home page

మన ఆస్తి పత్రాలపై సీఎం బొమ్మ ఎందుకు ? ఎంపీ రఘురామ

పట్టాదారు పుస్తకాలు పై జగన్ బొమ్మ  

 | 

మన ఆస్తులపై సీఎం బొమ్మ ఎందుకు?

 రాచరికపు రోజుల్లో కూడా లేని ఈ విధానాన్ని ... ప్రజాస్వామ్య వ్యవస్థలో అమలు చేయడమా? ఇదెక్కడివిడ్డూరం??

 నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు

 మన ఆస్తి హక్కు పత్రాలపై ముఖ్యమంత్రి బొమ్మ ను ముద్రించడాన్ని భూ యజమానులంతా ముక్తకంఠంతో నిరసించాలని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామ కృష్ణంరాజు పిలుపునిచ్చారు. రాచరికపు రోజుల్లో కూడా లేని ఈ విధానాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక వ్యక్తి ప్రవేశపెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. బ్రిటిష్ వారి పాలనలోనే భూముల సర్వేలు ప్రారంభించడం జరిగిందని, భూ హక్కుదారులకు పట్టాలు ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. అయినా విక్టోరియా మహారాణి తో పాటు   ఆ తర్వాత వచ్చిన  రాజులెవరు కూడా భూ యజమాన్య హక్కు పత్రాలపై తమ ఫోటోలను ముద్రించుకోలేదని గుర్తు చేశారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న వైయస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూ రక్ష పథకం ద్వారా జారీ చేసే పాసు పుస్తకాలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటోను ముద్రించాలని నిర్ణయించడం పట్ల రఘురామకృష్ణంరాజు తీవ్ర ఆక్షేపణ తెలియజేశారు.  మంగళవారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఆస్తి హక్కు పత్రం అనేది భూ యజమాని భద్రంగా దాచుకునేదని, దానిపై ముఖ్యమంత్రి ఫోటో తో పాటు, సంబంధిత జిల్లాలకు చెందిన మంత్రుల ఫోటోలను కూడా ముద్రించాలని అనుకుంటున్నారట... ఇదెక్కడి అరాచకం, ఆటవికం అంటూ మండిపడ్డారు. మా ఆస్తి హక్కు పత్రాలపై  మీ బొమ్మ ఏంటని ప్రజలంతా ప్రశ్నించాల్సిన అవసరం ఉందన్నా ఆయన, న్యాయపరంగా ఎలా ముందుకు వెళ్లాలన్న అంశంపై కూడా తాను నిపుణులతో  చర్చిస్తున్నానని తెలిపారు.
 గ్రామీణ ప్రాంతాలలో నివసించే ప్రజలకు ఇంటి యాజమాన్య హక్కులను కల్పించే పట్టాలను మంజూరు చేసేందుకు 
2020లో కేంద్ర ప్రభుత్వం నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పథకాన్ని పెట్టిందని గుర్తు చేశారు. ఈ పథకం ఇప్పటికే మధ్యప్రదేశ్ లో అమలులో కూడా చేయడం జరిగిందని తెలిపారు. అయితే ఇంటి యాజమాన్య హక్కులను కల్పించే పట్టా మీద మధ్యప్రదేశ్  ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీల ఫోటోలు లేవని పేర్కొన్నారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండేది 2024 ఏప్రిల్ వరకేనని గుర్తు చేశారు. ఆ తరువాత వారి జాతకం ప్రజల చేతుల్లో ఉంటుందని చెప్పారు.. భూ యాజమాన్య హక్కు పుస్తకాలపై తమ ఫోటోను ముద్రించుకోవడానికి ఇంత రాద్ధాంతం చేయడం సరికాదని రఘురామకృష్ణం రాజు అన్నారు.

