సద్గురు శివానందమూర్తి జయంతి
సువర్ణభూమి ఆంగ్ల రచన ఆయన సొంతం
సద్గురు డా. కందుకూరి శివానందమూర్తి అసాధారణ దివ్యజ్ఞాన0
డిసెంబర్ 21 డా. కందుకూరి శివానందమూర్తి గారి జయంతి
శ్రీ శివానందమూర్తిగారు. క్రీ.శ. 1928, డిసెంబరు 21న శ్రీ వీరబసవరాజు, శ్రీమతి సర్వమంగళాంబలకు రాజమహేంద్రవరంలో జన్మించారు. వారి తండ్రిగారు కీ॥శే వీరబసవరాజు గారు, ఆనాడు మద్రాసు ప్రేసిడెన్సిలోనే అత్యంత భాగ్యవంతమైన బ్రాహ్మణ జమీందారీ ఉర్లాంకు ఆఖరి వారసులు. వారికాలంలోనే దాయాదుల కుట్రవల్ల జమీందారీ అంతరించింది. దానిని స్వచ్చందంగా వదలిపెట్టి వారు రాజమహేంద్రవరం చేరారు. కొవ్వూరులోని సంస్కృత కళాశాల ‘ఆంధ్ర గీర్వాణ పీఠము’ చేరి, దాని నిర్వహణలో పాలుపంచుకున్నారు. వీరబసవరాజు గారు సంస్కృతాంధ్రాల్లో ఉత్తమ శ్రేణి కవి. వారి జమీందారీ, వేదశాస్త్రాల, కళల, కవన పాండిత్యాల పోషణను విశ్వవిఖ్యాతంగా చేసిన సంస్థానం. అదే ఒరవడి వీరబసవరాజుగారు కొనసాగించారు. వారి ఆతిథ్య గౌరవాలు పొందని లబ్బప్రతిష్టులైన కవి పండితులు ఆనాడు లేరంటే అతిశయోక్తి కాదు.
శ్రీ శివానందమూర్తిగారు విజయవాడ యస్.ఆర్.ఆర్. & సి.ఆర్.ఆర్. కళాశాలలోను(ఇంటర్మీడియట్), విజయ నగరం మహారాజా కళాశాలలోను 1947-49) విద్యాభ్యాసం చేసి, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి బి.ఎస్సీ. పట్టాను పొందారు. తనకు జమీందారీ ఆస్తుల వారసత్వం వద్దని చెప్పి, తండ్రి వద్ద అనుమతిి పొంది ఆనాడు హైదరాబాద్ స్టేట్ పోలీసుశాఖలో చిన్న ఉద్యోగంలో చేరారు. మూడు దశాబ్దాల ‘పైన (ఎక్కువకాలం వరంగల్ పట్టణంలోనే) ఉద్యోగం చేసి, మరొక 5 సంవత్సరాల ఉద్యోగకాలం ఉండగానే, తాను నిర్వహిస్తున్న డి.జి.పి. యొక్క సెక్రటరీ, పర్ఫానెల్ & ప్లానింగ్ (అడ్మిని(స్టేషన్) ఉద్యోగానికి స్వచ్చందంగా రాజీనామా చేసారు.
శ్రీ గురుదేవుల అర్జాంగి శ్రీమతి గంగాదేవి. వారికి ఇద్దరు కుమారులు (శ్రీ బసవరాజు, శ్రీ రాజశేఖర్), ఇద్దరు కుమార్తెలు (శ్రీమతి మంగళాంబిక, శ్రీమతి గాయత్రి) సంతానం. ఉద్యోగ విరమణానంతరం, శ్రీమతి గంగాదేవిగారి అస్తమయం తర్వాత, తాను పూర్వమే విశాఖతీరంలో భీముని పట్టణం(భీమిలి)లో కొనుక్కొన్న ఒక మామిడితోటలో చిన్న ఇల్లు నిర్మించుకొని నిరాడంబరమైన ప్రశాంతజీవనం సాగించడానికి వెళ్ళి స్థిరపడ్డారు.
