home page

జర్నలిస్టు రాజ గోపాల్ కు వైఎస్సార్ జీవిత సాఫల్య అవార్డు

సాదా సీదా కాదు

సరదా జర్నలిస్ట్  

 | 
rajgopal
ఉత్తరాంధ్ర జర్నలిస్టులకు గుర్తింపు : రాజగోపాల్
***********
జర్నలిజం లో డాక్టర్ వైఎస్సార్ లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్ అవార్డు పొందిన మంగు రాజగోపాల్ ఉత్తరాంధ్రకు చెందినవారు. 1953 లో జన్మించిన ఆయన స్వస్థలం శ్రీకాకుళం కాగా స్థిరపడ్డ ఊరు విశాఖపట్నం. శ్రీకాకుళం మునిసిపల్ స్కూలులో ప్రాధమిక విద్యాభ్యాసం చేశారు. విశాఖపట్నం మిసెస్ ఏవిఎన్ కళాశాలలో బి.కాం చదివారు. తెలుగు భాష, సాహిత్యాల పట్ల ఎనలేని అభిమానం ఉన్న రాజగోపాల్ హైస్కూలు, డిగ్రీ చదివే రోజుల్లోనే ఎన్నో కథలు రాశారు. ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి వార పత్రికల్లో, తరుణి, వసుధ వంటి ఎన్నో మాస పత్రికల్లో ఆయన కథలు అచ్చయ్యాయి. 
1976 లో హైదరాబాద్ ఈనాడు లో సబ్ ఎడిటర్ ట్రయినీగా రాజగోపాల్ పాత్రికేయ ప్రస్థానం ప్రారంభమైంది. ఈనాడు, ఆంధ్రప్రభ, ఇండియన్ ఎక్స్ ప్రెస్, ఆంధ్రభూమి, సూర్యప్రభ, ఆంధ్రజ్యోతి, ఆదాబ్ హైదరాబాద్, మన తెలంగాణ పత్రికల్లో,  ఏబిఎన్, హెచ్ ఎంటీవీ చానెళ్లలో ట్రయినీ మొదలుకొని ఎడిటర్ స్థాయి వరకు ఎన్నో హోదాల్లో పని చేశారు.  దాదాపు 45 ఏళ్ల పాత్రికేయ ప్రస్థానంలో సగం కాలం విశాఖపట్నంలో, సగం కాలం హైదరాబాద్ లో గడిచింది.
దాదాపు 35 సంవత్సరాలు పత్రికారంగంలో ఒక వెలుగు వెలిగిన జిల్లా టాబ్లాయిడ్స్ కి ఓం ప్రథమంగా నాంది పలికింది రాజగోపాల్ గారే. ఆయన ఆంధ్రభూమి, విశాఖపట్నం న్యూస్ ఎడిటర్ గా ఉన్నప్పుడు కేవలం ఆ ఎడిషన్ కే పరిమితం చేస్తూ 'ఆంధ్రభూమి అనుదిన అనుబంధం' పేరుతో జిల్లా వార్తల కోసం టాబ్లాయిడ్  సైజులో అనుబంధాలు ప్రారంభించి చరిత్ర సృష్టించారు. 
వర్తమాన రాజకీయాలపై పదునైన వ్యంగ్యాస్త్రాలు ఎక్కుపెట్టడంలో రాజగోపాల్ ది అందె వేసిన చేయి. ఆంధ్రజ్యోతి హైదరాబాద్ ఎడిషన్ పని చేస్తున్నప్పుడు ఆదివారం అనుబంధంలో 'సరదాకి' శీర్షికతో అయిదేళ్ల పాటు రాజగోపాల్ రాసిన రాజకీయ వ్యంగ్య రచనలు ఆయనకు ఎనలేని పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. ఈ రచనలు 'సరదాకి' పేరుతోనే పుస్తకంగా కూడా వచ్చింది. 
వ్యంగ్య రచనలో రాజగోపాల్ ప్రతిభకు గుర్తింపుగా హైదరాబాద్ లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం ఆయనకు ఉత్తమ హాస్య రచయిత అవార్డుతో సత్కరించింది. శ్రీకాకుళం జిల్లా అవతరణ స్వర్ణోత్సవాల సందర్భంగా 2000 లో  ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజగోపాల్ ని శ్రీకాకుళం జిల్లాకి చెందిన ఉత్తమ జర్నలిస్టుగా స్వర్ణోత్సవాల వేదికపై సత్కరించారు. వర్కింగ్ జర్నలిస్టుగా రాజగోపాల్ నాలుగు దశాబ్దాల ప్రస్థానానికి గుర్తింపుగా 2017లో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు రాజగోపాల్ ని రవీంద్రభారతిలో జరిగిన ఒక సభలో సత్కరించారు. ఇంకా హైదరాబాద్ లో కిన్నెర వంటి ప్రముఖ సాంస్కృతిక సంస్థల నుంచి కూడా ఆయన సత్కారాలు అందుకున్నారు.
" ఇది ఉత్తరాంధ్ర జర్నలిస్టులకు ప్రభుత్వ  గుర్తింపుగా భావిస్తున్నాన"ని డా.వైఎస్సార్ జీవిత సాఫల్య అవార్డు గురించి రాజగోపాల్ వ్యాఖ్యానించారు. అవార్డుల ప్రదానోత్సవం నవంబర్ ఒకటవ తేదీన విజయవాడలో జరుగుతుంది.