home page

సిక్కోలు సీన్ మారుతుందా?

టిడిపి కి అనుకూలంగా వుందా?

వైసీపీ వ్యూహం ఏమిటి?

 | 
Dharmana

గెలుపు మలుపులో ధర్మాన ప్రసాదరావు 

శ్రీకాకుళం జిల్లాలో తాజా రాజకీయ పరిస్థితి

ఇచ్ఛాపురం ` ఈ నియోజకవర్గంలో గత రెండు అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం అభ్యర్థి డాక్టర్‌ బెందాళం అశోక్‌ ఘన విజయం సాధించారు. 2014లో వైసీపీ అభ్యర్థి, యాదవ కులస్తుడు నర్తు రామారావు, 2019లో వైసీపీ అభ్యర్థి, కాళింగ కులస్తుడు పిరియా సాయిరాజ్‌పై ఆయన సునాయాసంగా గెలిచారు. అశోక్‌ కూడా కాళింగ కులస్తుడే. ఇప్పటికీ ఇక్కడ టీడీపీ అభ్యర్థే గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. పప్రస్తుతం నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న పిరియా సాయిరాజ్‌కు వైసీపీ నాయకులే సహకరించే పరిస్థితి లేదు. మళ్లీ వైసీపీ టికెట్‌ ఆయనకే ఇస్తే గెలవటం కష్టం. మాజీ ఎమ్మెల్యే నరేష్‌కుమార్‌ అగర్వాలా (లల్లూ), నర్తు రామారావు, సీడ్‌ ఏపీ చైర్మన్‌ సాడి శ్యామ్‌ప్రసాదరెడ్డి, కవిటి ఎంపీపీ పద్మ (నర్తు రామారావు కుమార్తె) భర్త కడియాల ప్రకాష్‌, డాక్టర్‌ ఉలాల కోదండరామ్‌ ఇక్కడి టికెట్‌ ఆశిస్తున్నారు. విశాఖలో ఉంటున్న అనపర్తి వాసి, ఏపీ మారిటైమ్‌ బోర్డు చైర్మన్‌ కాయల వెంకటరెడ్డి, గాజువాకలో స్థిరపడిన కడప జిల్లాకు చెందిన ఎస్‌ఆర్‌ షాపింగ్‌ మాల్స్‌ అధినేత గోపీనాథరెడ్డి పేర్లు తరచూ వార్తల్లోకి వస్తుంటాయి. ప్రతి జిల్లాలోనూ తమ సామాజికవర్గ ప్రతినిధి ఉండాలన్న జగన్‌మోహన్‌రెడ్డి వ్యూహంలో భాగంగా వీరి పేర్లు పరిశీలనలో ఉన్నాయన్న వాదన బలంగా ఉంది. నియోజకవర్గంలో మెజారిటీ ఓటర్లయిన రెడ్డిక కులస్తులు, యాదవులు తమవారికి టికెట్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. యాదవులు, కీలకమైన ఒరియా మైనారిటీలు, ఇతర కులాలవారు టీడీపీవైపై మొగ్గు చూపుతున్నారు. గణనీయ సంఖ్యలో ఉన్న మత్స్యకారుల్లో మెజారిటీ, యువత జనసేనకు మద్దతు ఇస్తున్నారు. మొత్తంమ్మీద ఇచ్ఛాపురంలో టీడీపీకే అనుకూల పరిస్థితి ఉంది.

పలాస ` మంత్రి సీదిరి అప్పలరాజుపై నియోజకవర్గంలో వ్యతిరేకత రోజురోజుకూ పెరుగుతోంది. పార్టీ నేతల్లో కొందరు ఆయనను గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. ఆయన తీరును ఎండగడుతూ ప్రెస్‌మీట్లు కూడా పెట్టే స్థాయికి వ్యతిరేకత పెరిగింది. పలాస పరిసరాల్లోని భూములు, స్థలాలను కబ్జా చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీటిల్లో వాస్తవం లేకపోలేదు. ఆయన వ్యవహార శైలి, మాటతీరుపై జనాల్లో వ్యతిరేకత పెరుగుతోంది. గత ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి గౌతు శిరీష ఓడిపోవటానికి కూడా ఇలాంటి వ్యతిరేకతే కారణం. శిరీష భర్త వెంకన్న చౌదరి (స్థానికంగా వీసీ అంటారు) సెటిల్‌మెంట్లు, కబ్జాలకు భయపడిన వ్యాపారులు దెబ్బతీశారని చెబుతారు. ఈ నియోజకవర్గంలో యాదవులు, పల్లీలు (మత్స్యకారులు), కళింగ కోమట్లు, కాళింగులు కీలకం. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ సోదరుడు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పదవిని ఆశించి భంగపడ్డారు. యాదవులు, కళింగ కోమట్లు, కాళింగులు సీదిరి అప్పలరాజుకు సహకరించరన్న వాదన బలంగా ఉంది. శిరీష భర్త వెంకన్న చౌదరి లోప్రొఫైల్‌లో ఉంటే టీడీపీ విజయావకాశాలు మెరుగుపడతాయి.