ఉద్యోగ జీవితంలో ఉండగానే, వారెంత సామాన్యంగా జీవించినప్పటికీ, వారిలోని జ్ఞానతేజం, యోగ విభూతులపట్ల ఆకర్షితులై అనేకమంది వారినాశ్రయించడం మొదలుపెట్టారు. వందల వేల కుటుంబాలు వారి ప్రత్యక్ష మార్గ దర్శనంలోనే దశాబ్దాలు (రెండు మూడు తరాలు) క్షేమకరమైన జీవనం సాగించారు. ఒకవైపు ఉద్యోగ జీవితంలో, గృహస్థ జీవనంలో ఉంటూనే, అర్హులకు, అర్జార్థులకు సూచనలు, సహాయమే కాక, తననాశ్రయించిన రోగపీడితులకు హోమియో వైద్యం కూడా అందిస్తూ ఉపశమనం కలిగించారు. అంతేగాక, వేలాదిమంది జిజ్ఞాసువులకు భారతీయ మతధర్మ సంప్రదాయాల లోని అతిసూక్ష్మమైన తత్త్వరహస్యాలను విప్పిచెబుతూ, సాధకులకు దారిచూపిస్తూ, ఒక నిత్యకృత్యంగా దానధర్మాలు చేస్తూ, తన నిత్యజీవన విధానంతోనే ఎంతోమందికి స్ఫూర్తిని కలిగించారు. నమ్మశక్యంకానన్ని గుప్తదానాలు చేసారు. ఎందరో కవులు, రచయితలకు గ్రంథముద్రణకు ద్రవ్యం అందించారు. వారి కోరికపై వందలకొద్దీ గ్రంథాలకు పీఠికలు, అభిప్రాయాలు రచించారు.
1962 నుంచి సుమారు నాలుగున్నర దశాబ్దాల పాటు, అసేతుశీతాచలం భారతదేశ పర్యటనలు, క్షేత్ర దర్శనాలు చేసారు. తనతో ఆ యాత్రలకు వందల మందిని తీసుకువెళ్ళి భారతదేశ సాంస్కృతిక, ఆధ్యాత్మిక మహా వారసత్వ సంపదలను, చరిత్రను వారికి పరిచయం చేశారు. కేవలం తీర్థయాత్రలే కాక, చారిత్రక దృష్టితో అతిప్రాచీన భారతీయ నగరాలు నేటికీ అవే ప్రాంతాలలో, అవే పేర్లతో ఎలా నిలిచివున్నాయో చూపిస్తూ 2,500 నాటి గౌతమ బుద్దునితో కూడా తస్సబంధం కలిగిన కపిలవస్తు, శ్రావస్తి, కౌశాంబి, రాజగ్భృహం(రాజ్‌గిర్), వైశాలి, కుషినగర్ వంటి ప్రదేశాలకు తీసుకువెళ్ళి ఆ చరిత్రను ఒక ప్రత్యేక బృందంతో భద్రపరిచారు. గౌతమబుద్దుని నిజచరిత్రను, బోధనలను వివరిస్తూ ఇంగ్లీషులో ఒక స్కిఫ్ట్ వ్రాసారు. దీనిని వారి కుమారులు శ్రీ రాజశేఖర్ తెలుగు, హిందీ భాషలలో “గౌతమ బుద్ధ” చలనచిత్రంగా(2007) నిర్మించారు. ఈ చిత్రానికి “స్పెషల్ జ్యూరీ నంది” అవార్డు లభించింది.
గురుదేవులు తిరుమల తిరుపతి దేవస్థానం – శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ వారి కోరికపై, మన బ్రహ్మాండం, మన్వంతరాలు, మహాయుగాల, పౌరాణిక ఘటనలచరిత్ర (కాలగణనంతోసహా) రచించారు. అది ‘అనంత కాలచక్రం” టి.వి. సీరియల్‌గా 2012 సం॥లో టెలికాస్ట్ చేయబడింది. దేశంలోని ప్రజల క్షేమంకోసం, శాంతియుత జీవనం కోసం, భారతదేశ రక్షణకోసం దేశంలోని మహాక్షేత్రాలలోనూ, మారుమూల ప్రాంతాలలోనూ, సరిహద్దులలోనూ, అరణ్య ప్రాంతాలలోనూకూడా వందలకొద్దీ యజ్ఞాలు నిర్వహించారు. ఇవన్నీ, ఏ ప్రకటనా, ప్రచారమూ లేకుండా అమలుచేసారు. ఛత్తీస్‌గఢ్, అరుణాచల్‌ప్రదేశ్ వంటి రాష్ట్రాలలోని అరణ్యప్రాంతాలలో నివసిస్తున్న గిరిపుత్రులను కలుసుకొని వారికి వస్త్రాలు, అవసరమైన మందులు, ఆహారపదార్థాలు, ద్రవ్య సహాయాలు చేసారు. ఈ సహాయం ప్రతి సంవత్సరం పంపిస్తూ వచ్చారు.