 భూ యాజమాన్య హక్కు పత్రాలపై పాలకుల ఫోటో ప్రపంచంలో ఎక్కడా లేదు

 భూ యాజమాన్య హక్కు పత్రాలపై పాలకుల ఫోటో లను ముద్రించిన దాఖలాలు ప్రపంచంలో ఎక్కడా లేవని రఘురామకృష్ణం రాజు తెలిపారు.. ఇటువంటి ఆలోచన మీకెలా వచ్చిందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఆయన ప్రశ్నించారు. 11 ఏళ్లుగా కోర్టులో నానుతున్న కర్ణాటక మాజీమంత్రి గాలి జనార్దన్ రెడ్డి కేసును  నెలరోజుల వ్యవధిలో ట్రయల్ స్టార్ట్ చేసి, ఆరు నెలల వ్యవధిలో ముగించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా రఘురామకృష్ణం రాజు ప్రస్తావించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై  మోపబడిన కేసులు కూడా గత 12 ఏళ్లుగా కోర్టులో ట్రయల్స్ కు రాకుండా పెండింగ్ లో ఉన్నాయన్నారు. గాలి జనార్దన్ రెడ్డి కేసు గురించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభావం వల్ల, నేడో, రేపో జగన్మోహన్ రెడ్డి పై మోపబడి పెండింగ్ లో ఉన్న కేసులు విచారణకు వచ్చే అవకాశాలు లేకపోలేదు అన్నారు. అలాగే  ఎంపీ లు, ఎమ్మెల్యేలపై ఐదేళ్లుగా పెండింగ్ లో ఉన్న కేసులను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురావాలని  మరొక కేసులో తీర్పునివ్వడం జరిగిందని, బహుశా వచ్చే నెల నుంచి జగన్మోహన్ రెడ్డి పై మోపబడిన కేసులు ట్రయల్స్ ప్రారంభం కావచ్చునని అన్నారు. కోర్టులో ఏదైనా ముఖ్యమంత్రి కి వ్యతిరేకంగా తీర్పు వస్తే, భూ యాజమాన్య హక్కు పత్రాల మీద ఆయన ఫోటోను ముద్రిస్తే, భూ యజమానులు ఇబ్బంది పడే అవకాశం ఉందన్నారు. భూ యాజమాన్య హక్కు పత్రం బుక్కులను భారతి సిమెంట్స్ ఆదాయం నుంచో, మీరు సంపాదించిన డబ్బులతోనూ ముద్రించడం లేదన్నారు. ప్రభుత్వ డబ్బులతో ముద్రిస్తున్నారన్నారు . డబ్బు ప్రభుత్వానిది, ఆస్తి యజమానిది, బొమ్మ మీద అంటూ  భూ యజమానులు ప్రశ్నించాలని సూచించారు. ప్రశ్నిస్తే సిఐడి చీఫ్ సునీల్ కుమార్ కేసులతో రెడీ అయిపోతారని, అయినా  సరే ప్రశ్నించక తప్పదన్నారు. నిబంధనల ప్రకారం ఎవడి ఆస్తుల మీదనైనా  ముఖ్యమంత్రి ఫోటోలను వేసుకోవడానికి వీలు లేదని అన్నారు.

 రామ్ సింగ్ పై ఎఫ్ఐఆర్ ఎప్పుడు కొట్టివేస్తారో?, వైఎస్ వివేకా కేసు త్వరితగతిన ఎప్పుడు విచారణ జరుగుతుందో?

 సిబిఐ అధికారి రాంసింగ్ పై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను ఎప్పుడు కొట్టేస్తారో, వైఎస్ వివేకానంద రెడ్డి కేసు  త్వరితగతిన  ఎప్పుడు విచారణ జరుగుతుందో అర్థం కావడం లేదని రఘురామ కృష్ణంరాజు విస్మయం వ్యక్తం చేశారు. రామ్ సింగ్ పై నమోదు చేసిన ఎఫ్ ఐ ఆర్ లో ఏమీ లేదని రాష్ట్ర పోలీసులు చార్జిషీట్ దాఖలు చేయవచ్చునని  తెలిపారు. కానీ చార్జిషీట్ దాఖలు చేయడానికి రాష్ట్ర పోలీసులు, ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదని అన్నారు. దీనితో రామ్ సింగ్ పై ఎఫ్ ఐ ఆర్ నమోదు వెనుక రాష్ట్ర పోలీసులు,  ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉన్నట్లు ప్రజల్లో అనుమానాలు రోజుకింత బలపడుతున్నాయని అన్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో  అప్రూవర్ గా  మారిన వ్యక్తిని పరిగణలోకి  తీసుకోవద్దని కోరుతూ నిందితులుగా అభియోగాలు ఎదుర్కొంటున్న శివ శంకర్ రెడ్డి, ఉమా శంకర్ రెడ్డిలు దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించిందని తెలిపారు. ఈ కేసులో ఫిర్యాదుదారురాలైన సునీతా రెడ్డికి ఏమైనా ఇబ్బంది ఉంటే పిటీషన్ దాఖలు చేయవచ్చునని, అంతేకానీ నిందితులుగా అభియోగాలు ఎదుర్కొంటున్న మీకు మాట్లాడే అర్హత లేదని సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టం చేసిందన్నారు. గత మూడు ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేయాలని సూచించారు. లేకపోతే పార్టీకి ప్రభుత్వానికి తీరని నష్టం వాటిల్లుతుందని ఆయన హెచ్చరించారు.

 నాడు నేడు లో చేసింది శూన్యం

 నాడు, నేడు అంటూ రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధి కోసం చేసింది శూన్యమని రఘురామకృష్ణం రాజు అన్నారు. కరోనా సమయంలో ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు ఎక్కువగా ఉన్న కారణంగా, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారన్నారు. అయితే,  అదంతా తమ గొప్పతనమేనని చెప్పుకున్న ప్రభుత్వ పెద్దలు, ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల నుంచి 3 లక్షల 98 వేల మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల్లో చేరితే దానికి అర్థరహితమైన సమాధానాలను చెబుతున్నారని ఎద్దేవా చేశారు. సడన్ గా రాష్ట్రంలో జనాభా తగ్గిపోవడం వల్లే, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల చేరిక తగ్గిందనే మూర్ఖపు సమాధానాలు చెబుతున్నారని రఘురామకృష్ణం రాజు విమర్శించారు. రాష్ట్రంలో జనాభా తగ్గడం వెనుక కూడా జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏమైనా ఉందా అంటూ అపహాస్యం చేశారు.. మనం అమలు చేస్తున్న విధానాలలో లోపం ఎక్కడ ఉందో గ్రహించాలని, అంతేకానీ మూర్ఖపు సమాధానాలతో తప్పించుకోవడం సరికాదన్నారు. దేశంలో మెడిసిన్, ఇంజనీరింగ్ కోర్సులను సైతం మాతృభాషలో బోధించే విధంగా  కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉంటే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతూ మాతృభాషను హత్య చేసే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నో వేల స్కూళ్లను ఎత్తివేసారని, దీనితో దూరం పెరగడం వల్లే దగ్గరలో ఉన్న ప్రైవేటు స్కూళ్లలో విద్యార్థులు చేరారని రఘురామకృష్ణం రాజు అన్నారు. మన తప్పులను సరి చేసుకోకుండా అక్కడ ఏదో అద్భుతం జరిగిపోతుందని మాట్లాడడం అవివేకమని విరుచుకపడ్డారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా తయారయిందని, రోడ్డుపై గుంటలో పడి చనిపోవడం అన్నది గతంలో ఎప్పుడు జరగలేదన్నారు. ఇక రోడ్లు పై ఉన్న గోతులలో పడి ఆర్టీసీ బస్సు చక్రాలు ఊడిపోయాయని, దానికి సంబంధించిన వార్త పత్రిక క్లిప్పింగును రఘురామకృష్ణం రాజు మీడియా ఎదుట ప్రదర్శించారు. అలాగే బస్సులోకి ఎక్కి కూర్చున్న వారు వర్షం నుంచి తడవకుండా ఉండడానికి గొడుగులు పట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సులకు ఉన్న చిల్లుల వల్లే ఈ పరిస్థితి దాపురించిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు.

రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్న మంత్రులు, మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు...

అమరావతి రైతుల పాదయాత్ర సందర్భంగా రాష్ట్ర మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తూ... ప్రాంతాల మధ్య వైషమ్యాలను సృష్టించే ప్రయత్నాన్ని చేస్తున్నారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకు వెళ్లేందుకు , ఆయనకు ఒక లేఖ రాసినట్లు  రఘురామ కృష్ణంరాజు తెలిపారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, గుడివాడ అమర్నాథ్, అంబటి రాంబాబు, మాజీమంత్రి ధర్మాన కృష్ణ దాస్, అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు ఉమా శంకర్, గణేష్, ధర్మశ్రీలు ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలను చేస్తూ, ప్రాంతాల మధ్య వైషమ్యాలను సృష్టించేందుకు కుట్రలు చేస్తున్నారన్నారు. ప్రజల మధ్య  వైషమ్యాలను సృష్టించే ప్రయత్నాన్ని చేస్తున్న మంత్రులు, మాజీ మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలపై  ఐపిసి సెక్షన్ 153 ఏ, కింద కేసులు నమోదు చేయాలని రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తే, ఫిర్యాదులు స్థానిక పోలీసులు స్వీకరించడం లేదన్నారు. మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలపై కేసులు నమోదు చేయడమే కాకుండా, అమరావతి రైతులు వారి ప్రాంతాలలో పాదయాత్ర చేసేటప్పుడు అల్లర్లు చెలరేగకుండా ఉండేందుకు వారిని ముందస్తుగా హౌస్ అరెస్టు కు చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం మంత్రితోపాటు, హోంశాఖ కార్యదర్శి లను కోరానని  రఘురామకృష్ణంరాజు తెలిపారు. అలాగే కోర్టు అనుమతితో పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలపై సుమోటోగా కోర్టు ధిక్కరణ కేసులు నమోదు చేయాలని హైకోర్టు  రిజిస్టార్ జనరల్ కు లేఖ రాసినట్లు తెలిపారు.. అలాగే కోర్టులను కించపరుస్తూ మంత్రులు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి సాక్షి దినపత్రిక  వార్త క్లిప్పింగులను జతచేసినట్లు వెల్లడించారు.. మంత్రుల వెనుక ముఖ్యమంత్రి ఉన్నారా ఇతరులు ఎవరైనా ఉన్నారా అన్న దానిపై విచారణ జరపాలని కోరినట్లు తెలిపారు. డిజిపి కి సైతం న్యాయవాది లక్ష్మీనారాయణ ఇదే అంశమై లేఖ రాసిన విషయాన్ని ఈ సందర్భంగా రఘురామకృష్ణం రాజు ప్రస్తావించారు.

 ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తి అమితాబచ్చన్ గారు

ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అమితాబచ్చన్ గారు అని రఘురామకృష్ణం రాజుగారు కొనియాడారు. అమితాబచ్చన్ గారి 80వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయనకు రఘురామకృష్ణం రాజుగారు శుభాకాంక్షలు తెలియజేశారు.