home page

ప్రతిపక్షాల పోరాటం ప్రజల అభీష్టం మేరకే : రఘురామ

 | 

ప్రజల ఆకాంక్షం మేరకు ప్రతిపక్షాల పోరాటం

 రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక పోరాటంలో  బిజెపి కూడా కలిసి రావాలి

 ఎంపీ రఘురామకృష్ణం రాజు

 ప్రజల ఆకాంక్షల మేరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేయనున్న పోరాటంలో దేశంలోనే అతిపెద్ద పార్టీ అయిన బిజెపి కూడా కలిసి రావాలని నర్సాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు కోరారు.  రాష్ట్రంలో ఆ పార్టీకి ప్రస్తుతం కాస్త
 తక్కువ బలమున్నా , ప్రజా ఆకాంక్షల అనుగుణంగా  కలిసి ప్రతిపక్షాలు చేయనున్న పోరాటంలో కలిసి రావాలని రాష్ట్ర బిజెపి నాయకత్వాన్ని 
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆహ్వానిస్తున్నారన్నారు.ప్రజల కోసం, తమలాగా పోలీసుల చేత దెబ్బలు తిన్న వారి కోసం తెలుగుదేశం పార్టీ, జనసేన, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కలిసి పోరాటం చేయాలని నిర్ణయించుకోవడం అభినందనీయమన్నారు. ఈ పోరాటాల వల్ల, ప్రజలకు మంచి జరగకపోయినా... చెడు జరిగే అవకాశం ఉండదని రఘురామకృష్ణం రాజు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రం లో ఇతర ప్రతిపక్ష పార్టీలకు మాదిరిగా, బిజెపి నేతలు సభలు,  సమావేశాలు నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి అడ్డంకులను కలిగించడం లేదన్నారు. ఎందుకంటే, కేంద్రంలో బిజెపి అధికారంలో ఉండడం... ముఖ్యమంత్రి పై పలు కేసులు పెండింగులో ఉండడమే దానికి కారణమని పేర్కొన్నారు. బిజెపి నాయకులు రాష్ట్రవ్యాప్తంగా ఐదువేల సమావేశాలు ఏర్పాటు చేసిన, వారికి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ఆటంకాలను కలిగించలేదన్నారు. అదే టిడిపి, జనసేన పార్టీలు నిర్వహించిన సభలు, సమావేశాలకు ఆటంకాలు కలిగించి, ఇబ్బందులకు గురిచేశారని గుర్తు చేశారు. టిడిపి, జనసేన తో పాటు తనలాంటి వాళ్లు ఎదుర్కొన్న ఇబ్బందులు బిజెపి రాష్ట్ర నాయకత్వానికి తెలియడం లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ తీరు బిజెపి రాష్ట్ర నాయకత్వానికి సౌకర్యంగానే ఉందన్న ఆయన, ప్రజలకు మాత్రం తీవ్ర అసౌకర్యంగా ఉందని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షల కనుగుణంగా బిజెపి రాష్ట్ర నాయకత్వం నడుచుకోవాలని రఘు రామ కృష్ణంరాజు సూచించారు.  
బుధవారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రస్తుతం అంతా కలిసి నడుద్దామని, ఎన్నికలు ఎప్పుడు వస్తాయో... అప్పుడేమీ చేయాలన్నది చూద్దామని వ్యాఖ్యానించారు. ప్రజల శ్రేయస్సు దృష్ట్యా  ప్రజలని రక్షించుకుందామని,తెలుగుదేశం పార్టీ, జనసేనలు కలవడం ప్రజాస్వామ్య వాదులంతా స్వాగతించాలని కోరారు. టిడిపి,  జనసేన లు కలవడంతో ఆ రెండు పార్టీలకు చెందిన శ్రేణులు గాలిలో తేలిపోతున్నారన్నారు. విశాఖ, ఉభయగోదావరి జిల్లాలు, గుంటూరు లో రెండు పార్టీల కార్యకర్తలు ఆనందోత్సాహాల మధ్య ఉన్నారని తెలిపారు.

 పిల్లిని బంధించి కొడితే పులి అవుతుంది... పులినే కొట్టాలనుకుంటే ఎలా?