టెక్కలి ` టీడీపీ అభ్యర్థి అచ్చెన్నాయుడుకు అనుకూలంగా పరిణామాలు మారుతున్నాయి. గత ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పేరాడ తిలక్‌కు ఎంపీ అభ్యర్థిగా పోటీచేసిన దువ్వాడ శ్రీనివాస్‌ వర్గం సహకరించలేదు. అది అచ్చెన్నాయుడుకు కలిసివచ్చింది. ఈసారి టికెట్‌ దువ్వాడ శ్రీనివాస్‌కే ఇస్తామని సీఎం జగన్‌ ఇప్పటికే నియోజకవర్గ నేతలతో నిర్వహించిన సమావేశంలో ప్రకటించారు. దీనిని పేరాడ తిలక్‌ వర్గం, పలువురు నాయకులు ఆ సమావేశంలోనే బహిరంగంగా వ్యతిరేకించారు. ఎమ్మెల్సీ పదవిలో ఉన్న శ్రీనివాస్‌ వ్యవహార శైలి చాలా అహంకారపూరితంగా ఉంటుందన్న ఆరోపణలు ఉన్నాయి. సీనియర్‌ నాయకులు, కార్యకర్తలను తరచూ ఆయన అవమానిస్తుంటారని చెబుతారు. ఇక్కడ కూడా యాదవులు వైసీపీ టికెట్‌ ఆశిస్తున్నారు. మొత్తమ్మీద అచ్చెన్నాయుడుకే కొంత అనుకూలంగా ఉంది.

పాతపట్నం ` వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతిపై వ్యతిరేకత తారాస్థాయిలో ఉంది. ఆమె స్థానికంగా ఉండకపోవటం, ఆమె వ్యక్తిగత సహాయకుల దందాలు ఇందుకు కారణం. ఆమె ఎక్కువగా ఢల్లీిలో ఉంటారు. స్థానిక సమస్యలపై పెద్దగా స్పందించరు. నియోజకవర్గ నేతల్లో చాలామంది ఆమె వ్యవహారశైలితో విసిగిపోయారు. కాళింగ కార్పొరేషన్‌ చైర్మన్‌, మంత్రి ధర్మాన ప్రసాదరావు అనుచరుడు మామిడి శ్రీకాంత్‌ వైసీపీ టికెట్‌ ఆశిస్తున్నారు. అందుకు తగినట్టు పావులు కదపుతున్నారు. రెడ్డి శాంతిపై ఉన్న తీవ్ర వ్యతిరేకత టీడీపీ అభ్యర్థి కలమట వెంకటరమణకు అనుకూలంగా మార్చుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. రెడ్డి శాంతికే మళ్లీ టికెట్‌ ఇస్తే టీడీపీ అభ్యర్థి కచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయి.

నరసన్నపేట ` మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ పరిస్థితి కొంతవరకు ఫరవాలేదు. పార్టీ నాయకులు ఎవరూ ఆయనను పెద్దగా వ్యతిరేకించటం లేదు. కానీ ఆయన కుమారుడు, పోలాకి జడ్పీటీసీ డాక్టర్‌ కృష్ణచైతన్య అహంకారపూరిత వైఖరి ఆయనకు చాలా నష్టం కలిగిస్తోంది. తల్లి పద్మప్రియ బాటలో చైతన్య నడుస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. కాళింగుల్లో మెజారిటీ, వెలమల్లో కొందరు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వెలమ కులానికి చెందిన కృష్ణదాస్‌ కొన్ని పదవుల విషయంలో తమకు అన్యాయం చేశారని కీలకమైన సారవకోట మండల వెలమ నేతలు భావిస్తున్నారు. మరోవైపు మెతక వైఖరి కూడా పార్టీకి నష్టం కలిగిస్తోంది. టీడీపీ అభ్యర్థి బగ్గు రమణమూర్తి ప్రస్తుతానికి గట్టి పోటీ కాకపోయినప్పటికీ టీడీపీ ప్రభంజనం, కృష్ణచైతన్య ఎఫెక్ట్‌ ఆయనకు అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయి.