భారతీయ సంస్కృతి, మత ధర్మ సంప్రదాయ మూలాలు, చరిత్రపై – ఎన్నో జటిల ప్రశ్నలకు, విమర్శలకు సమాధానాలుకూడా చెబుతూ – శ్రీ గురుదేవులు రచించిన వందల వ్యాసాలు “ఆంధ్రభూమి” దినపత్రిక, ‘సుపథ’ సాంస్కృతిక ద్వైమాసిక పత్రికలలో ప్రచురితమయ్యాయి. ఇవి “భారతీయత'(4 భాగాలు) గ్రంథంగా ప్రచురణ పొందాయి. భారతీయ సంస్కృతీ నాగరికతలకు పాదులుతీసిన సుమారు 40 మంది మహర్షుల జీవిత చరిత్రలపై వారి వ్యాఖ్యానం “మార్గదర్శకులు మహర్షులు” రెండు భాగాలుగా ప్రచురింపబడింది. ‘హిందూ వివాహ వ్యవస్థ, “కఠయోగము, “శ్రీకృష్ణ వంటి అనేక గ్రంథాలు గురుదేవులు రచించారు.
ప్రాచీన కాలంలోనే ఇండొనేషియా, బాలి వంటి ఆగ్నేయాసియా దేశాలలో వ్యాపించి, నేటికీ సజీవంగా నిలిచిన హిందూసంస్కృతిని, అక్కడకు వెళ్ళివచ్చి వివరించి, ‘సువర్ణభూమి’ అనే గ్రంథంగా గురుదేవులు ఇంగ్లీషులో రచించారు. అమెరికా పర్యటనలుచేసి, అక్కడ కొన్ని ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో, ఇతర ప్రదేశాల్లో భారతీయ సంస్కృతి, సనాతనధర్మంలోని మానవత్వపు విలువలపై ప్రసంగాలు చేసారు.
అతిప్రాచీనకాలంనుండి ఆంధ్రుల (తెలుగువారి) చరిత్రను, వ్యాఖ్యానంతో ముఖ్యఘటనల నాటకీకరణంతో గురుదేవులు రచించిన ‘మనకథిను, దూరదర్శన్ వారు టి.వి.సీరియల్‌గా చిత్రీకరించి 13 భాగాలు (శాతవాహనుల కాలంవరకు) టెలికాస్ట్‌చేసారు.
భారతీయ _ జ్యోతిషశాస్త్రంలోని నిగూఢమైన విషయాల అవగాహన కలిగిన గురుదేవులు, 2010 సం॥లో “మండేన్ అస్ట్రాలజీ’ (వ్యక్తుల జాతకాలు కాక, భూమిపై దేశాల, ప్రజల భవిష్యత్తును తెలిపే జ్యోతిష విభాగం)పై ఒక ప్రపంచ సదస్సును విశాఖపట్టణంలో నిర్వహించారు. దీనికి మనదేశంలోని అత్యుత్తమ జ్యోతిషవేత్తలేకాక, అనేక మంది ప్రఖ్యాతులైన విదేశీ జ్యోతిషవేత్తలుకూడా వచ్చి హాజరై తమ పరిశోధనపత్రాలు సమర్పించారు.
నేటితరాలకు భారతీయ సంస్కృతి, చరిత్ర, విజ్ఞానాల పరిచయం, విశ్లేషణ, స్వాతంత్ర్యపూర్వ సమాజాన్ని కూడా చూచిన పెద్దల వ్యాసాలు, అభిప్రాయాలు, మన నగరాల, క్షేత్రాల చరిత్ర, జాతీయ, అంతర్జాతీయ అంశాలు, కొన్ని ముఖ్యమైన గ్రంథాల సమీక్షలు వంటివాటితో ‘సుపథ’ (ఈ) సాంస్కృతిక మాసపత్రికను గురుదేవులు 1998లో ప్రారంభించారు. వారు నెలకొల్పిన ‘సనాతనధర్మ ఛారిటబుల్ టప్ సంస్థ ఏటా వివిధ రంగాలలో సేవచేసిన దేశభక్తులు, శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, విద్యావేత్తలు, చారిత్రక పరిశోధకులు, కవి పండితులు వంటి పెద్దలను అవార్డులతో గౌరవిస్తోంది. అలాగే శ్రీరామనవమి, కృష్ణాష్టమి ఉత్సవాలు కూడా నిర్వహిస్తోంది. వేదవిద్యవ్యాప్తి, వైదిక విజ్ఞాన పరిరక్షణ ఉద్దేశ్యంతో ఆవిర్భవించిన “ఉత్తరాంధ్ర వేద విద్యాపరిషద్’కు గురుదేవులు ప్రధానపోషకులు మరియు అధ్యక్షులు.