 పిల్లిని గదిలో బంధించి కొడితే పులిలా గాండ్రించి కళ్ళు పీకుతుందనీ, అదే పులినే గదిలో బంధించి కొట్టాలని అనుకుంటే ఎలా అంటూ పవన్ కళ్యాణ్, రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేసిన వైనంపై రఘురామకృష్ణంరాజు స్పందిస్తూ వ్యాఖ్యానించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కాపు నేతలతో పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి తిట్టిస్తున్నారని అన్నారు. మంత్రులు గుడివాడ అమర్నాథ్, అంబటి రాంబాబు, మాజీ మంత్రులు పేర్ని నాని, అవంతి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తో పాటు మంత్రి రోజా చేత పవన్ కళ్యాణ్ గురించి జగన్మోహన్ రెడ్డి  దారుణంగా మాట్లాడించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరు మాట్లాడిన పవన్ కళ్యాణ్ మూడు వివాహాల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. పవన్ కళ్యాణ్ తన భార్యలకు విడాకులు ఇచ్చాకే పెళ్లిళ్లు చేసుకున్నారని గుర్తు చేశారు. తన ఆస్తిలో సింహభాగం వారికే చెందేలా చర్యలు తీసుకున్నారన్నారు. పవన్ కళ్యాణ్ ను తమ పార్టీకి చెందిన నాయకులు, మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్యాకేజీ స్టార్ అని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గత ఇదేళ్ల లో 34 కోట్ల  రూపాయల ఆదాయ పన్ను కట్టిన నటుడికి ప్యాకేజీ తీసుకోవడం అవసరమా అని ఆయన ప్రశ్నించారని గుర్తు చేశారు . ఈ సందర్భంగా తన కాలి  చెప్పు చూపిస్తూ తమ పార్టీ నేతల మూతి పగలగొట్టేటటువంటి వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. రానున్న ఎన్నికలలో  టిడిపి, జనసేన కలిసి పోటీ చేస్తే, రాయలసీమ మినహా ఇతర ప్రాంతాలలో తమ పార్టీకి సింగల్ సీటు కూడా రాదనే భయంతో, పవన్ కళ్యాణ్ పై  ఒత్తిడి పెంచేందుకు ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. స్వచ్ఛమైన వ్యక్తిత్వం కలిగిన పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి గురించి అవాకులు,  చవాకులు పేలడం హాస్యాస్పదంగా  ఉందన్నారు. నిర్మాతలకు కష్టం వచ్చినా, కుటుంబ సభ్యులకు అభిమానులకు ఏ ఆపద వచ్చినా తాను ఉన్నానని ముందుకు వచ్చే పవన్ కళ్యాణ్ గురించి నానా మాటలు ఈ చెత్త వెదవలు మాట్లాడితే ఆయనలోని అగ్నిపర్వతం  బద్దలై... మరొకసారి ప్యాకేజీ స్టార్ అంటే,  చెప్పుతో కొడతానని  వ్యాఖ్యానించారని పేర్కొన్నారు. చెప్పుతో కొడతానని పవన్ కళ్యాణ్ అనగానే, తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాల మేరకు తాము అలాగే అంటామని... చెప్పుతో కొట్టండి చూద్దాం అంటూ కొంతమంది తమ పార్టీ నాయకులు  వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.  తమ పార్టీ నాయకుల చేత మాట్లాడిస్తున్న వ్యక్తి పరదాలు, ఇనుప చట్రాలు, జెడ్ కేటగిరి రక్షణ వలయం మధ్య తిరుగుతారని ఆయన సురక్షితంగానే ఉంటారని, కానీ పవన్ కళ్యాణ్ ని తూలనాడుతున్న వ్యక్తుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. గతంలో తమ ముఖ్యమంత్రిని పేర్కొన్నట్లుగా అభిమానులకు బిపి వస్తే దాడులు చేస్తారని, పవన్ కళ్యాణ్ లాంటి నటుడిని అభిమానించి ఆరాధించే అభిమానులు ఆయన గురించి నోటికొచ్చినట్లు మాట్లాడితే వారు దాడులకు దిగితే ఎవరూ బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ఒక పార్టీ అధినేతగా ఎవరితోనైనా కలిసి పని చేసే అధికారం ఆయనకు ఉందన్నారు. ప్రస్తుతం బిజెపితో  ఆయన స్నేహ బంధాన్ని కొనసాగిస్తున్నారని గుర్తు చేశారు.

 ఒక పెళ్లి చేసుకుని ఉంటే ఒకే రాజధాని అనేవారా?

