జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది: రెవెన్యూ మంత్రి ధర్మాన
సంస్కరణలు అర్థం చేసుకోలేని వారు వ్యతిరేకిస్తున్నారు
సంస్కరణలను ఫలితాలు వెంటనే రావు
తమ ప్రభుత్వంపై వ్యతిరేకత వుందని... కారణం సంస్కరణలు అర్ధం చేసుకోలేకపోవడమేనని రెవిన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సంస్కరణలు చేయనివారిని నిందించాల్సింది పోయి.. సంస్కరణలు చేసేవారిపై విమర్శలు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజధానికి అన్ని విధాలుగా అర్హత వుంది విశాఖకేనని.. ఈ నగరమే మెయిన్ రాజధానిగా వుంటుందని ధర్మాన స్పష్టం చేశారు. అయితే ప్రజలకు మేలు జరిగేందుకు ప్రజల్లో తొలుత వ్యతిరేకత వస్తుందని తెలిసినా... జగన్ సంస్కరణల బాట పట్టారని ధర్మాన ప్రసాదరావు ప్రశంసించారు.
అంతకుముందు అక్టోబర్ 31న ధర్మాన ప్రసాదరావు మీడియాతో మాట్లాడుతూ.. పాలన వికేంద్రీకరణతోనే అభివృద్ది సాధ్యమన్నారు. ఏపీలో రాజధాని అవకాశం ఉన్న ఒకే ఒక్క పట్టణం విశాఖపట్నం అని చెప్పారు. మంత్రి శివరామకృష్ణన్ కమిటీ పెద్ద క్యాపిటల్ వద్దని సలహా ఇచ్చిందని అన్నారు. అమరావతి రైతుల పాదయాత్ర ముసుగులో తెలుగుదేశం అదినేత చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని మంత్రి విమర్శించారు. చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప ఇంకేమి పట్టదని ధర్మాన మండిపడ్డారు.
శివరామకృష్ణన్ కమిటీ నివేదికను చంద్రబాబు నాయుడు పట్టించుకోలేదని ప్రసాదరావు ఆరోపించారు. పదేళ్లు హైదరాబాద్‌లో ఉండొచ్చని విభజన చట్టంలో ఉన్నప్పటికీ.. రెండేళ్లకే చంద్రబాబు హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చారని ఎద్దేవా చేశారు. ఒడిశాలోని కటక్‌లో హైకోర్టు.. భువనేశ్వర్‌లో పరిపాలన రాజధాని ఉందని చెప్పారు. మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఇదే తరహా వికేంద్రీకరణ జరుగుతోందని అన్నారు. ఈనాడు రామోజీరావు వ్యాపారాలకు అడ్డం వస్తున్నాననే తనపై తప్పుడు రాతలు రాస్తున్నారని ఆరోపించారు.
మంత్రి పదవి కంటే.. తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని మంత్రి ధర్మాన చెప్పారు. వికేంద్రీకరణకు ఉద్యమంలో చురుగ్గా పాల్గనేందుకు మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సీఎం జగన్ చెప్పానని.. అయితే ఆయన రాజీనామా వద్దని అన్నారని తెలిపారు. ప్రభుత్వం కూడా అదే వైఖరితో ఉందని.. ఆ దిశగా ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని సీఎం జగన్ సూచించారని చెప్పారు.