శ్రీకాకుళం ` మంత్రి ధర్మాన ప్రసాదరావు పరిస్థితి కూడా రానురాను నిరాశాజనకంగా మారుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. శ్రీకాకుళం నగరంలోని కీలకమైన కళింగ కోమట్లు ఆయన పట్ల వ్యతిరేకతతో ఉన్నారని తెలుస్తోంది. విశాఖలో భూముల కబ్జాల వార్తలు ఆయనకు కొంతమేర నష్టం కలిగించాయనే చెప్పాలి. విద్యావంతులు దీనిని జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ అభ్యర్థి గుండ లక్ష్మీదేవి కూడా వెలమ కులస్తురాలే. వెలమల్లో గుండ కుటుంబానికి మంచి ఆదరణ ఉంది. అయితే టీడీపీ టికెట్‌ గొండు శంకర్‌ ఆశిస్తున్నారు. దీనికోసం గట్టిగా పావులు కదుపుతున్నారు. గుండ అప్పల సూర్యనారాయణ, లక్ష్మీదేవి తమ కుమారుడిని వారసుడిగా తీసుకువద్దామని భావిస్తున్నప్పటికీ ఆయన విదేశాల్లో ఉండటంతో స్థానికులకు పెద్దగా తెలియదు. టీడీపీ అభ్యర్థిపై క్లారిటీ లేకపోవటం ధర్మానకు అనుకూల అంశం. రాజకీయ చాణుక్యుడైన ధర్మాన గెలుపు ఖాయమని వైసీపీ శ్రేణులు గట్టిగా భావిస్తున్నాయి.

ఆమదాలవలస ` వైసీపీ అభ్యర్థి, స్పీకర తమ్మినేని సీతారామ్‌పై వ్యతిరేకత అకాశాన్నంటుతోంది. వైసీపీ నేతలు, కార్యకర్తలే ఆయనను ప్ర్రైవేటు సంభాషణల్లో తీవ్రంగా దూషిస్తున్నారు. ఆయన కుమారుడు చిరంజీవి నాగ్‌ వ్యవహార శైలి దీనికి ప్రధాన కారణం. ఎంతో అహంకారంగా ఉండే నాని కబ్జాలు, సెటిల్‌మెంట్లు, వసూళ్లకు పాల్పడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. గతంలో తమ్మినేని భార్య వాణి ఈ పనులన్నీ చేసేవారని, ఇప్పుడ నాని రెచ్చిపోతున్నారని చెబుతున్నారు. మరోవైపు వైసీపీకే చెందిన సువ్వారి గాంధీ, చింతాడ రవికుమార్‌ పార్టీ శ్రేణులను తమ వైపు తిప్పుకుంటున్నారు. సువ్వారీ గాంధీ తరచూ ఏదో ఒక కార్యక్రమం పేరిల భారీ జన సమీకరణ  చేస్తూ బల ప్రదర్శన చేస్తున్నారు. టీడీపీ అభ్యర్థి, తమ్మినేని మేనల్లుడు కూన రవికుమార్‌ క్రమేణా బలం పుంజుకుంటున్నారు. ఇక్కడ వైసీపీపై కన్నా తమ్మినేని కుటుంబ సభ్యులపై ఉన్న వ్యతిరేకత కూన రవికుమార్‌కు ఎక్కువగా బలం చేకూరుస్తోంది.
పాలకొండ ` ఎస్టీలకు కేటాయించిన పాలకొండ ఎమ్మెల్యేగా విశ్వాసరాయి కళావతి ఉన్నారు. టీడీపీ అభ్యర్థిపై నిమ్మక జయకృష్ణపై ఆమె నెగ్గారు. కళావతిపై పెద్దగా వ్యతిరేకత లేదు. రాజకీయంగా ఈ నియోజకవర్గం స్తబ్దంగా ఉంటుంది. ప్రస్తుతం నియోజకవర్గంలోని చాలా ప్రాంతాలు విజయనగరం జిల్లాలోకి వెళ్లిపోయాయి. దీంతో పార్టీల బలాబలాలను ఇప్పుడే అంచనా వేయలేము. రాష్ట్రంలో పెరుగుతున్న టీడీపీ అనుకూల పవనాలు ఇక్కడ కూడా ప్రభావం చూపుతాయి. విశ్రాంత ఆర్‌డీవో పిఎంజె బాబు వైసీపీ టికెట్‌ ఆశిస్తున్నారు. దీనివల్ల కళావతికి ఇబ్బందులు రావచ్చు.

