రైతు సమాఖ్య కేసు వాయిదా !
అమరావతి: రైతుల పాదయాత్రలో తామూ పాల్గొనేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ రైతాంగ సమాఖ్య వేసిన పిటీషన్‌పై బుధవారం హైకోర్టు డివిజినల్ బెంచ్‌లో విచారణ జరిగింది.
అయితే రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌లు బెంచ్ మీదకు రాకపోవడంతో కేసు విచారణ సోమవారానికి వాయిదా పడింది.
రైతుల పిటీషన్‌ల తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఆదినారాయణ రావు వాదనలు వినిపించారు. పాదయాత్రకు సంఘీభావం తెలపడం.. తమ నిరసనను తెలియచేసే ప్రాధమిక హక్కును ఉపయోగించడమేనని అన్నారు.
రాజధాని అమరావతిలోనే ఉండాలని హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం తీర్పు ఇచ్చిన తరువాత, పాదయాత్ర చేయాల్సిన అవసరం ఏముందని ధర్మాసనం ప్రశ్నించింది. అయితే రాజధాని అమరావతిపై తీర్పు ఇచ్చిన తరువాత .... ప్రభుత్వం మూడు రాజధానులకు అనుకూలంగా మంత్రులతో ప్రకటనలు చేయిస్తూ, రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తోందని, కర్నూలులో ర్యాలీలను ప్రోత్సహిస్తోందని న్యాయవాది ఆదినారాయణరావు అన్నారు. హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిన తరువాత, మూడు రాజధానులకు అనుకూలంగా, మరోవైపు అమరావతికి అనుకూలంగా పాదయాత్ర చేయడం మంచిది కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
అమరావతి రాజధాని కావాలంటూ రైతులు ఇక్కడ పాదయాత్ర చేస్తున్నారని, కర్నూలులో హైకోర్టు కావాలని అక్కడ వాళ్లు చేస్తున్నారని, రాజధానికి సంబంధించి కూడా మేము తీర్పులో స్పష్టంగా చెప్పామని, అటువంటప్పుడు ఇంకా పాదయాత్రలు, నిరసన కార్యక్రమాలు ఎందుకు అని ధర్మాసనం ప్రశ్నించింది. పాదయాత్ర అంశంపై సింగిల్ జడ్జ్ వద్దకు వెళ్లాలని న్యాయస్థానం సూచించింది. ఇప్పటికే సింగిల్ జడ్జ్‌లు ఇరువురు తమ ఉత్తర్వులు వెల్లడించారని న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. బాధిత పక్షం కోర్టుకు రావాలి కానీ, వేరే వాళ్లు రావడం ఏంటని కోర్టు ప్రశ్నించింది. అయితే బాధితులకు సంఘీభావం తెలిపేందుకే తాము పిటీషన్ వేశామని పిటిషనర్ తరఫు న్యాయవాది చెప్పారు. కాగా దీనిపై ప్రభుత్వం వేసిన కౌంటర్‌ను పరిశీలించాలని న్యాయస్థానం భావిస్తూ.. కేసు తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది