జూనియర్ ఎన్టీఆర్ ఎటువైపు ?
కమలం చేతికి చిక్కిన జూనియర్ ఎన్టీఆర్
హైద్రాబాద్ లో గతంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను జూనియర్ ఎన్టీఆర్ కలిసి తర్వాత తెలుగు రాజకీయాల్లో ఎన్టీఆర్ క్రేజ్ రెట్టింపు అవుతోంది. ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాతో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా మారారు.
కేవలం సినిమాల్లోనూ కాదు.. రాజకీయాల్లోనూ ఆయన ట్రెండ్ సెట్టర్ అవుతున్నారు.. తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని తారక్ చెబుతున్నా.. రాజకీయాలు ఆయన్ను వీడడం లేదు. ప్రస్తుతం ఆయనకు కలమం గాలం వేస్తోందని పొలిటికల్ సర్కిల్ లో చర్చ జరుగుతోంది. అంతేకాదు ఆయన చూపు సైతం బీజేపీవైపే ఉందా అనే చర్చ కూడా మొదలైంది. అందుకు కారణం ఇటీవల జరుగుతున్న పరిణామాలే.. టీడీపీ నేతలు కోరుకుంటున్నట్టు ఏ సందర్భంలోనూ ఆయన స్పందించడం లేదు. తాను పార్టీలోనే ఉన్నాను అనే పరోక్ష సంకేతాలు కూడా జూనియర్ ఇవ్వడం లేదు. మరోవైపు మామ చంద్రబాబుతో గ్యాప్ ఉందనే సంకేతాలే కనిపిస్తున్నాయి. ప్రస్తుత పరిణామాలు చూస్తే వచ్చే ఎన్నికల్లో ఆయన టీడీపీతో పని చేయడం దాదాపు కష్టమే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో తారక్ సేవలను వాడుకోవాలని బీజేపీ ఎదురు చూస్తోంది. అందుకు వివిధ రూపాల్లో గాలం వేస్తోంది కూడా. తాజాగా మంగళవారం బెంగళూరుకెళ్లి.. కర్నాటక రాజ్యోత్సవ వేడుకల్లో రెడ్‌కార్పెట్ వెల్‌కమ్ తీసుకున్నారు ఎన్టీఆర్ .. దీంతో ఈ చర్చ రాజకీయాల్లో రచ్చ రచ్చ అవుతోంది. అసలు కర్నాటక ప్రభుత్వం ఆయనకు ఇచ్చిన మర్యాద చూసినవారంతా.. ఇది కదా ఎన్టీఆర్ అంటే అంటూ మురిసిపోతున్నారు.
అంతేకాదు బెంగళూర్ చేరుకున్న ఎన్టీఆర్ అక్కడ నుంచి నేరుగా సీఎం బస్వరాజ్ బొమ్మై ఇంటికెళ్లి ప్రత్యేకంగా సత్కారం అందుకున్నారు. సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో పాటు, యంగ్‌టైగర్ ఎన్టీఆర్‌కి సాదరంగా స్వాగతం పలికి, శాలువ, పూలమాలతో సత్కరించారు సీఎం బస్వరాజ్. ఈ పరిణామం. పొలిటికల్‌గా కొత్త చర్చకు ఛాన్సిచ్చేసింది. అయితే ఇది జస్ట్ ఓ ఫార్మల్ మీటింగ్ అని.. రాజకీయాలు వద్దు ప్లీజ్ అని చెబుతున్నా.. బయటకు మాత్రం తేడా కొడుతోంది అంటున్నారు.
ప్రస్తుతం కర్నాటకలో బీజేపీ అధికారంలో ఉండడం ఈ ఊహలు రెట్టింపు అయ్యేలా చేస్తున్నారు. బీజేపీ పెద్దలు సైతం జూనియర్ ఎన్టీఆర్ ను కేవలం ఏపీ, తెలంగాణలకే పరిమితం చేయకుండా.. ఆయన్ను వచ్చే ఎన్నికల నాటికి దేశ వ్యాప్తంగా వాడుకునే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే జస్ట్ కర్నాటకలో శాంపిల్ టెస్ట్ చేశారు అంటున్నారు. ఎన్టీఆర్ ఇతర రాష్టాల్లో.. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఎలాంటి పట్టు ఉంది అన్నది మరోసారి బయట పడింది. అందుకే ఆయన సేవలను.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ పూర్తిగా వాడుకునే ప్రయోగాలు చేస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇదీ చదవండి : టీడీపీ సీట్లపైనే ఫోకస్.. 175 ఎందుకు గెలమని సీఎం ధీమా.. కార్యకర్తలకు ఏం చెప్పారంటే?
ఆ మధ్య హైదరాబాద్‌కి వచ్చిన హోమ్‌మంత్రి అమిత్‌షా. ఎన్టీయార్‌ని ప్రత్యేకంగా హోటల్‌కి పిలిపించుకుని భేటీ అయ్యారు. తారక్‌ని జెమ్ ఆఫ్ తెలుగు సినిమా అని సంబోధిస్తూ స్పెషల్‌గా ట్వీట్ చేశారు. అప్పటి నుంచే జూనియర్ ఎన్టీఆర్ చూపు.. బీజేపీ వైపు అనే ప్రచారం మొదలైంది. తాజాగా కర్నాటక ఎపిసోడ్ తో అంతా.. ఇది ఫిక్స్ అనేస్తున్నారు. తారక్ కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా నిలుస్తారని లెక్కలు వేసుకుంటున్నారు.అది నిజమైతే టీడీపీ కాస్త డ్యామేజ్ అయినట్టే.. ఎందుకంటే ఇప్పటికే చాలామంది టీడీపీ, అభిమానులు కార్యకర్తలు జూనియర్ ఎన్టీఆర్ ను టీడీపీలోకి మళ్లీ తీసుకురావాలని చంద్రబాబును కోరుతున్నారు. ఆయన పూర్తిగా రాజకీయలకు దూరంగా ఉంటే ఎలాంటి సమస్య ఉండదు.. బీజేపీకి ప్రచారం చేస్తూ.. టీడీపీకి దూరంగా ఉంటే.. కావాలనే చంద్రబాబే ఎన్టీఆర్ ను పక్కని పెట్టారని.. ఆయన అభిమానులు ఆగ్రహానికి గురయ్యే ప్రమాదం ఉంది. విపక్షాలకు సైతం అది అస్త్రంగా ఉపయోగపడుతుంది.
రెండువేల తొమ్మిదిలో చంద్రబాబునాయుడు అప్పుడు తెలుగుదేశం పార్టీ కోసం జూనియర్ ఎన్టీఆర్ జనతా నల్లగొండ జిల్లాలో ప్రచారం చేశారు అయితే మధ్యలో జరిగిన ప్రమాదం వల్ల ఎన్టీఆర్ ప్రచారానికి అడ్డుకట్ట పడింది . అయితే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ముఖ్యంగా తెలుగుదేశంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తాత పార్టీ తెలుగుదేశానికి అన్యాయం చేయడని ఇప్పటికీ నమ్ముతున్నారు .వచ్చే ఏడాది ఏప్రిల్లో కర్ణాటకలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ ముఖ్యమంత్రి బొమ్మై తారక్ను బెంగళూరు తీసుకెళ్లి కన్నడ రాజ్యోత్సవ సందర్బంగా సన్మానించడం కలకలం సృష్టించింది .రాజకీయాల్లో శాశ్వత మిత్రులుగాని శాశ్వత శత్రువులుగానీ ఉండవు.జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ పయనం ఎటువైపు కాలమే చెప్పాలి .