వైఎస్ వివేకాను చంపింది మేమే!
దస్తగిరి స్పష్టీకరణ
అవినాష్ ,భాస్కర్రెడ్డి ,జగన్ అంతా ఒక్కటే : దస్తగిరి ఆరోపణ
"ఆయన్ను చంపింది మేమే. ఇందులో పెద్దపెద్ద వాళ్లు ఉండడం వల్లే కేసు ముందుకు సాగకుండా చేస్తున్నారు' అని వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన షేక్ దస్తగిరి ఆరోపించారు. గురువారం పులివెందులలోని తన ఇంటి వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. 'వైఎస్ అవినాశ్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి, వైఎస్ జగన్ అంతా ఒక్కటే. గవర్నమెంట్ వాళ్ల చేతుల్లో ఉంది. దీంతో ఈ రోజుకూ కేసు తేలకుండా చేస్తున్నారు. అందుకు కారణం వీళ్లే కాబట్టి. కేసు ముందుకు పోకుండా మధ్యమధ్యలో స్టాపింగ్ బోర్డులు పెట్టి ట్రాన్స్‌ఫర్లు చేయడం, ఇంకో విధంగా ఇంకో విధంగా జరుగుతోంది కాబట్టే కేసు ముందుకు వెళ్లడం లేదు.
సీబీఐలాంటి పెద్దపెద్ద వాళ్లనే కీలుబొమ్మలు చేసి ఆడిస్తున్నారు. వారి ముందు నేనెంత? చనిపోయిన వివేకానందరెడ్డి తన చిన్నాన్న కాబట్టి ముఖ్యమంత్రే ముందుకొచ్చి అన్ని విధాలా సీబీఐకి సపోర్టుగా నిలవాలి. కానీ, కేసులో ఏదీ జరగకుండా అడ్డుపడుతున్నారు. ఈ కేసులో సాక్ష్యం నేనే కాబట్టి నేను లేకుండా పోతే ఇంక ఎవరు ఏమీ చేయలేరని ఉద్దేశంతో నన్ను ఏమైనా చేస్తారేమోనని భయపడుతున్నా. అందుకే మీడియా ముందుకు వస్తున్నా' అని తెలిపారు. జరుగుతున్నవి చూసి ప్రాణభయంతో ఎస్పీకి లేఖ రాశానని తెలిపారు. '2వ తేదీన నేను పెంచుకుంటున్న కుక్క చనిపోయింది. అదే కుక్క కోసం 6వ తేదీన ఇన్నోవా వాహనంలో ఆరుగురు వ్యక్తులు వచ్చి నా ఇంటి పక్కనున్న వారిని కుక్క అమ్ముతారా అని అడిగి వెళ్లారు. అలాగే గత కొన్ని రోజులుగా గన్‌మెన్‌ను తరచూ మారుస్తుండడంతో నాకు భయమేసి మీడియా వారికి విన్నవించుకుని ఎస్పీకి ఫిర్యాదు చేశా. అయితే నేను చెప్పిన వాటిలో వాస్తవం లేదని ఎస్పీ చెప్పడం బాధాకరం. నాకేం జరిగినా ముఖ్యమంత్రి బాధ్యత వహించాల్సి ఉంటుంది' అని దస్తగిరి స్పష్టం చేశారు.