అధికారుల ట్రెండ్ మారింది
చంద్రబాబుని కలిసేందుకు తహతహ!
Updated: Jan 17, 2023, 12:44 IST
|
చంద్రబాబుని సీక్రెట్ గా కలుస్తున్న ఉన్నతాధికారులు !ఏపీలో పొలిటికల్ ట్రెండ్ ఒక్కసారిగా మారిపోయింది. చంద్రబాబు రాష్ట్రవ్యాప్త పర్యటనలు సక్సెస్ కావడం రాజకీయ వాతావరణంపై అన్ని వర్గాలకు స్పష్టత వచ్చేస్తోంది. మరోవైపు బాబు-పవన్ భేటీతో మరింత క్లారిటీ అందరికీ వచ్చేసింది. టిడిపి ప్రభుత్వం రావడం ఖాయమని నిర్ధారించుకున్న గోడమీద పిల్లుల్లాంటి నేతలు పెదబాబుని, చినబాబుని కలిసి తాము ఎందుకు దూరంగా ఉంటున్నామో వివరణ ఇస్తున్నారు. తాము ఇకపై యాక్టివ్ గా ఉంటామని నమ్మబలుకుతున్నారు. పదవుల కోసమో, కేసుల భయంతోనో, తాత్కాలిక ప్రయోజనాల కోసమో పార్టీ మారిన వారు సైతం తెలుగుదేశంలోకి మళ్లీ వస్తామంటూ సంకేతాలు పంపుతున్నారు. సామాన్యప్రజలు, నేతలకే వైసీపీ పోవడం, టిడిపి రావడం ఖాయమని తేలిపోతే..ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఈ విషయాన్ని ఎప్పుడో పట్టేశారు. చాలామంది ఐఏఎస్, ఐపీఎస్‌లు హైదరాబాద్లో చంద్రబాబుని రహస్యంగా కలుస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ప్రభుత్వంలో కీలక పెద్దల ఆదేశాలతో తాము అడ్డగోలు నిర్ణయాలు తీసుకోక తప్పడంలేదని వాపోతున్నారు. వారికి చంద్రబాబుతో గత ప్రభుత్వంలో అనుబంధం, బంధుత్వాలు, స్నేహాలను గుర్తుచేస్తూ...ప్రభుత్వంలోకి వచ్చాక తమ తప్పుల్ని మన్నించేయాలని ముందుగానే వేడుకుంటున్నారు. పోలీసుశాఖలో చాలా ఘోరంగా వ్యవహరించిన ఓ ఐపీఎస్ బెట్టింగ్ మాఫియా కేసుల్లో అడ్డంగా దొరికిపోయినా..చంద్రబాబు కాపాడారని టాక్ ఉంది. వైసీపీ సర్కారు రాగానే టిడిపిపై జులుం చెలాయిస్తూ ఆ అధికారి చెలరేగిపోయాడు. కట్ చేస్తే చంద్రబాబుని రహస్యంగా విడతల వారీగా కలుస్తున్న అధికారుల్లో ఈ ఐపీఎస్ ఉన్నారని సమాచారం. మరోవైపు సీఐడీలో పనిచేస్తున్న వారంతా చంద్రబాబుని ఎలాగైనా కలిసి తమ తప్పేమీ లేదని, అంతా ఆ ఉన్నతాధికారి ఆడించే ఆటలో పావులం అంటూ చెప్పుకుంటామని రిఫరెన్సులువెతుక్కుంటున్నారట. మొత్తానికి ఏపీలో పొలిటికల్ ట్రెండ్ ని పసిగట్టిన అధికారులు చంద్రబాబునాయుడిని పట్టుకుంటే క్షమించి వదిలేస్తారనే ధీమాతో హైదరాబాద్ అపాయింట్మెంట్ల కోసం నానా అగచాట్లు పడుతున్నారు.