజనిత కథనాలకు కోర్టులు ప్రభావితం కావని రఘురామకృష్ణం రాజు స్పష్టం చేశారు.
 అరెస్టులకు తిరగబడతామంటే... జగన్ పైనున్న సిబిఐ కేసులు వేగం పుంజుకునే అవకాశం
 కడప ఎంపీ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి అరెస్టులకు నిరసనగా తిరగబడాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రయత్నిస్తే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైనున్న సిబిఐ కేసులు వేగం పుంజుకునే అవకాశాలు లేకపోలేదని రఘురామకృష్ణం రాజు హెచ్చరించారు. పార్టీకి చెందిన తనలాంటి కార్యకర్తలు, అరెస్టుల గురించి బాధపడకుండా శాంతియుతంగా ఉండాలి. అరెస్టు అయిన వారు వారానికో, పది రోజులకు, నెల కైనా బయటకు వస్తారన్న విషయాన్ని పార్టీ అగ్ర నాయకులైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, అరెస్టుకు నిరసనగా రాజీనామాలు చేస్తామని చెబుతున్న కడప ఎమ్మెల్యేలు గ్రహించాలి. జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లుగా అంతిమంగా ధర్మానిదే విజయని, నిర్దోషులుగా బయటకు రావాలని కోరుకోవడం మినహా, క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్తలు చేయగలిగింది ఏమీ లేదని రఘురామకృష్ణం రాజు అన్నారు. రాజ్యసభలో సంపూర్ణ ఆదిక్యత లేని కారణంగా కేంద్ర ప్రభుత్వం ఒక దశ వరకు మాత్రమే సహించే అవకాశం ఉంటుంది. ఈనెల 10వ తేదీన విచారణ అనంతరం ఏమి జరుగుతుందో వేచి చూడాలని అన్నారు. ఈనెల ఆరవ తేదీన విచారణకు హాజరు కావాలని వైయస్ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలకు ముందస్తుగానే నోటీసులు ఇచ్చినప్పటికీ, గృహ సారధులు, పార్టీ కార్యకర్తలతో తనకు సమావేశం ఉందని చెప్పి... ఫ్రీ గా ఉన్నప్పుడు వస్తామని చెప్పడం, దానికి సిబిఐ చిత్తం దొర అని అంగీకరించడం రాష్ట్ర ప్రజలను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. ప్రతి ఒక్కరికి రాజకీయ సమావేశాలు ఉంటాయని, ఎంపీ అయిన రాజకీయ నాయకులకు, సిబిఐ వద్ద ఇంతటి వెసులుబాటు లభిస్తుందని తనకు తెలియదని రఘురామకృష్ణంరాజు ఎద్దేవా చేశారు. ప్రస్తుతం తీరికలేని కార్యక్రమాలలో ఉన్నానని చెబుతున్న అవినాష్ రెడ్డి, పార్లమెంటు సమావేశాలు ముగిసిన తరువాత విచారణకు హాజరవుతానని చెప్పే అవకాశాలు లేకపోలేదని అపహాస్యం చేశారు. ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయించాలనే నీచ మనస్తత్వం మాత్రమే తమ పార్టీ వారికి ఉంటుందని, పార్టీలో సాధారణ కార్యకర్తగా కొనసాగితే మాత్రం పైకి చిరునవ్వులు చిందిస్తూ మంచి మనసున్న వ్యక్తిలా జగన్మోహన్ రెడ్డి నటిస్తారు. వైయస్ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిల అరెస్టు గురించి పార్టీని నిజంగా ప్రేమించే తనలాంటి కార్యకర్తలు కంగారు పడవద్దు. మౌనంగా నిర్దోషులుగా విడుదల కావాలని ప్రార్థిద్దామని రఘురామకృష్ణం రాజు సూచించారు.