“ఆంధ్ర మ్యూజిక్ అకాడమీ” స్థాపింపచేసి, దానిద్వారా సంగీతోత్సవాలు, వాగ్గేయకార ఉత్సవాలు నిర్వహింపచేసారు. వరంగల్‌లోని గురుదేవుల ముఖ్య శిష్యుల ఆధ్వర్యంలో ఎన్నో సంవత్సరాలుగా వారి జన్మదినోత్సవాలు, గురుపౌర్ణమి, శివరాత్రి మహాపర్వాల నిర్వహణ జరుగుతున్నాయి. వేలాది మంది భక్తులకు ఆయా సమయాలలో వారు ఆతిథ్యమిస్తూ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వరంగల్ వారి ఆధ్వర్యంలో ‘“శివానందగురు కల్చరల్ ట్రస్బ’ నిర్వహింపబడుతోంది. కృష్ణాజిల్లా బలుసుపాడులో, గురుదేవుల శిష్యులైన శ్రీ గెంటేల వెంకటరమణ గారి ఆధ్వర్యంలోని శివానందగురు ఎడ్యుకేషనల్ కల్చరల్ ట్రస్టు ఎన్నో సమాజోపయోగకరమైన కార్యక్రమాలు చేపడుతోంది. 2012లో గురుదేవుల ఆదేశం, ఆశీస్సులతో “శివానంద సుపథ ఫౌండేషన్'((ఆనందవనం), భీమునిపట్టణం) ఆవిర్భవించింది. సుపథ’ సాంస్కృతిక ద్వైమాసిక పత్రిక ప్రచురణ చేపట్టడం, గురుదేవుల రచనలు అన్నింటినీ గ్రంథాలుగా ప్రచురించడం ఈ సంస్థ నిర్వహిస్తోంది.
భీముని పట్టణంలోని తన నివాసం గల తోటలో యోగ గణపతి, సర్వజగత్ సాక్షి గణపతి ఆలయాలు గురుదేవులు నిర్మింపజేసారు. 2008 సం॥లో అక్కడే అద్యాది శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని నిర్మించారు. ఆలయ ప్రతిష్టను కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతీ స్వాముల వారు నిర్వహించారు. దేశంలో అనేక ఆలయాలకు గురుదేవులు ప్రతిష్టలు నిర్వహించారు. ఎన్నో ప్రాచీన ఆలయాల పునరుద్ధరణలు జరిపించారు. హైదరాబాద్‌లో నాగోలు వద్దనున్న ప్రాచీన శ్రీ శైవ మహాపీఠానికి గురు దేవులు పీఠాధిపతిగా ఉన్నారు.
తనను తాను ఎంత మరుగుపరచుకున్నా, ఎన్నో ప్రతిష్టాత్మక గౌరవాలు – బొంబాయిలోని ‘సౌత్ ఇండియన్ ఎడ్యుకేషన్ సాసైట్ (2007), ‘చంద్రశేఖరేంద్ర సరస్వతి ఎమినెన్స్ అవార్డ్, “రాజాలక్ష్మీ ఫౌండేషన్ అవార్డ్’ (2000), కంచికామకోటిపీఠం ‘దేశికోత్తమ” బిరుదం, వరల్డ్ టీచర్స్ ట్రస్ట్ (1994) “మాస్టర్ సి.వి.వి.అవార్డ్’ – గురుదేవులను వరించాయి. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం (హైదరాబాద్) 2005లోను, గీతమ్ యూనివర్సిటీ 2010 లోనూ గురుదేవులకు డి.లిట్.(గౌరవ డాక్టరేట్) ప్రదానంచేసి గౌరవించాయి. రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం వారు 2011లో “’మహామహోపాధ్యాయ’ నిచ్చి సన్మానించారు.
ఇవి, అనేకముఖాల కార్యాచరణకలిగిన గురుదేవులు శివానందమూర్తిగారి జీవనయానంలోని కొన్ని మచ్చుకు మాత్రమే. వారి స్ఫూర్తియే వారి మూర్తిగా తరతరాలను ప్రభావితం చేయనుంది.
తీవ్రమైన మార్పులకు భారతసమాజం లోనైన సంధి కాలంలో, తన అరుదైన అద్భుతమైన జీవన దృగ్విషయంతో వేలాదిమందిని ప్రభావితంచేసిన సద్గురు డా॥ కందుకూరి శివానందమూర్తి గారు 2015 జూన్ 10న వరంగల్‌లోని గురుధామంలో దేహం విడిచారు. వారు జన్మించిన శైవ సంప్రదాయప్రకారంగా, ఆ ప్రాంగణంలోనే వారి అంతిమ సంస్కారాలు వారి పుత్రులు నిర్వహించారు.
సుపథ పత్రిక సౌజన్యం