175 సీట్లు ప్రతిపక్షాలకే వస్తాయేమో :రఘురామ
ప్రతిపక్షాలకే 175 స్థానాలు వచ్చేలా కనిపిస్తోంది
ఎంపీ రఘురామకృష్ణం రాజు
రాష్ట్రంలో 175వ స్థానాలు ఖాయమని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొంటుండగా, పరిస్థితి చూస్తే ప్రతిపక్షాలకే 175 స్థానాలు వచ్చేలా కనిపిస్తున్నాయని నర్సాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు అన్నారు. నందిగామ, జగ్గయ్యపేటలలో నిర్వహించిన రోడ్ షోలకు హాజరైన జన ప్రభంజనాన్ని చూస్తే... గతంలో ఎన్టీ రామారావు చైతన్య రథం పై నిర్వహించిన రోడ్ షోలకు ప్రజలు హాజరైనట్లుగా కనిపించిందన్నారు. శనివారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... చంద్రబాబు నాయుడు రోడ్ షోపై రాళ్లదాడి ఘటన గురించి విజయవాడ కమిషనర్ మాట్లాడుతూ పూలల్లోనే రాళ్లు ఉన్నాయేమోనని పేర్కొనడం ఆయన సంస్కారానికి నిదర్శనం అంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో దశాబ్దాల తర్వాత ప్రతిపక్ష నేత రోడ్ షోకు హాజరైన జన ప్రభంజనాన్ని చూస్తే భవిష్యత్తు, మా పార్టీ ముఖచిత్రం స్పష్టం అవుతుందని పేర్కొన్నారు. ఆరేడు గంటల పాటు ఆలస్యంగా హాజరైనప్పటికీ చంద్రబాబు నాయుడు రోడ్ షోకు లభించిన అశేష స్పందనను చూస్తుంటే, గతంలో ఎన్టీ రామారావు హయం లో కాంగ్రెస్ పార్టీపై ఉన్న ప్రజా వ్యతిరేకత మరోసారి కళ్ళకు కట్టినట్లు కనిపించిందన్నారు. ఎన్టీ రామారావు కు మించి చంద్రబాబు నాయుడు రోడ్ షో ల కు జనం వస్తున్నారంటే ఒక్కసారి తమ పార్టీ పెద్దలు ఆత్మవలోకనం చేసుకోవాలని, పోలీసు ప్రభుత్వంపై ఉన్న ప్రజా వ్యతిరేకత కు ఇది నిదర్శనం అని భావించాలన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హాజరైన కార్యక్రమానికి విచ్చేసిన ప్రజలు గోడలు దూకి పారిపోతుంటే... చంద్రబాబు నాయుడు పాల్గొన్న కార్యక్రమం లో ప్రజలు మేడలు మిద్దెలు ఎక్కి అపూర్వ స్వాగతాన్ని పలుకుతున్నారన్నారు.
హవ్వ... చిల్లర వ్యాఖ్యలా?
ప్రజల్లో వెల్లువెత్తుతున్న ప్రజాగ్రహాన్ని తగ్గించేలా మంత్రుల వ్యాఖ్యలు ఉండాలని, అంతేకానీ చిల్లర వ్యాఖ్యలు చేయవద్దు అంటూ రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. మంత్రి జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తనని అసెంబ్లీలో లుచ్చా అంటూ సంబోధించిన లుచ్చా మంత్రి జోగి రమేష్ అని ఫైర్ అయ్యారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్నం పర్యటన సందర్భంగా కూడా విద్యుత్తును తొలగించి రాళ్ల దాడికి పాల్పడ్డారని గుర్తు చేశారు. అలాగే చంద్రబాబు నాయుడు నందిగామ పర్యటనలో కూడా విద్యుత్తును తొలగించి రాళ్లదాడికి పాల్పడడం పరిశీలిస్తే... రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా? అన్న అనుమానం కలుగుతుందన్నారు. చంద్రబాబు నాయుడు ఈ తరహా ఘటనలు ఎన్నో చూశారని ఆయన ఎంతో మొండిఘటనని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ తన ఇంటి వద్ద తానే రెక్కీ నిర్వహించుకున్నాడని జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలపై రఘురామకృష్ణంరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరూ కోడి కత్తి లాగా డ్రామాలు ఆడుతారా?, రాళ్లతో కొట్టించుకుంటారా?? అంటూ ఫైర్ అయ్యారు. కోడి కత్తి ఘటనకు నాలుగేళ్లయిన అతి గతి లేదని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి ఎంతో కష్టపడి అభినయించగా, దానికి ఎటువంటి సార్ధకత లేకుండా జోగి రమేష్ వంటి వారి వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. చంద్రబాబు నాయుడు పర్యటనలకు లభిస్తున్న ఆదరణ... ఆ జన ప్రభంజనాన్ని చూసి తమ పార్టీ వారికి వెన్నులో వణుకు పుడుతుందన్నారు.
అరెస్టుల తీరుపై ఆగ్రహం
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెనాయుడుని పైల్స్ ఆపరేషన్ చేసిన 24 గంటల వ్యవధిలోనే ఏపీ సిఐడి పోలీసులు అరెస్టు చేశారని రఘురామ కృష్ణంరాజు గుర్తు చేశారు. ఇక తన జన్మ దినోత్సవం రోజే తనని అరెస్టు చేయడం జరిగిందని, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను శారీరకంగా హింసించారని, సీనియర్ జర్నలిస్టు అంకబాబును అలాగే అరెస్టు చేశారంటూ పేర్కొన్నారు. సిఐడి పోలీసుల ఉన్మాదం పరాకాష్టకు చేరిందన్న ఆయన, బాధితులంతా ప్రైవేటు ఫిర్యాదులు చేయాలని సూచించారు. ఆనందపురం ఏసీపీ గోవిందరావు జనసేన కార్యకర్తలను బెల్టుతో చితక్కొ ట్టిన విషయాన్ని తాను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు రక్షణ కల్పించాలని కోరుతూ రాసిన లేఖలో ప్రస్తావించానని తెలిపారు. తనని చితక్కొట్టిన విషయాన్ని సుప్రీంకోర్టు నిర్ధారించినప్పటికీ, కేసు లిస్ట్ కావడం లేదన్నారు. కానీ అదే ముఖ్యమంత్రి అనుకూల కేసులన్నీ లిస్ట్ అవుతున్నాయని అదే జగన్ మాయ అంటూ వ్యాఖ్యానించారు.
నిబంధనలో అతిక్రమించిన వారిపై కేసులు పెట్టాలి
నిబంధనలు అతిక్రమించి తమ ఒంటిపై చేయి చేసుకున్న పోలీసు అధికారులపై ప్రైవేటు కేసులు వేయాలని రఘురామకృష్ణం రాజు బాధితులను కోరారు.. త్వరలోనే మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం వస్తుందని, అప్పుడు వీరిని జైలుకు పంపుదామని అన్నారు. ఇటువంటి పిచ్చి పనులు చేస్తే ఇదే పరిస్థితి ఎదురవుతుందన్న భయం పోలీసుల్లో వస్తుందన్న ఆయన, భవిష్యత్తులో క్రమశిక్షణతో పని చేస్తారని అన్నారు.
ప్రస్తుతం ప్రైవేటు కంప్లైంట్ ఇచ్చినప్పటికీ ఎటువంటి చర్యలు ఉండకపోవచ్చునని పేర్కొన్నారు. సిఐడి పోలీసుల చేతిలో దెబ్బలు తిన్న వ్యక్తులు ప్రైవేట్ కంప్లైంట్ ఇస్తే న్యాయవాదుల ఖర్చు తానే భరిస్తానని, విజయవాడలో ఎంతోమంది సీనియర్ న్యాయవాదులు ఉన్నారన్నారు..
రిజిస్టార్ వేరు... న్యాయ వ్యవస్థ వేరు
రిజిస్టారి వేరని న్యాయ వ్యవస్థ వేరని రఘురామకృష్ణం రాజు అన్నారు. మెజిస్ట్రేట్ ఇచ్చిన తీర్పు సరి కాదనిపిస్తే అప్పీల్ కు వెళ్లవచ్చునని, అంతేకానీ మెజిస్ట్రేట్ పై వ్యాఖ్యలు చేయడం ఏమిటంటూ ప్రశ్నించారు. మెజిస్ట్రేట్లను అన్నారు కదా అని హైకోర్టు న్యాయమూర్తులు ఉపేక్షిస్తే, సుప్రీంకోర్టుకు వెళ్లి మిమ్మల్ని తిడతారంటూ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రఘురామకృష్ణంరాజు ఫైర్ అయ్యారు. మెజిస్ట్రేట్ ల గురించి పొన్నవోలు సుధాకర్ రెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడడం పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మెజిస్ట్రేట్లకు ఏ సెక్షన్ పెట్టినా సరే కరెక్ట్ కాదని అనడం అలవాటైపోయిందని పొన్నవోలు సుధాకర్ రెడ్డి, మెజిస్ట్రేట్ లపై ఎలా అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తారంటూ ప్రశ్నించారు. ఇటువంటి ఉన్మాదులకు అడ్డుకట్ట వేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. న్యాయ వ్యవస్థ అన్నది సక్రమంగా పనిచేయకపోయి ఉంటే ప్రజలు ఎప్పుడో రాష్ట్రాన్ని వదిలి వెళ్లి ఉండేవారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కాదని, ప్రజల కోసం ఎన్నుకున్న వ్యవస్థ అని గుర్తు చేశారు. ప్రజలను కాపాడవలసిన బాధ్యత అడిషనల్ అడ్వకేట్ జనరల్ దని , ఆయనేమీ కార్యాలయంలో పని చేయడం లేదన్నారు..
ఈ ఎదవ ప్రశ్నకు ఏమి సమాధానం రాయాలి
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విధానాలు కార్యక్రమాల గురించి వివరించాలని ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులకు ఇచ్చిన ప్రశ్నపై రఘురామకృష్ణం రాజు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఈ ఎదవ ప్రశ్నకు ఏమని సమాధానం రాయాలంటూ నిలదీశారు. మధ్య నిషేధం చేస్తామని చెప్పి చేయలేదనా?, సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి మోసం చేశారని రాయమంటారా అంటూ మండిపడ్డారు. ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా మహానుభావుడైన సర్వేపల్లి రాధాకృష్ణ వంటి వారు విధులు నిర్వహించగా, ప్రస్తుతం ప్రసాదు రెడ్డి వంటి వారు వైస్ ఛాన్సలర్ గా వ్యవహరించడం విద్యార్థుల దురదృష్టమని వ్యాఖ్యానించారు. ఇదే విషయాన్ని యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ దృష్టికి తీసుకు వెళ్తానని తెలిపారు. గతంలో గవర్నర్ కు ఫిర్యాదులు ఇచ్చామని, అయినా ప్రయోజనం లేదని తెలిసిందన్నారు. యుజిసి కి కూడా ఫిర్యాదు చేస్తామని చర్యలు ఉండవచ్చు ఉండకపోవచ్చునంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 12 యూనివర్సిటీలు ఉంటే, అందులో 10 యూనివర్సిటీలకు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికి వీసీ బాధ్యతలు అప్పగించారని రఘురామకృష్ణం రాజు తీవ్రంగా ఆక్షేపించారు.
వీళ్లు ఎంత ఇస్తారో?
ఇసుకా సురులు, మద్యం మాఫియా, మైనింగ్ మాఫియా ఉంది కాబట్టి ఎన్నికల్లో ప్రజలకు వీళ్ళు ఎంత డబ్బులు ఇస్తారోనని రఘురామకృష్ణం రాజు అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఇక వీరి నుంచి జనాలు ఎంత అంచనా వేస్తారోనని అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీలు డబ్బులు పంచిన విషయాన్ని ఓటర్లు స్వయంగా చెబుతుండడంతో, త్వరలోనే ఆంధ్రప్రదేశ్ లో జరగనున్న ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ వీటన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలన్నారు.