 మూడు వివాహాలు పవన్ కళ్యాణ్ విధానమైతే, మూడు రాజధానులు తమ విధానమని మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలపై రఘురామకృష్ణం రాజు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పవన్ కళ్యాణ్ ఒక పెళ్లి చేసుకుని ఉంటే... ఒకే రాజధాని అని అని ఉండేవారా? అంటూ ప్రశ్నించారు. హిందూ వివాహ చట్ట ప్రకారం భార్య ఉండగా మరొక వివాహం చేసుకోవడం నేరమని, కానీ దంపతులు ఇరువురి మధ్య సఖ్యత కుదరక విడాకులు తీసుకున్న తర్వాత పెళ్లి చేసుకోవడం నేరమేమి కాదని అన్నారు. వైయస్ రాజారెడ్డి తండ్రి వెంకట్ రెడ్డి భార్య ఉండగానే రెండవ వివాహం చేసుకున్నారని, ఇద్దరు భార్యలకు  సంతానం కలిగారన్నారు. జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల కు తొలుత మేనమామతో వివాహం జరగగా, ఆ వివాహం విఫలమై ఆమె ప్రేమించిన అనిల్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందేనని అన్నారు. ఈ విషయాలపై టీడీపీ, జనసేన నాయకులు ఎప్పుడైనా మాట్లాడారా అంటూ ప్రశ్నించిన రఘురామకృష్ణంరాజు, ఇది పద్ధతి కాదని... రాజకీయాలతో సంబంధం లేని అంశం అని, కేవలం వ్యక్తిగతమని పేర్కొన్నారు.

 సునీత పోరాట స్ఫూర్తితో ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా న్యాయపోరాటం చేద్దాం

 మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో దోషులను శిక్షించాలని ఆయన కుమార్తె డాక్టర్ సునీత  చేసిన న్యాయ  పోరాట స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పద్ధతిలో న్యాయపోరాటం చేద్దామని రఘురామకృష్ణం రాజు ప్రజలకు పిలుపునిచ్చారు. తన తండ్రి హత్య కేసులో దోషులను శిక్షించాలని కోరుతూ, భర్త సహకారంతో సునీత సాగించిన న్యాయపోరాటం అభినందనీయమని పేర్కొన్నారు .
వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ ఆంధ్ర ప్రదేశ్ లో  కాకుండా ఇతర రాష్ట్రాల్లో చేపట్టాలని కోరుతూ డాక్టర్ సునీత వేసిన పిటీషన్, సిబిఐ చాలా గట్టిగా సమర్ధించిందని తెలిపారు. చెడపకురా చెడేవు అన్నట్లుగా ప్రస్తుతం కడప పెద్దల పరిస్థితి తయారైందని  అన్నారు. సిబిఐ అధికారి రాంసింగ్ పై  ఎఫ్ఐఆర్ నమోదు చేయడం వంటి ఘటనలు బెడిసి  కొట్టాయని అన్నారు. ఇక గతంలో సీఐ గా పని చేసిన శంకరయ్య... ఈ కేసులో సాక్షి గా ఉన్న గంగాధర్ రెడ్డిలు  తొలుత సిబిఐ కి  వాంగ్మూలాన్ని ఇచ్చి, ఆ తర్వాత   సిబిఐ అధికారులు తమను ప్రలోభ పెట్టారు
.. బెదిరించారని అడ్డం తిరిగారన్నారు  . ఈ కేసుకు సంబంధించిన ఇద్దరు సాక్షులు ఇప్పటికే చనిపోవడం, సిబిఐ అధికారులు విచారణ జరుగుతుండగా, విచారణ చేస్తున్న సంఘటనలను వీడియో తీసి ఎవరో శివశంకర్ రెడ్డి కి పంపడం, ఆ వీడియోలు ఆయన ఫోన్లో లభించాయన్నారు.శివశంకర్ రెడ్డి సాక్షులను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నారని  కోర్టు భావించిందని అన్నారు.
ఇక శివ శంకర్ రెడ్డి ని  అరెస్టు చేసినప్పుడు, కడప ఎంపీ అవినాష్ రెడ్డి గొడవ చేశారట..  జైలు నుంచి మెజిస్ట్రేట్ అనుమతి లేకుండానే ఆయన్ని ఆసుపత్రికి తరలించడంలోను అవినాష్ రెడ్డి ప్రమేయం ఉన్నట్లు తెలిసిందని అన్నారు. నిందితుల తరఫున వాదించడానికి సీనియర్ లాయర్లను నియమించిన తెర వెనుక వ్యక్తి కి నిరాశే మిగిలిందని చెప్పారు. ఈ కేసు విచారణను ఆంధ్ర ప్రదేశ్  నుంచి వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలన్న తరపు న్యాయవాది వాదనలతో, సిబిఐ ఏకీభవించిందన్నారు.  దీనితో వివేకానంద రెడ్డి హత్య  కేసు విచారణను ఇతర రాష్ట్రాలకు  బదిలీ చేయాలని సుప్రీంకోర్టు   తుది తీర్పులో వెల్లడిస్తారని తెలిపారు.