కవిసామ్రాట్ అద్భుతం !
సినిమా చూడాలనుకుంటున్న బాలకృష్ణ
''ఎల్.బి. శ్రీరామ్ గారు... త్వరలో మాకు చూపించండి. ఈ సినిమా చూడాలని మనసు ఉవ్విళ్ళూరుతుంది'' అని నట సింహం నందమూరి బాలకృష్ణ అన్నారు.
ఆహా ఓటీటీలో విడుదలైన 'కవి సమ్రాట్' (Kavi Samrat On Aha) చూడాలనుందని ఆయన చెప్పుకొచ్చారు. పద్మభూషణ్, జ్ఞానపీఠ పురస్కారల గ్రహీత... తెలుగుజాతికి గర్వకారణమైన కవి విశ్వనాథ సత్యానారాయణ (Kavi Samrat Viswanatha Satyanarayana) జీవితం ఆధారంగా రూపొందిన చిత్రమిది. ఎల్.బి. శ్రీరాం టైటిల్ పాత్రలో నటించడంతో పాటు నిర్మించారు.
ఈ సినిమాపై ఎందుకు బాలకృష్ణ ఆసక్తి చూపించారంటే... విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందయమూరి తారక రామారావుకు విశ్వనాథ సత్యనారాయణ గురువు. ఆయన జీవితం ఆధారంగా ఎల్.బి. శ్రీరామ్ (LB Sriram) తీసిన సినిమా ఎలా ఉందంటే?
కథ :విశ్వనాథ సత్యనారాయణ (ఎల్.బి. శ్రీరామ్)కు బాల్యం నుంచి రచయిత కావాలని ఆకాంక్ష. 'పాఠాలు అంటే పాటలు అంటున్నావ్. క్లాసుకు వెళ్ళమంటే కవిత్వం రాస్తానంటున్నావ్. ఇలా అయితే చదువు ఎలా గట్టెక్కుతుంది' అని తండ్రి శోభనాద్రి (రామజోగయ్య శాస్త్రి) అడిగితే... తనకు రచయిత కావాలనుందని చెబుతాడు. పెరిగి పెద్దయిన తర్వాత ఆయన రచయిత అయ్యారు. ఆయనకు సత్కారాలు, ప్రశంసలు, పురస్కారాలు... ఎన్నో వచ్చాయి, వస్తున్నాయి. అయితే... ఆయన జీవితంలో ఎన్టీఆర్, కొల్లిపర సూర్యచౌదరి పాత్ర ఏమిటి? ప్రసన్న రాసిన 'పృథ్వీ భాగవతం' చదివిన తర్వాత విశ్వనాథవారి అనుభూతి ఏమిటి? 'వేయి పడగలు', 'శ్రీ రామాయణ కల్ప వృక్షము' రాయడానికి ముందు విశ్వనాథ వారింట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? చిన్నతనంలో తండ్రి చెప్పిన మాటను గుర్తు పెట్టకుని ఆయన ఏం చేశారు? అనేది సినిమాలో చూడాలి.
విశ్లేషణ : బాలకృష్ణతో తమది చిరు ప్రయత్నంగా ఎల్.బి. శ్రీరామ్ చెప్పారు. నిజంగా ఆయనది చిరు ప్రయత్నమే. అయితే... తెలుగు జాతి గర్వించదగ్గ రచయిత గురించి నేటి తరం తప్పకుండా తెలుసుకోవాలని ఆయన చేసిన ప్రయత్నం, సంకల్పం అభినందనీయం.
విశ్వనాథ సత్యనారాయణ పాత్రలో ఎల్.బి. శ్రీరామ్ సహజంగా నటించారు. ఆయన తండ్రి పాత్రలో గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి, తనయుడి పాత్రలో నిర్మాత రాజ్ కందుకూరి కనిపించారు. మిగతా పాత్రల్లో అనంత్ బాబు, చెల్లె స్వప్న, దివంగత టీఎన్‌ఆర్ తదితరులు నటించారు. జోశ్యభట్ల స్వరాలు శ్యావ్యంగా ఉన్నాయి. దర్శకుడు సవిత్ సి. చంద్ర ఆనాటి వాతావరణం తీసుకు రావడం కోసం పడిన కష్టం తెరపై కనిపించింది. నిర్మాణ పరంగా పరిమితులు తెలుస్తూ ఉన్నాయి. నటనతో ఆ కాలంలోకి తీసుకు వెళ్లే ప్రయత్నం చేశారు ఎల్.బి. శ్రీరామ్. నిర్మాతగా ఉన్నంతలో మంచి చిత్రాన్ని అందించారు.
సగటు సినిమా లెక్కలకు, కమర్షియల్ అంశాలకు దూరంగా రూపొందిన చిత్రమిది. దీనిని పూర్తిస్థాయి సినిమా అని చెప్పలేం. ఎందుకంటే... విశ్వనాథ సత్యనారాయణ జీవితంలో కొన్ని ఘట్టాలను మాత్రమే చూపించారు. అసలు సినిమా నిడివి కూడా గంట మాత్రమే. ఆపైన అరగంట విశ్వనాథవారి రచనల గురించి ఉంటుంది. డాక్యుమెంటరీ తరహా సినిమాగా 'కవిసమ్రాట్'ను చూడవచ్చు. మాస్ మసాలా చిత్రాలు, ప్రేమకథలు చూసే ఈతరానికి ఈ సినిమా ఎంతవరకూ నచ్చుతుందనేది చెప్పడం కష్టమే. తెలుగు భాషలో గొప్ప రచనలు చేసిన వ్యక్తి జీవితంలో కొంతైనా తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవాళ్ళను కొంచమైనా ఆకట్టుకుంటుంది.