రాజాం ` టీడీపీ అభ్యర్థి కోండ్రు మురళీమోహన్‌పై వైసీపీ అభ్యర్థి కంబాల జోగులు గెలిచారు. బ్రహ్మచారి అయిన జోగులుకు నియోజకవర్గ ప్రజల్లో మంచి పేరు ఉంది. కాంగ్రెస్‌ హయాంలో మంత్రిగా పనిచేసిన కోండడ్రుపై ప్రజలకు సదభిప్రాయం లేదు. గత ఎన్నికల్లో ప్రతిభా భారతి కుమార్తె గ్రీష్మ టిక్కెట్‌ ఆశించినా చివరి నిమిషంలో కోండ్రుకే చంద్రబాబు టికెట్‌ ఇచ్చారు. అందువల్ల ప్రతిభా భారతి వర్గీయులు ఆయనకు సహకరించలేదు. ఈ సారి టికెట్‌ గ్రీష్మకు లభిస్తే టీడీపీ గెలిచే అవకాశాలు మెరుగుపడతాయి. గ్రీష్మ చురుకుగా పనిచేస్తూ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నారు. సోషల్‌ మీడియాను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటున్న ఆమె చాలా తొందరగానే పాపులర్‌ అయ్యారు. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. పార్టీలోనూ పట్టు పెంచుకుంటున్నారు. కంబాల జోగులు మంచి వ్యక్తి అయినప్పటికీ కాస్త స్తబ్దంగా ఉంటారు. ఇది గ్రీష్మకు అనుకూల అంశం. రాజాంలో ఇటీవల జరిగిన చంద్రబాబు సభ విజయవంతమవటం పార్టీ శ్రేణుల్లో మంచి ఉత్సాహాన్ని నింపింది. దీనివెనుక గ్రీష్మ కృషి ఉంది. ఇవన్నీ ఆమెకు అనుకూల అంశాలు.

ఎచ్చెర్ల ` వైసీపీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌ పట్ల పార్టీ శ్రేణుల్లో సైతం వ్యతిరేకత పెరుగుతోంది. పార్టీ నాయకులు, కార్యకర్తలను ఆయన తక్కువగా చూస్తారన్న ఆరోపణలు ఉన్నాయి. సీనియర్‌ నాయకులు ఫోన్‌ చేసినా ఎత్తరని అంటారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా కళా వెంకటరావు పోటీ చేసి ఓడిపోయారు. ఆయన పట్ల పెద్దగా వ్యతిరేకత లేకపోయినా అందుబాటులో ఉండరనే విమర్శ ఉంది. నియోజకవర్గంలో పెద్దగా తిరగరన్న వాదన ఉంది. దీనివల్ల పార్టీ నేతలలో చాలామంది అసంతృప్తితో ఉన్నారు. ఇక్కడ నుంచి కలిశెట్టి అప్పల నాయుడు టీడీపీ టికెట్‌ ఆశిస్తున్నారు. తరచూ పార్టీ శ్రేణులతో సమావేశాలు నిర్వహిస్తు ముందడుగు వేస్తున్నారు. నియోజకవర్గంలోని పరిణామాలు టీడీపీకి అనుకూలంగా ఉన్నాయి. దీనిని ఆ పార్టీ నాయకులు ఎలా వినియోగించుకుంటారనేదే మిలియన్‌ డాలర్ల ప్రశ్న.

( ఎస్. కే.వేణుగోపాల్)