 సలహాదారులు ఇచ్చిన సలహాలపై శ్వేత పత్రం విడుదల చేయాలి
 ప్రభుత్వం నియమించిన సలహాదారులు ఇచ్చిన సలహాల వల్ల రాష్ట్రానికి ఒనగూరిన లాభం ఏమిటో చెప్పాలని రఘురామకృష్ణంరాజు డిమాండ్ చేశారు. ప్రభుత్వ సలహాదారులు గత నాలుగు ఏళ్లుగా ఎన్ని సలహాలను ఇచ్చారు. అందులో ప్రభుత్వం ఎన్నింటిని అమలు చేసింది. వాటి వల్ల రాష్ట్రానికి చేకూరిన ప్రయోజనాలు ఏమిటన్న దానిపై శ్వేత పత్రం విడుదల చేయాలి. సాక్షి దినపత్రిక యాజమాన్యం తన జీతం డబ్బులను కాపాడుకోవడానికి రామచంద్ర మూర్తి వంటి వారికి సలహాదారు పదవులు ఇవ్వగా, ఈ పదవి వల్ల ప్రయోజనం లేదని భావించి ఆయన తప్పుకున్నారు. ధర్మ పరిషత్ సలహాదారు పదవిని ఇవ్వగా చాగంటి కోటేశ్వరరావు హుందాగా తిరస్కరించడం ద్వారా అశేష ఆంధ్ర అభిమానులు ఉన్న ఆయన, విశేష కీర్తి, ప్రతిష్టలను సంపాదించుకున్నారని రఘురామకృష్ణం రాజు తెలిపారు. ఎంతోమంది మేధావులతో కలిసి ఏర్పాటు చేసిన ధర్మ పరిషత్ కమిటీ సభ్యులకు, సలహాలు ఇచ్చేంత విద్వత్ తనకుందని భావించడం లేదు. ఒకవేళ తనకు తెలిసిన ఏ విషయము అయినా అడిగితే, భగవంతుని భక్తుడిగా తప్పకుండా తెలియజేస్తానని చెప్పి, దానికి పదవే అవసరం లేదన్న చాగంటి కోటేశ్వరరావు వ్యాఖ్యలు, పదవి కోసం నానా గడ్డి కరిచే వారికి చెంప పెట్టని వ్యాఖ్యానించారు. చాగంటి కోటేశ్వరరావు, గరికపాటి నరసింహారావులు ఉభయగోదావరి జిల్లాలకు చెందిన వారే కావడం, తమ గోదావరి జిల్లా వాసులకు గర్వకారణమని పేర్కొన్నారు.
 ఈ ప్రభుత్వం మారిన తర్వాత విచారణ కోసం కేసు వేయాలి
 లాకప్ చిత్రహింసలపై తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి హైకోర్టును ఆశ్రయించాలని రఘురామకృష్ణంరాజు సూచించారు. గతంలో తాను లాకప్ చిత్రహింసలపై సుప్రీంకోర్టును ఆశ్రయించి పొరపాటు చేశాను. ఏడాది, ఎనిమిది నెలల పాటు కేసు విచారణకు రాకపోగా, ఆ తరువాత తనని హైకోర్టును ఆశ్రయించాలని సూచించారు. గత రెండు నెలల నుంచి హైకోర్టు లో కూడా ఈ కేసు విచారణకు రావడంలేదని తెలిపారు. అటువంటి పొరపాటున పట్టాభి చేయకుండా, నేరుగా హైకోర్టునే ఆశ్రయించాలి. అయినా విచారణ జరుగుతుందని నమ్మకం లేదు. కానీ ఈ ప్రభుత్వం మారిన తర్వాత, విచారణ జరిపించడానికి ఇప్పుడు కోర్టులో కేసు దాఖలు చేయాలని రఘురామకృష్ణం రాజు సూచించారు . తోటవల్లూరు పోలీస్ స్టేషన్లో పట్టాభి ముఖము పై టవల్ కప్పి, ముసుగు ధరించిన పోలీసులు చిత్రహింసలు పెట్టినట్లుగా చెప్పారు. గతంలో తనని కూడా ముసుగు ధరించిన వ్యక్తులే అరికాళ్ళపై 120 నుంచి 125 సార్లు కొట్టారు. ఇప్పుడు పట్టాభిని కాళ్లతో పాటు చేతులపై కూడా బెల్టుతో కొట్టారని చెబుతుంటే, తనకు గతంలో ఎదురైనా చేదు జ్ఞాపకం గుర్తుకు వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
 చంపడమే పరిష్కారమని జగన్ ఉద్దేశం
 తనని చంపివేయాలని జగన్మోహన్ రెడ్డి ఆదేశించినప్పటికీ, సునీల్ కుమార్ అనే దుర్మార్గుడైన అధికారి తన పైకి హత్య కేసు వస్తుందని కారణంతో కాబోలుతనని విడిచి పెట్టాడని రఘురామకృష్ణం రాజు అన్నారు . గుండె ఆపరేషన్ జరిగి ఉండడం వల్ల, దెబ్బలు తాళలేక మరణిస్తాడని అనుకొని వదిలిపెట్టి ఉంటాడు. కానీ, శ్రీ వెంకటేశ్వర స్వామి దయ వల్ల తాను బ్రతికి బయటపడ్డాను. చావు , చంపడమే పరిష్కారం అనుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని, ఆయన క్రూర, నేర, ప్రవృత్తి గురించి గతంలో చెప్పానని గుర్తు చేశారు. భవిష్యత్తులోనూ ఈ తరహా సంఘటనలు మరెన్నో జరగవచ్చు. పోలీస్ తప్పుడు కేసుల వల్ల వరుపుల రాజా వంటి వారు గుండెపోటుతో మరణించారు. పోలీసు తప్పుడు కేసులను ఎదుర్కోవడం అంత ఆశా, మాషి కాదు. ఎంతో గుండె ధైర్యం ఉండాలి. తనకు, పట్టాభి కి ఆ గుండె ధైర్యం ఉంది కాబట్టే లాకప్ లో ఎదుర్కొన్న చిత్రహింసల గురించి మీడియాకు చెప్పగలిగాము. తమతో పాటు ఎంతోమందిని అరెస్టు చేశారు. వారిని కూడా చిత్రహింసలకు గురిచేసి ఉంటారు. ఈ ప్రభుత్వం, పోలీసులను అడ్డం పెట్టుకొని అరెస్టు చేసేది చిత్రహింసలకు గురిచేసి భయభ్రాంతులను చేయడానికే నని రఘురామకృష్ణం రాజు తెలిపారు.
 తమకు ఒక రూల్... వైఎస్ కుటుంబానికి మరొక రూలా?
 తమకు ఒకరులైతే, వైయస్ కుటుంబానికి మరొక రూలా?అంటూ రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. తమకైతే నోటీసులు కూడా ఇవ్వరని, వైయస్ కుటుంబానికి నోటీసులు ఇచ్చిన విచారణకు హాజరు కారు. ఇంట్లో కూర్చుని మాట్లాడుకుని లేపేస్తారు. ఒకసారి విచారణకు హాజరైతే తెలుస్తుందని రఘురామకృష్ణంరాజు నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.
 రెన్యుబుల్ ఎనర్జీ కోసం
 పది లక్షల 80 వేల కోట్ల ఒప్పందాలు
 పారిశ్రామికవేత్తల సదస్సులో 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు గాను, 10 లక్షల 80 వేల కోట్ల రూపాయల ఒప్పందాలు రెన్యుబుల్ ఎనర్జీ కోసం కుదుర్చుకోవడం జరిగిందని రఘురామకృష్ణం రాజు తెలిపారు. 10 లక్షల 80 వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో విద్యుత్పత్తికి ఒప్పందాలు జరిగితే, ఇందులో 20వేల మెగావాట్ల పంపుడ్ స్టోరేజ్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి కోసం, 1,80,000 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి కోసం 
కొన్ని కంపెనీలతోరాష్ట్ర ప్రభుత్వం 
అంగీకారాన్ని కుదుర్చుకుందని వివరించారు. ఇవన్నీ ఉత్తుత్తి ఒప్పందాలు కాదని, వారం, వారం సమీక్షించి అమలుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్న రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, ప్రజల తరఫున రఘు రామకృష్ణంరాజు పలు ప్రశ్నలు సంధించారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల గురించి ప్రజల అవగాహన కోసం విద్యుత్ రంగ నిపుణులైన విద్యుత్ బోర్డు మాజీ చైర్మన్ పార్థసారథి, తెలంగాణకు చెందిన ప్రభాకర్ రావు, శర్మ వంటి నిష్ణాతుల తో పాటు, రక్షణ కల్పిస్తానంటే ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి తాను కూడా హాజరు అవుతాను. లేదంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొంటాను. రెండు లక్షల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లో భాగంగా ఒకొక్క మెగావాట్ విద్యుత్ ఉత్పత్తికి నాలుగున్నర ఎకరాల భూమి చొప్పున కావాలి. రెండు లక్షల మెగావాట్లకు గాను 9 లక్షల నుంచి తొమ్మిదిన్నర లక్షల ఎకరాల భూమి అవసరం . ఈ భూమిని ఎక్కడినుంచి తీసుకు రాగలరు. స్థల సేకరణకు మీకున్న ప్రణాళికలు ఏమిటి?. రాష్ట్రంలో ఎక్కడెక్కడ భూమిని గుర్తించారు??. అందులో ఎంత భూమిని సేకరించి ఉంచారని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. గతంలో అదాని కంపెనీకి సీలేరు వద్ద అటవీ భూమిని కేటాయించగా, అటవీ శాఖ తీవ్ర అభ్యంతరాన్ని తెలియజేసింది. రాష్ట్రంలో ప్రభుత్వ భూమి పెద్దగా లేదు. ఏ పేదవాడి భూమిని కొట్టి, పెద్దలకు కట్టబెట్టాలని నిర్ణయించారని నిలదీశారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఎంత?. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెబుతున్న దొంగ లెక్కలు కాకుండా నిజం లెక్కలు చెప్పండి. రాష్ట్రంలో ప్రస్తుతం 12 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని అనుకుంటే, రానున్న 10 ఏళ్లలో పది శాతం చొప్పున విద్యుత్ అవసరాలు పెరిగిన మరో వెయ్యి మెగావాట్లకు మాత్రమే డిమాండ్ ఉంటుంది. ఈ లెక్కన 20వేల మెగావాట్ల విద్యుత్ రాష్ట్ర ప్రజల వినియోగానికి అవసరం. రాష్ట్ర ప్రజలకు 20వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవసరం అయితే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఏకంగా రెండు లక్షల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం ఒప్పందాలను కుదుర్చుకుంది . ఈ ఒప్పందాలకు పిపిఏలుగా చేసుకుంటారా?, పిపిఏలు చేసుకోము... కానీ, భూమిని మాత్రమే ఇచ్చి ప్లాంట్లు పెట్టుకోమని చెబుతారా?? అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే రెండు లక్షల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని కొనుగోలు చేస్తామని, ఆ కంపెనీలతో విద్యుత్ బోర్డ్ పిపిఏ చేసుకుంటుందా?. భూమి అనేది రాష్ట్ర వనరు. విద్యుత్ కంపెనీలతో పిపిఏలు చేసుకోవు. రాష్ట్ర ప్రజలకు అవసరం లేని విద్యుత్ కోసం భూమి ఇవ్వడం వల్ల, రాష్ట్రానికి వచ్చే ప్రయోజనం ఏమిటి?? అని ఆయన నిలదీశారు. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్ లో 10% విద్యుత్ ను రాష్ట్ర అవసరాల నిమిత్తం ఉచితంగా ఇవ్వాలని ఒప్పందంలో భాగంగా అడిగారా? అంటే అడగలేదు. ఎలక్ట్రిసిటీ ప్లాంట్ల ఏర్పాటు వల్ల రాష్ట్రానికి దమ్మిడి ఆదాయం ఉండదు. ఉత్పత్తి అయ్యే విద్యుత్ పై ట్యాక్స్ వేయడానికి వీలు లేదు. ఒక్కొక్క మెగావాట్ విద్యుత్ ఉత్పత్తికి ఐదు కోట్ల రూపాయల ఖర్చు అయితే, సివిల్ వర్క్ కు కేవలం 40 నుంచి 50 లక్షల రూపాయలు మాత్రమే ఖర్చవుతాయి. ఈ 40 నుంచి 50 లక్షల రూపాయలపైన టాక్స్ ల రూపంలో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం లభిస్తుంది. అమర్ రాజా బ్యాటరీ కంపెనీ వంటి సంస్థలు ఉత్పత్తి చేసే ప్రతి వస్తువు ద్వారా రాష్ట్రానికి ఏదో ఒక రూపంలో ఆదాయం లభిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం వ్యవసాయ భూములతో పాటు, అటవీ భూములను కూడా అప్ప చెప్పాల్సిన దుస్థితి నెలకొంటుంది. విద్యుత్ ఉత్పత్తి జరిగితే, దాన్ని గ్రిడ్ కు అనుసంధానం చేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 13 నుంచి 14 వేల మెగావాట్ల విద్యుత్ సరఫరా కు మాత్రమే సౌకర్యాలు ఉన్నాయి. మరో నాలుగైదు పవర్ గ్రిడ్ సబ్ స్టేషన్లు ఏర్పాటు చేసిన, 736 కేవీ లైన్లు వేస్తే, మరో నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ సరఫరాకు సౌకర్యం లభిస్తుంది. రెండు లక్షల మెగావాట్ల విద్యుత్ సరఫరాకు దేశంలోనే గ్రిడ్ సౌకర్యం లేదని రఘురామకృష్ణంరాజు తేల్చి చెప్పారు. ఒకవైపు విద్యుత్ ఉత్పత్తి జరిగినా, కొనుగోలుకు డిమాండ్ లేదని... సరఫరా చేయడానికి సౌకర్యాలు లేవని చెప్పారు. రెండు లక్షల మెగావాట్ల విద్యుత్ సరఫరా కు ఎన్ని టవర్లు, ఎన్ని లైన్లు వేయాల్సి ఉంటుందో తెలుసా అని ప్రశ్నించిన ఆయన, ఆకాశమంతా తీగలమయమే అవుతుందని అపహాస్యం చేశారు.
 ఒక్క అవకాశం అంటే నమ్మినవారు... రేపు బంగారు భవిష్యత్తు అంటే నమ్మరా?
 ఒక్క అవకాశం ఇవ్వమని అడిగితే నమ్మి ఓటేసిన వారు, రేపు మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలు చేసుకున్నానని చెబితే నమ్మరా అన్న ధీమాతో జగన్మోహన్ రెడ్డి అప్పుడే తప్పుడు ప్రచారాన్ని ప్రారంభించారని రఘురామకృష్ణం రాజు అన్నారు. తన ముఖం చూసి, విశాఖకు మకాం మార్చుతానని చెప్పగానే లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయన్న జగన్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి . ఒప్పందాలు జరగగానే అప్పుడే విశాఖకు విమానాల సంఖ్య పెరిగిందని సాక్షి దినపత్రిక అడ్డగోలు కథనం రాయడం విడ్డూరంగా ఉంది. గతంలోని విశాఖ విమానాశ్రయ విస్తరణకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేశారు. ఎప్పుడో జరిగిన అభివృద్ధి పనులకు, ప్రస్తుత విశాఖ పారిశ్రామిక సదస్సుకు లింకులు పెట్టి వార్తా కథనాలను రాస్తే ప్రజలు కొన్ని రోజులు నమ్మవచ్చు కానీ అది భూమ రాంగ్ అయ్యే ప్రమాదం లేకపోలేదని రఘురామకృష్ణం రాజు హెచ్చరించారు.