విశాఖలో పాలనా రాజధాని : శ్రీకాకుళం జడ్పీ తీర్మానం
వ్యతిరేకించిన తెదేపా సభ్యుడు
బుచ్చిబాబు వద్ద మైక్ లాక్కున్న సభ్యులు
శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జడ్పీ అధ్యక్షురాలు పిరియా విజయ అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశం విశాఖపట్నంలో పరిపాలన రాజధాని ఏర్పాటు చేయాలని కోరుతూ తీర్మానం ఆమోదించింది. శుక్రవారం జరిగిన సమావేశంలో అజెండాలోని ఏ అంశాల జోలికి పోలేదు. ప్రజా సమస్యలు ఒక్కటి కూడా చర్చకు రాలేదు. అంతా విశాఖను కార్యనిర్వాహక రాజధాని చేయాలని కోరుతూ ప్రవేశపెట్టిన తీర్మానంపైనే చర్చ సాగింది. దీంతో అక్కడికి వచ్చిన ఇతర అధికారులంతా మిన్నకుండిపోయారు. ఆ తీర్మానాన్ని తెదేపా నుంచి ఉన్న ఏకైక జడ్పీటీసీ పొగిరి బుచ్చిబాబు మినహా మిగిలిన సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. బుచ్చిబాబు మాత్రం విశాఖను రాజధాని చేస్తే శ్రీకాకుళం ఎలా అభివృద్ధి చెందుతుంది...జిల్లానే రాజధానిగా చేయాలి అంటూ తన గళం వినిపించారు. అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు .
స్పీకరు సీతారాం మాట్లాడుతూ విశాఖ పరిపాలనా రాజధాని అవుతుందన్నారు. ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన జడ్పీటీసీ దివ్యను సభ్యులంతా అభినందించారు. జడ్పీ అధ్యక్షురాలు విజయ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర అభివృద్ధే ప్రధాన అజెండాగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి విశాఖ రాజధానిగా ప్రకటించారన్నారు. పాలకొండ ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి మాట్లాడుతూ విశాఖ రాజధానిగా రాకుండా రాజధాని రైతుల పేరుతో ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. రాజాం, పాతపట్నం ఎమ్మెల్యేలు కంబాల జోగులు, రెడ్డి శాంతి మాట్లాడుతూ ఉత్తరాంధ్ర అభివృద్ధి విశాఖ రాజధాని కావటం ద్వారానే సాధ్యపడుతుందన్నారు. ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ మాట్లాడుతూ ఒక సామాజిక వర్గం, ఒక ప్రాంతం అభివృద్ధి, వ్యక్తిగత, తమ సామాజిక, పార్టీ నాయకుల ప్రయోజనాలే లక్ష్యంగా చంద్రబాబు ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా అమరావతిలో రాజధాని ఏర్పాటు చేశారన్నారు. సమావేశంలో జేసీ ఎం.నవీన్, జడ్పీ సీఈవో ఆర్.వెంకట్రామన్, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
చేతిలో మైక్ లాక్కున్నారు..
తీర్మానంపై తెదేపా జడ్పీటీసీ సభ్యుడు బుచ్చిబాబు మాట్లాడుతుండగా వేదికపై ఉన్న స్పీకర్ సీతారాంతో పాటు సభ్యులంతా అడ్డుకున్నారు. బుచ్చిబాబు మరలా మాట్లాడే ప్రయత్నం చేయగా చేతిలోని మైక్‌ని ఎల్.ఎన్.పేట జడ్పీటీసీ సభ్యుడు బలవంతంగా లాక్కున్నారు.