home page

ఎమ్మెల్యేస్థానాలకు ఎంపీలు పోటీ

వైసీపీ సరికొత్త ప్రయోగం 

 | 
Ysrcp

పార్లమెంటుకాదు.. ఈ సారి వారంతా అసెంబ్లీకే.. వైసీపీ వ్యూహం!


వచ్చే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఏపీ అధికార పార్టీ వైసీపీ దానికి తగిన విధంగానే వ్యూహాలను అమలు చేస్తోంది. ప్రతి విషయాన్ని ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలకు.. పనిచేస్తేనే టికెట్లు అని తేల్చి చెప్పిన వైసీపీ.. అదేసమయంలో మార్పు చేయాల్సి వస్తే.. ఏయే నియోజకవర్గాల్లో ఎలాంటి వారిని కేటాయించాలనే విషయంపై స్పష్టతకు వచ్చినట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగా కొందరిని పార్లమెంటుకు బదులు అసెంబ్లీకి పంపాలని నిర్ణయించుకుంది. వీరిలో ప్రధానంగా సామాజిక వర్గాల బలం ఉన్న నాయకులు  నాయకురాళ్లు కనిపిస్తున్నారు.


ఎంవీవీ సత్యనారాయణ:  ప్రస్తుతం విశాఖ పార్లమెంటు స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈయనకు ఏడు నియోజకవ ర్గాల్లోనూ వ్యతిరేకత ఉంది. పైగా సొంత పార్టీలోనే అసంతృప్త నేతలు పెరిగారు. దీంతో ఆయనే స్వయంగా వచ్చే ఎన్నికల్లో తాను అసెంబ్లీకి వెళ్తానంటూ.. ఆయనే ఇటీవల తన అనుచరులకు తేల్చి చెప్పారు. దీనిపై అధిష్టానానికి కూడా ఆయన సమాచారం ఇచ్చారు. దీంతో ఆయనను విశాఖ తూర్పు లేదా.. ఉత్తరం నుంచి రంగంలోకి దింపే అవకాశం ఉంది.


గోరంట్ల మాధవ్:  ప్రస్తుతం హిందూపురం ఎంపీగా ఉన్నారు. అయితే న్యూడ్ వీడియో మకిలి అంటించుకోవడంతో ఆయనపైనా ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. ఈ నేపథ్యంలో ఆయనను తిరిగి ఎంపీగా నిలబెట్టినా...ప్రయోజనం లేదని పార్టీ అధిష్టానంఒక నిర్ణయానికి వచ్చింది. ఆయనకు ఎంపీగా పోటీ చేయాలని ఉన్నప్పటికీ.. ఈ సారి పెనుకొండ నుంచి పోటీ చేయిస్తారని అంటున్నారు. ఇక్కడ ఉన్న మాజీ మంత్రి శంకరనారాయణకు మొండి చేయేనని చర్చసాగుతోంది.

అవినాశ్ రెడ్డి:  కడప ఎంపీగా ఉన్నారు. అయితే ఈయనపైవివేకా హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఈసారి ఎంపీగా గెలిపించుకోవడం కష్టం కనుక.. ఈయనను రాజంపేట ఎమ్మెల్యేగా పంపిస్తారని తెలుస్తోంది. ఇక రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డిని పార్టీ ఇప్పటికే దూరం పెట్టింది. ఆయన టీడీపీ నుంచి వచ్చి వైసీపీలో చేరారు. తిరిగి ఇప్పుడు ఆయన టీడీపీవైపు చూస్తున్నారు. రాజంపేటను జిల్లా కేంద్రం చేయడంలో విఫలమయ్యారనే వాదన ఉంది.

బాలశౌరి:  మచిలీపట్నం ఎంపీగా ఉన్నారు. అయితే ఈయనకు మాజీ మంత్రి పేర్నికి మధ్య ఈగవాలినా గొడవ జరుగుతోంది. దీంతో ఆయన తమకు వద్దని పేర్ని లాబీయింగ్ చేస్తున్నారు. దీంతో ఈయనను తిరిగి గుంటూరు జిల్లా నరసరావుపేట ఎంపీగా పంపిస్తారనేది ఖరారైనట్టు తెలుస్తోంది. ఇక్కడ ఎంపీగా ఉన్న లావుకు ఈ సారి టటికెట్ దక్కేలా కనిపించడం లేదు. ఆయన రాజధాని రైతులకు మద్దతుగా నిలిచిన నేపథ్యంతోపాటు టీడీపీవైపు చూస్తున్నారు.

వంగా గీత:  కాకినాడ ఎంపీగా ఉన్నారు. కాపు వర్గానికి చెందిన నాయకురాలు. అయితే ఆమే స్వయంగా వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేసి మంత్రి పదవిని దక్కించుకోవాలని చూస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే పిఠాపురం నియోజకవర్గంపై కన్నేశారని తెలుస్తోంది. ఇక్కడున్న పెండెం దొరబాబుపై ఆరోపణలు రావడంతో ఆయనను పక్కన పెట్టారు. ఈయన రెబల్ అయ్యే అవకాశం ఉంది. అయినా.. ఆయనకు టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు.

నందిగం సురేష్:  బాపట్ల ఎంపీగా ఉన్న ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సురేష్కు మంత్రి పీఠంపై ఆశ ఉంది. ఈ నేపథ్యంలో ఆయనే ఈ సారి తనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. అయితేఎక్కడా ఖాళీ లేకపోవడం గమనార్హం. అయితే మేకతోటి సుచరిత.. జనసేనవైపు వెళ్లే సూచనలు ఉండడంతో ఆమె ఖాళీ చేస్తే.. ఆ సీటును ఈయనకు ఇచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

మార్గాని భరత్:  రాజమండ్రి ఎంపీగా ఉన్న ఈయనపై ఎలాంటి ఆరోపణలు లేకున్నా.. సొంత పార్టీలో తీవ్ర అసంతృప్తి ఉంది. దీంతో ఈయనను నిలబెట్టినా.. సొంత పార్టీ నేతలే ఓడిస్తారనే బెంగ ఉంది. దీంతో ఈయనను రాజమండ్రి సిటీ నుంచి పోటీ చేయించి.. అసెంబ్లీకి పంపుతారని.. కుదిరితే బీసీ కోటాలో మంత్రి పదవి ఇచ్చినా ఆశ్చర్యంలేదని సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి.