home page

ఆకాశవాణి-రేడియోకు 'వంద'నం!

 | 
Radio

సంగీత సాహిత్యాది రంగాలకు చెందిన ఎందరో ప్రఖ్యాతులకు ఆకాశవాణి కొలువులిచ్చింది. 

రేడియో కార్యక్రమాల్లో భాగంగా తొలి తెలుగు ప్రసంగం చేసిన ఘనత గిడుగు రామమూర్తి పంతులుకు దక్కుతుంది.

లలిత సంగీతం, శాస్త్రీయ సంగీత కార్యక్రమాలు రేడియో ద్వారానే బహుళ జనాదరణ పొందాయి. 

ప్రపంచ రేడియో దినోత్సవo

(రాజ పెంటపాటి , బ్యూరో చీఫ్ మిర్రర్ టుడే అమరావతి)


అమరావతీ ఫిబ్రవరి 13( మిర్రర్ టుడే) ఏపీ 

తెలుగులో తొలి రేడియో ప్రసారాలు 1938 జూన్‌ 16న సాయంత్రం5.30 గంటలకు ప్రారంభమయ్యాయి. త్యాగరాజ స్వామి తెలుగులో రచించిన ‘శ్రీగణపతిని సేవింపరాదే’ కృతిని తిరువెన్కాడు సుబ్రహ్మణ్య పిళ్లె నాదస్వరంపై వాయించగా, అది మద్రాసు కేంద్రం నుంచి ప్రసారమైంది. అదేరోజు రాత్రి 8.15 గంటలకు నాటి మద్రాసు రాష్ట్ర ప్రధాని కూర్మ వెంకటరెడ్డి నాయుడు ‘భారత దేశం–రేడియో’ అంశంపై తెలుగులో ప్రసంగించారు. ‘‘నేనిప్పుడు చెన్నపట్నము నుంచి మాట్లాడుచున్నాను. మీరెక్కడ నుంచి వినుచున్నారో నేను చెప్పజాలను. కాని అనేక స్థలములయందు ఉండి వినుచున్నారని తలచుచున్నాను.’’ అంటూ ప్రారంభించారు. తెలుగులో ఇదే తొలి రేడియో ప్రసంగం. అయితే, ఇది ప్రారంభోపన్యాసం మాత్రమే.

రేడియో కార్యక్రమాల్లో భాగంగా తొలి తెలుగు ప్రసంగం చేసిన ఘనత గిడుగు రామమూర్తి పంతులుకు దక్కుతుంది. ‘సజీవమైన తెలుగు’ అనే అంశంపై గిడుగు 1938 జూన్‌ 18న పదిహేను నిమిషాల ప్రసంగం చేశారు. మద్రాసు కేంద్రం నుంచి ప్రసారమైన తొలి తెలుగు నాటకం ‘అనార్కలి’. ముద్దుకృష్ణ రచించిన ‘అనార్కలి’ని ఆచంట జానకిరాం రేడియో నాటకంగా రూపొందించారు. ఇది 1938 జూన్‌ 24 రాత్రి 8.30 గంటలకు ప్రసారమైంది. ఇందులో సలీం పాత్రను దేవులపల్లి కృష్ణశాస్త్రి, అనార్కలి పాత్రను ‘రేడియో భానుమతి’గా ప్రసిద్ధి పొందిన పున్నావఝల భానుమతి, అక్బర్‌ పాత్రను అయ్యగారి వీరభద్రరావు పోషించారు. ఈ నాటకం ప్రసారమైన మరుసటి రోజు రాత్రి జానపద సంగీత కార్యక్రమం ప్రసారమైంది. మద్రాసు కేంద్రం నుంచి తొలి తెలుగు వ్యాఖ్యాతగా ప్రముఖ చరిత్ర పరిశోధకుడు మల్లంపల్లి సోమశేఖర శర్మ సోదరుడైన మల్లంపల్లి ఉమామహేశ్వరరావు పనిచేశారు. పిల్లల కార్యక్రమాల ద్వారా ఆయన ‘రేడియో తాతయ్య’గా ప్రసిద్ధి పొందారు.

ఆకాశవాణి కార్యక్రమాలు..

