'ఆ పత్రికల వల్లే మీరు పెద్దవాళ్ళయ్యారు'
రామవరప్పాడు (విజయవాడ);
సమస్యల గురించి చెబుతున్న మహిళను....
‘నువ్వు ఆ రెండు పత్రికలు బాగా చదువుతున్నట్లున్నావు..’ అంటూ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించగా..
‘వాటివల్లేగా మీరు పైకొచ్చింది’ అంటూ ఆమె ఘాటుగా సమాధానం చెప్పారు.
ఈ ఉదంతం విజయవాడ గ్రామీణ మండలం నిడమానూరులో జరిగింది.
‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా ఆయన మంగళవారం ఇంటింటికీ తిరిగారు. సీహెచ్.భవాని అనే మహిళ వచ్చి ‘గతంలో ఈ ప్రాంతంలో ఐటీ కంపెనీలు ఉండేవి. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్లిపోయాయి. దీంతో యువత ఇతర రాష్ట్రాలకు వలస పోతున్నారు. మీ జగన్‌ను అడిగి పరిశ్రమలు, ఐటీ కంపెనీలను తీసుకురండి’.. అని సూచించారు. దీనికి స్పందించిన వంశీ ‘చూడండి అక్కా.. మీరు ‘ఈనాడు’, ‘ఆంధ్రజ్యోతి’ పత్రికలను బాగా చూస్తున్నట్లున్నారు’ అంటూ వ్యంగ్యంగా అన్నారు. దానికి ఆ మహిళ ‘మీరు పెద్దవాళ్లు అయ్యింది ఆ పత్రికల వల్లనేగా’ అంటూ ఆమె ఘాటుగా సమాధానం చెప్పారు. దీంతో తమాయించుకున్న వంశీ మాట్లాడుతూ..
♦️‘ఇక్కడి వాతావరణంలో ఉద్యోగులు పని చేయలేకపోవడంతో చాలా కంపెనీలు వెళ్లిపోయాయి’ అని వివరించారు. దీనికి ఆమె ‘ఇంకా హైదరాబాద్‌నే అభివృద్ధి చేయాలని చూస్తున్నారు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యల గురించి ఎమ్మెల్యే వంశీ మహిళలతో మాట్లాడుతుండగా వాలంటీరు ఫొటోలు తీశారు. దీనిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేయగా.. వ్యక్తిగత సిబ్బంది ఆ ఫొటోలను డిలీట్ చేయించారు.