home page

కడప ఉక్కుకు 3 సార్లు శంఖుస్థాన

 | 
Ap

*కడప ఉక్కు పరిశ్రమకు "ఫీజుబులిటీ" లేదు - మోడీ ప్రభుత్వం దగాకోరు వైఖరి 

*ఉక్కు సంకల్పంతో కార్పోరేట్ సంస్థ జే.ఎస్.డ.బ్ల్యూ స్టీల్స్ ను జగన్ ఒప్పించారు - అధికార పార్టీ పత్రికలో వార్త 

*ప్రైవేటు సంస్థకు లాభదాయకంగా ఉన్నప్పుడు, ప్రభుత్వ రంగ దిగ్గజం స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాకు లేదంటే ఎలా నమ్మాలి! 

*ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం మేరకు రాష్ట్ర ప్రభుత్వం హక్కుగా పోరాడి కడప ఉక్కు కర్మాగారాన్ని ఎందుకు సాధించలేక పోయిందన్నది నా ప్రశ్న.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాధినేతల 'రాచ'క్రీడలకు ప్రతిబింబం, "కడప ఉక్కు పరిశ్రమ". ఇది నడుస్తున్న చరిత్ర. ఇందులో కొన్ని అంశాలను ప్రజలు నిశితంగా పరిశీలించాలి. మోడీ ప్రభుత్వం "ఫీజుబులిటీ (లాభదాయకం)" లేదని తెల్చేసింది. ఒకనాడు బ్రాహ్మణి ఉక్కు కర్మాగారానికి డా.వైఎస్సార్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తాజాగా జే.ఎస్.డ.బ్ల్యూ స్టీల్స్ ప్రతిపాదనకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆమోదం తెలియజేసింది. లాభదాయకంగా ఉంటేనే కదా! ప్రయివేటు సంస్థలు ఉక్కు పరిశ్రమను నెలకొల్పడానికి ఆసక్తి కనబరుస్తున్నాయి. ప్రభుత్వ రంగంలో నెలకొల్పడానికి లాభదాయకం కాదంటూ మోడీ ప్రభుత్వం కడప ఉక్కు కర్మాగారాన్ని నిరాకరించడం దగాకోరు విధానంకాక మరేమౌతుంది!

కడప ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పడానికి జే.ఎస్.డ.బ్ల్యూ స్టీల్స్ సంస్థ ముందుకొచ్చిందట. రు.8,800 కోట్లు పెట్టుబడి పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నదట. ఈ మాట, 2019 డిసెంబరు 23న శంకుస్థాపన చేసిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి చెప్పారట. మూడేళ్ళ తర్వాత, నిన్న రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆ ప్రతిపాదనను ఆమోదించిందట. శీఘ్రగతిన అడుగు ముందుకు పడ్డందుకు సంతోషించాలి! నేడు రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం నెలకొల్పబడింది. మరొకసారి ఉక్కు కర్మాగారం శంకుస్థాపనకు రంగం సిద్ధమైనట్లుంది. కడప ఉక్కు కర్మాగారం శంకుస్థాపనల పరంపర కొనసాగుతోంది! నాడు బ్రాహ్మణి స్టీల్స్ కు వైఎస్సార్ ముద్దనూరు - జమ్మలమడుగు మధ్య చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న తర్వాత కొప్పర్తి - కంభాలదిన్నే ప్రాంతంలో గత ఎన్నికలకు ముందు చంద్రబాబు శంకుస్థాపన చేశారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక సున్నపురాళ్ళపల్లి సమీపంలో శంకుస్థాపన చేశారు. రాబోయే ఎన్నికలకు ముందు మరొకసారి శంకుస్థాపన చేస్తారేమోనన్న భావన కలుగుతున్నది. అంతే! అందుకే, పరిశ్రమ ఎన్నటికి నెలకొల్పబడుతుందో! అన్న అనుమానం. మనిషి ఆశాజీవి. చూద్దాం!

ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం - 2014, భాగం -10: మౌలిక సదుపాయాలు, ప్రత్యేక ఆర్థిక చర్యలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వై.యస్.ఆర్. జిల్లాలో "ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్" ను నెలకొల్పే అవకాశాన్ని 'స్టీల్ అథారిటి ఆఫ్ ఇండియా' అధ్యయనం చేసి 6 మాసాల్లో నివేదిక సమర్పించాలి" అని పేర్కొన్నారు. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా(SAIL) సమర్పించిన నివేదికలో కడప ఉక్కు కర్మాగారం నెలకొల్పడం లాభదాయకంకాదన్న అభిప్రాయాన్ని తెలియజేసిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించి, విభజన చట్టంలోని ఆ హామీని అటకెక్కించే ప్రయత్నం చేస్తే ప్రజలు ఆందోళనకు పూనుకొన్నారు. దాంతో కాస్తా వెనకడుగు వేసినట్లు నటించి, మెకాన్ సంస్థతో అధ్యయనం చేయిస్తున్నామని, కర్మాగారాన్ని నెలకొల్పుతామని, త్వరలో శంకుస్థాపన కూడా జరుగుతుందన్నంత స్థాయిలో బిజెపి నాయకులు ఒకనాడు నమ్మబలికారు. మరొకవైపు, సుప్రీం కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ ద్వారా చావు కబురు చల్లగా చెప్పినట్లు సాధ్యంకాదని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. లాభాలు గడించవచ్చనుకొంటేనే కార్పోరేట్ సంస్థలు పరిశ్రమలను నెలకొల్పుతాయన్నది జగమెరిగిన సత్యం కదా!

కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పాలన్న ప్రజల డిమాండుకు ఒక నేపథ్యమున్నది. దశాబ్ధం క్రితమే ప్రయివేటు రంగంలో 'బ్రాహ్మణీ స్టీల్స్' నెలకొల్పడానికి గాలి జనార్ధన్ రెడ్డి కంపెనీకి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసి, దాదాపు 14,000 ఎకరాల ప్రభుత్వ బంజరు, అటవీ భూములను రాష్ట్ర ప్రభుత్వం నామమాత్రపు ధరకు కేటాయించింది. పొరుగునున్న బళ్ళారి జిల్లాలోని ఇనుప ఖనిజంతో పాటు అనంతపురం జిల్లాలో నిక్షిప్తమై ఉన్న ఇనుప ఖనిజం ఆధారంగా ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పరిశ్రమ నిర్మాణానికి సంబంధించి కొంత పని కూడా జరిగింది. ఒక వైపున పరిశ్రమ నిర్మాణానికి చర్యలు చేపడుతూనే ఇనుప ఖనిజం అక్రమ త్రవ్వకాలకు, అక్రమ రవాణా, అక్రమ ఎగుమతుల ద్వారా భారీ కుంభకోణo, వేల కోట్ల అక్రమార్జనకు పాల్పడి గాలి జనార్ధన్ రెడ్డి  జైలు పాలయ్యారు కూడా. 

ఉక్కు పరిశ్రమ నిర్మాణంలో కూడా అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు, ప్రభుత్వం కేటాయించిన భూములను బ్యాంకుల వద్ద తనఖా పెట్టి రుణాలు తీసుకోవడం వగైరా అవకతవకలకు పాల్పడ్డారని రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించుకొని అనుమతులను రద్దు చేసి, భూములను వాపస్ తీసుకొన్నది. దాంతో బ్రాహ్మణీ స్టీల్స్ నిర్మాణం ఆగిపోయింది. ఈ పూర్వరంగంలో 'సెయిల్' దాన్ని తీసుకొని, పరిశ్రమ నిర్మాణానికి ముందు కొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగానే స్పందించినట్లు వార్తలూ వచ్చాయి. ఈ తంతు నడుస్తుండగానే రాష్ట్ర విభజన జరిగి పోయింది.  విభజన చట్టంలో ఉక్కు పరిశ్రమ నిర్మాణం అంశాన్ని పొందుపరచారు. రాయలసీమ ప్రజానీకంలో కాస్త ఆశలు చిగురించాయి. ఆ ఆశలను అడియాశలు చేస్తూ మోడీ ప్రభుత్వం దగాకోరు విధానానికి పాల్పడింది.