ఆకాశవాణి కేంద్రాలు వార్తలతో పాటు వివిధ వర్గాల ప్రజల కోసం విజ్ఞాన వినోదాలతో కూడిన అనేక కార్యక్రమాలను ప్రసారం చేస్తూ వస్తున్నాయి. టీవీ ప్రాచుర్యం పెరగక ముందు చాలామంది వ్యాఖ్యాతలు, న్యూస్‌ రీడర్లు, సంగీతకారులు, కవులు, రచయితలు ఆకాశవాణి ద్వారానే ప్రసిద్ధి పొందారు. సమాచార వ్యవస్థ పటిష్ఠంగా లేని రోజుల్లో జన సామాన్యానికి రేడియో వార్తలే ఆధారంగా ఉండేవి. ఆకాశవాణి ఏనాడూ సంచలనాల కోసం వార్తలు ప్రసారం చేయకపోయినా, పలు సంఘటనలకు సంబంధించిన బ్రేకింగ్‌ వార్తలను అందించిన ఘనతను దక్కించుకోగలిగింది. అంజయ్య మంత్రివర్గం రాజీనామా, విమాన ప్రమాదంలో సంజయ్‌ గాంధీ మరణం, ఎన్టీఆర్‌ మరణవార్త మొదటిగా వెల్లడి చేసిన ఘనత ఆకాశవాణి వార్తలకే దక్కుతుంది. ఢిల్లీ నుంచి తెలుగులో వార్తలు చదివిన తొలితరం వారిలో శ్రీశ్రీ, కొంగర జగ్గయ్య, పన్యాల రంగనాథరావు వంటి వారు ఉన్నారు. కపిల కాశీపతి, శ్రీవాస్తవ, కొత్తపల్లి సుబ్రహ్మణ్యం, కందుకూరి సూర్యనారాయణ,దుగ్గిరాల పూర్ణయ్య, తిరుమలశెట్టి శ్రీరాములు, ఏడిద గోపాలరావు, మల్లాది రామారావు, అద్దంకి మన్నార్, పీఎస్సార్‌ ఆంజనేయ శాస్త్రి, డి.వెంకట్రామయ్య, ప్రయాగ రామకృష్ణ, మామిళ్లపలి రాజ్యలక్ష్మి, జోళిపాలెం మంగమ్మ, జ్యోత్స్నాదేవి తదితరులు ఎందరో రేడియోలో వార్తలు చదవడం ద్వారా ప్రసిద్ధులయ్యారు.

లలిత సంగీతం, శాస్త్రీయ సంగీత కార్యక్రమాలు రేడియో ద్వారానే బహుళ జనాదరణ పొందాయి. తొలినాళ్లలో ‘గీతావళి’ పేరుతో భావగీతాలు ప్రసారమయ్యేవి. ‘లలిత సంగీతం’ అనే పేరు మాత్రం ఆకాశవాణి ద్వారానే ప్రచారంలోకి వచ్చింది. పాలగుమ్మి విశ్వనాథం, బాలాంత్రపు రజనీకాంతరావు, ఎమ్మెస్‌ రామారావు, ఘంటసాల, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, చిత్తరంజన్, మల్లిక్, సాలూరి రాజేశ్వరరావు, బాలసరస్వతి, టంగుటూరి సూర్యకుమారి, శ్రీరంగం గోపాలరత్నం,  వేదవతీ ప్రభాకర్‌ వంటి సుప్రసిద్ధ స్వరకర్తలు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, దాశరథి వంటి ప్రముఖ కవులు ఆకాశవాణి లలిత సంగీత కార్యక్రమాలకు వన్నె తెచ్చారు. విద్యార్థులకు, గ్రామీణులకు, కార్మికులకు, యువతరానికి, కవులు, రచయితలకు ఆకాశవాణి అనేక కార్యక్రమాలను ప్రసారం చేసేది. ఈ కార్యక్రమాల ద్వారా పలువురు వ్యాఖ్యాతలు శ్రోతల మనసుల్లో చెరగని ముద్ర వేశారు. 

ఎందరో మహానుభావులు...

సంగీత సాహిత్యాది రంగాలకు చెందిన ఎందరో ప్రఖ్యాతులకు ఆకాశవాణి కొలువులిచ్చింది. శ్రీశ్రీ, జాషువా వంటి కవులు కొంతకాలం ఆకాశవాణిలో పనిచేశారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి, బుచ్చిబాబు, త్రిపురనేని గోపీచంద్, ఆచంట జానకిరాం, తెన్నేటి హేమలత, దాశరథి,  మంగళంపల్లి బాలమురళీకృష్ణ, బాలంత్రపు రజనీకాంతరావు, బందా కనకలింగేశ్వరరావు వంటి సాహితీ సంగీత నాటకరంగ ప్రముఖులు ఆకాశవాణిలో పనిచేసిన వారే. గ్రామీణ కార్యక్రమాల వ్యాఖ్యాతగా ప్రయాగ నరసింహశాస్త్రి గ్రామీణ శ్రోతలకు చేరువైతే, ‘ధర్మ సందేహాలు’ కార్యక్రమం ద్వారా ఉషశ్రీ రేడియో శ్రోతల్లో ఆబాలగోపాలాన్నీ అలరించారు. రేడియో అన్నయ్య, అక్కయ్యలుగా ప్రసిద్ధి పొందిన న్యాయపతి రాఘవరావు, కామేశ్వరి బాలల కార్యక్రమాల ద్వారా కొన్ని తరాల పిల్లలను ప్రభావితం చేశారు. ఆకాశవాణికి సేవలందించిన ప్రముఖుల జాబితా చాలా పెద్దది. ఆకాశవాణిని జనరంజకంగా తీర్చిదిద్దడంలో ఎందరో మహానుభావులు ఎనలేని కృషి చేశారు. వారందరికీ వందనాలు