home page

సుప్రీం కోర్టు ఆదేశాలకు ఎందుకీ వక్రభాష్యం?

అయిదు అంశాలపై' స్టే ' జనవరి 31 వరకే!

 | 
Supreme court
సుప్రీంకోర్టులో జరిగింది ఏమిటి ప్రచారం చేస్తున్నదేమిటి?
కోర్టులో తీర్పు రాగానే ఓడిపోయినవాడు ఏడ్చాడు.. గెలిచిన వాడు ఇంటికెళ్లి ఏడ్చాడు అని ఒక జోక్ లాంటి నిజం ఉండేది. కోర్టు ఖర్చులు అలా ఉంటాయి అని చెప్పేందుకు ఈ జోక్ లాంటి నిజం చెప్పేవారు. ప్రస్తుతం అమరావతికి సంబంధించిన కేసుకు సంబంధించి ఖర్చు విషయంలో కాకుండా వస్తున్న కామెంట్లు, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం చూస్తే ఆ జోక్ లాంటి నిజం గుర్తుకు వస్తున్నది. సుప్రీంకోర్టులో జరిగింది ఏమిటో చాలా మందికి తెలియదు కానీ మేమే మేమే గెలిచాం అని చెప్పుకోవడంలో మాత్రం ఎంతో ఆసక్తి చూపుతున్నారు. మరీ ముఖ్యంగా ఏపిలో అధికారంలో ఉన్న వైసీపీ సానుభూతిపరులైతే సోషల్ మీడియాలో ఈ తీర్పుపై కామెంట్లు గుప్పిస్తున్నారు. కోర్టులో వాదనల మధ్యలో జరిగిన విషయాలను కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి రాజధానిపై చట్టం చేసే అధికారం అసెంబ్లీకి లేదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది ఇది ప్రధానమైన అంశం. అదే విధంగా ఏపీ సిఆర్ డి ఏ చట్టంలో షెడ్యూల్ 2, 3 మరియు ల్యాండ్ పూలింగ్ నియమాలు 2015 ను అమలు చేయాలన్న హైకోర్టు తీర్పుపై స్టే విధించడానికి కూడా సుప్రీంకోర్టు నిరాకరించింది. అలాగే  రైతుల భూములను రాజధాని నిర్మాణానికి తప్ప వేరే అవసరాలకు ఉపయోగించకూడదని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం స్టే ఇవ్వలేదు. పార్లమెంటు చేసిన చట్టాన్ని ఏపీ ప్రభుత్వం ఎలా మార్చగలదని సుప్రీంకోర్టు ప్రశ్నించడం రాష్ట్ర ప్రభుత్వానికి తీవ్ర నిరాశ కలిగించే అంశం. ఏపీ విభజన చట్టంలో ఒక రాజధాని అని మాత్రమే ఉందని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. పార్లమెంటు చట్టంలో సవరణ చేసే అవకాశం ఏపీ ప్రభుత్వానికి లేనప్పుడు అందులో ఉన్న అంశాలను మాత్రం ఎలా సవరిస్తారని కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. ఈ విషయాలన్నింటికన్నా మరి ముఖ్యమైనది ఏమిటంటే హైకోర్టు విధించిన గడువులోపు అమరావతిలో అభివృద్ధి కార్యకలాపాలు ఏవీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టలేదు. పైగా హైకోర్టు విధించిన గడువు తర్వాతే సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఇవన్నీ కోర్టు ధిక్కరణ కిందకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం ఆ ముప్పు నుంచి తప్పించుకోగలిగింది. ఇది ఒక్కటే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఉపశమనం. హైకోర్టు ఆదేశాలలో నిర్ణీతకాలపరిమితి విధించగా దాన్ని సుప్రీంకోర్టు స్టే విధించింది. అంతే తప్ప సుప్రీంకోర్టులో నేడు జరిగిన ఏ పరిణామమూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా లేదని న్యాయనిపుణులు సైతం అంగీకరిస్తున్నారు. అయితే అమరావతి పై తామే గెలిచినట్లు అధికార వైసీపీ అభిమానులు ప్రచారం చేసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని పదే పదే చెబుతుంటుంది. అయితే సుప్రీంకోర్టులో వాదనల సమయంలో కర్నూలుకు హైకోర్టును మార్చే ఉద్దేశ్యం లేదని చెప్పడం కూడా ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీస్తున్నది. కర్నూలుకు హైకోర్టును మార్చడం అనేది ముగిసిన కథ అని అర్ధం వచ్చే విధంగా సుప్రీంకోర్టుకు చెప్పడంతో మూడు రాజధానుల్లో ఒక రాజధానికి రాష్ట్ర ప్రభుత్వం స్వస్తి చెప్పినట్లు అనుకోవాల్సి వస్తున్నది. మూడు రాజధానుల చట్టాన్ని అసెంబ్లీలోనే ఉప సంహరించుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు సుప్రీంకోర్టులో న్యాయ రాజధాని అంశాన్ని ముగించేసింది. ఇలా ఒక వ్యూహం లేకుండా చేయడం వల్లే రాష్ట్రం మొత్తంలోని మేధావులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు. ఏపీ హైకోర్టు 7 అంశాలతో ఇచ్చిన తీర్పులో 3 నుంచి 7 అంశాల వరకు సుప్రీంకోర్టు స్టే లభించింది. అవి:
1. AP CRDA 2015 లాండ్‌ పూలింగ్‌ షెడ్యూల్ 2 మరియు 3 నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం, CRDA నిర్వర్తించాలి
2. థర్డ్‌ పార్టీ ప్రయోజనాలకు పూలింగ్‌ లాండ్‌ తనఖా పెట్టారాదు. రాజధాని నిర్మాణం, కేపిటల్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌కు తనఖా పెట్టవచ్చు
3. CRDA యాక్ట్‌ సెక్షన్‌ 58 ప్రకారం  రోడ్లు, తాగునీరు, డ్రైనేజీలు, విద్యుత్‌ వంటి మౌలిక సదుపాయాల ఏర్పాటు ప్రాసెస్‌ తీర్పు వచ్చిన తేదీ నుంచి నెలరోజుల్లో పూర్తిచేయాలి
4. APCRDA యాక్ట్‌ సెక్షన్‌ 61 ప్రకారం టౌన్‌ మాస్టర్‌ ప్లానింగ్‌ను రాష్ట్ర ప్రభుత్వం, CRDA కలిసి పూర్తి చేయాలి
5. డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్‌ కమ్‌ జనరల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ ఫామ్‌ 9.14 ప్రోవిజన్‌ - CRDA యాక్ట్‌ 2015లోని నిబంధనల ప్రకారం 6 నెలల్లో అమరావతి కేపిటల్‌ సిటీ, కేపిటల్‌ రీజియన్‌ నిర్మాణం చేపట్టాలి
6. ప్రభుత్వం మరియు CRDA కలిసి రోడ్లు, తాగునీరు, ప్రతిప్లాట్‌కు విద్యుత్‌ కనెక్షన్‌, డ్రైనేజి సహా ఏర్పాటు చేసిన అమరావతి కేపిటల్‌ సిటీ నివాసయోగ్యంగా మార్చాలి
7. రాష్ట్ర ప్రభుత్వం మరియు APCRDA కలిసి భూములిచ్చిన రైతులకు ప్రామిస్‌ చేసినట్టుగా అమరావతి కేపిటల్‌ రీజియన్‌లో స్థలాలు 3 నెలల్లోగా కేటాయించాలి