వైసీపీకి రంగులు పిచ్చి....!
జనం ముద్ర దక్కలేదుగా
2019 ఎన్నికల్లో 151 స్థానాల్ని గెలుచుకున్న వైసీపీ, 2024 ఎన్నికల్లో 175 స్థానాలపైనా గురి పెట్టడాన్ని తప్పు పట్టలేం. కానీ, గడచిన మూడున్నరేళ్ళలో వైసీపీ ఏం చేయగలిగింది రాష్ట్రానికి.? అంటే, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం కదా.. అని వైసీపీ నేతలు చెబుతున్నారు. కానీ, గడచిన మూడున్నరేళ్ళలో వైసీపీ పాలన అంతా విగ్రహాలు, రంగులు, పేర్లు.. ఇలాగే సాగుతోందన్నది ప్రముఖంగా వినిపిస్తోన్న విమర్శ.
టీడీపీ హయాంలో అంతా ‘పసుపు రంగు’ కనిపించిందని అప్పట్లో వైసీపీ విమర్శించింది. పేర్ల మార్పుపైనా మండిపడింది. ఆ రంగుల పిచ్చి, పేర్ల పిచ్చి కారణంగానే టీడీపీ అధికారం కోల్పోయిందని వైసీపీ నేతలే విమర్శించారు. మరి, అదే తప్పు.. అంతకన్నా దారుణంగా చేస్తే.. వైసీపీ పరిస్థితి ఏమవుతుంది 2024 ఎన్నికల్లో.? ప్రభుత్వ కార్యాయాలయాలకి వైసీపీ రంగుల దగ్గర్నుంచి, యూనివర్సిటీల పేరు మార్పు వరకూ.. విగ్రహాల దగ్గర్నుంచి.. నిగ్రహం కోల్పోయి బూతులు మాట్లాడే మంత్రుల వరకూ.. రాష్ట్రంలో అసలేం జరుగుతోంది.? వైసీపీ పాలన వల్ల ప్రజలకు ఒరిగిందేంటి.?
యోగి వేమన విశ్వ విద్యాలయంలో, వేమన విగ్రహాన్ని పక్కన పెట్టేసి.. వైఎస్సార్ విగ్రహాన్ని పెట్టింది వైసీపీ సర్కారు. ప్రజలు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి.? రేప్పొద్దున్న ఇంకో పార్టీ ఏదన్నా అధికారంలోకి వస్తే.. ఈ రంగులు, ఈ విగ్రహాలు, ఈ పేర్లూ అన్నీ మార్చేసుకోవచ్చనే కదా.? రాజధానుల వివాదం దగ్గర్నుంచి రంగులు, విగ్రహాలు, పేర్లు.. ఇలా అన్నీ వివాదాస్పద వ్యవహరాలే.! రాష్ట్రానికి మాత్రం ప్రత్యేక హోదా రాలేదు. అసలంటూ రాష్ట్రానికి రాజధాని వుందో లేదో తెలియదు. ఈ పరిస్థితులకు కారణమైన వైసీపీ, తిరిగి అధికారంలోకి వచ్చేదెలా.? అసలు అది సాధ్యమయ్యే పనేనా.?