తెరాస విజయాలకు సారధి !
మంత్రి జగదీశ్ రెడ్డి కి ప్రశంస
తెలంగాణ రాష్ట్ర సమితికి ఆయన వరమయ్యారు.. అడుగుపెట్టిన మూడు చోట్ల గులాబీ పార్టీ ఘన విజయాన్ని సాధించింది. కారు పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్..
ఆయనను నమ్మి బాధ్యతలు అప్పగించినందుకు ఏకంగా మూడు ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి విజయాన్ని కట్టబెట్టారు. ఓటమెరుగని నేతగా సరికొత్త రికార్డు సృష్టించారు. ఆయనే.. మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి.
రాజకీయాల్లో రాణించాలంటే అంత సులువైన విషయమేమీ కాదు. ఎప్పటికప్పుడు ప్రజలతో మమేకమై ఉంటూనే ప్రత్యర్థుల ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ముందుకు సాగాలి. ఈ క్రమంలో ఓటములు ఎదురైనా.. తట్టుకుని నిలబడాలి. ఇక, తెలంగాణలో కొద్ది నెలలుగా మునుగోడు ఉప ఎన్నికలపై రాజకీయంగా హంగామా నడిచింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడులో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నికలపై అధికార పార్టీ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాలు పునరావృతం కాకుండా జాగ్రత్తపడింది. ఉప ఎన్నికల బాధత్యలను మంత్రి జగదీష్ రెడ్డికి అప్పగించారు గులాబీ బాస్ కేసీఆర్.
సీఎం కేసీఆర్‌కు నమ్మినబంటుగా పేరున్న జగదీష్ రెడ్డి.. టీఆర్‌ఎస్‌ను గెలిపించేందుకు ఎప్పటికప్పుడు పాచికలను మారుస్తూనే ఉన్నారు. తనదైన మార్క్ చూపిస్తూ ప్రచారంలో దూసుకెళ్లారు. మునుగోడు ఓటర్లకు టీఆర్‌ఎస్ అందిస్తున్న అభివృద్ధి ఫలాలను చెబుతూనే.. నియోజకవర్గ అభివృద్ధికి హామీలు ఇచ్చారు. దీంతో, మునుగోడు ప్రజలు.. అధికార పార్టీకి భారీ విజయాన్ని అందించారు.
అయితే, కొన్నేళ్లలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జరిగిన మూడు ఉప ఎన్నికల్లో మంత్రి జగదీష్ రెడ్డే ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరించారు. హుజూర్‌నగర్, నాగార్జునసాగర్, మునుగోడులో జగదీష్ రెడ్డి.. టీఆర్‌ఎస్ పార్టీకి రికార్డు విజయాలను అందించారు. ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు సైదిరెడ్డి, నోముల భరత్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించుకున్నారు. తన మార్క్ చూపిస్తూ నల్లగొండలో టీఆర్‌ఎస్ పార్టీని బలోపేతం చేశారు. ప్రస్తుతం నల్లగొండ జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ఇప్పటివరకు 11 స్థానాల్లో టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన వారే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. తాజాగా మునుగోడు విజయంతో 12 స్థానాల్లో గులాబీ పార్టీ క్లీన్‌స్వీప్ చేసింది.