విభజన చట్టంలోని సెక్షన్ 94: "(1)పారిశ్రామికీకరణను, ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడానికి కొత్తగా ఏర్పడే రెండు రాష్ట్రాలకు పన్ను ప్రోత్సాహాలతో సహా తగు విధమైన ఆర్థిక చర్యలను కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి. (2) రెండు రాష్ట్రాల్లో భౌతిక, సాంఘికపరమైన విస్తరణతో సహా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి చేపట్టే కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం సహాయపడాలి" అని పేర్కొన్నారు. విభజన చట్టాన్ని అమలు చేయాల్సిన కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ మేరకు చర్యలు చేపట్టి వెనుకబడ్డ, కరవు పీడిత రాయలసీమ ప్రాంతంలో కడప ఉక్కు పరిశ్రమను నెలకొల్పడానికి విధాన నిర్ణయం తీసుకొని అమలు చేయడానికి పూనుకొని ఉండాల్సింది. రాయలసీమ లాంటి వెనుకబడ్డ ప్రాంతాలలో పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వాలకు ఉండవలసింది అంకితభావం. వెనుకబడిన ప్రాంతాల్లో పారిశ్రామికాభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కార్యాచరణకు పూనుకోవడం, రిజర్వేషన్లను అమలు చేసి సామాజికంగా వెనుకబడ్డ ప్రజానీకానికి ఉపాథి కల్పించడం, భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ రంగం మౌలిక స్వభావం కదా! 

100% ఆదాయపు పన్ను రాయితీ, జి.ఎస్.టి. పరిథిలోని పన్నుల్లో 100% రాయితీ, మూలధన పెట్టుబడిని సమకూర్చి, ఉత్ఫత్తుల మార్కెటింగ్ కు బరోసా కల్పించి, ప్రోత్సహించినప్పుడే రాయలసీమ లాంటి వెనుకబడ్డ ప్రాంతాల్లో పారిశ్రామికాభివృద్ధికి అవకాశాలు మెరుగౌతాయి. ఆ వైపున కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం ఆలోచించలేదు. కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమను నెలకొల్పడానికి సామాజిక, ఆర్థికాభివృద్ధి దృక్పథంతో రాజకీయ సంకల్పం ముఖ్యమైనది. ప్రభుత్వ రంగంలోని "స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నెలకొల్పడానికి అవసరమైన కార్యాచరణకు కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పూనుకొంటే సాధ్యమవుతుంది. సెయిల్ తో పాటు నేషనల్ మినరల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్(ఎన్.యం.డి.సి.)ల సంయుక్త ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమను నెలకొల్పడానికి పూనుకోవాలి. ఉక్కు పరిశ్రమను నెలకొల్పడం ద్వారా లభ్యమవుతున్న ముడి ఇనుప ఖనిజాన్ని సరుకుగా మార్చి అదనపు విలువను జోడించి విదేశాలకు  ఎగుమతి చేయడం ద్వారా, లేదా దేశీయంగా వినియోగించుకోవడం ద్వారా జాతీయోత్ఫత్తిని పెంపొందించుకోవచ్చన్న విజ్ఞత కూడా పాలకులు ప్రదర్శించక పోవడాన్ని ఏమనాలి? 

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పాలన్న డిమాండ్ చేసినప్పుడు కూడా ఇందిరా గాంధీ నేతృత్వంలోని నాటి కేంద్ర ప్రభుత్వం "ఫీజిబిలిటీ" లేదని తిరస్కరిస్తే " విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు" అన్న నినాదంతో ప్రజా ఉద్యమం పెల్లుబికి, 32 మంది ప్రాణాలను బలిదానం చేశాక, నెలకొల్పారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి సొంత గనుల్లేవు. కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం నేటికీ కేటాయించలేదు. అయినా నవరత్నాల్లో ఒకటిగా అభివృద్ధి చెందింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు అరవై వేల మందికిపైగా ఉపాథి కల్పిస్తున్నది. విశాఖపట్నం ఒక మహానగరంగా ఆవిర్భవించడానికి ఉపకరించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచింది. దేశ పారిశ్రామిక, ఆర్థికాభివృద్ధిలో తన వంతు పాత్ర పోషిస్తున్నది. రాయలసీమ ప్రాంతంలో అలాంటి ఒక్క పరిశ్రమ కూడా లేకుండా ఉపాథి కల్పన ఎలా జరుగుతుంది? అభివృద్ధిలో ప్రజలను ఎలా భాగస్వాములను చేస్తారు? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఈ ఆలోచించన కొరవడింది.

అనంతపురం జిల్లాలో లభించే ఇనుప ఖనిజం నాణ్యత తక్కువని ఒకప్పుడు చిన్నచూపు చూసే వారు. నేడు శాస్త్ర, సాంకేతిక రంగాలలో విప్లవాత్మక విజయాలు సాధించాక లభిస్తున్న ముడి ఇనుప ఖనిజాన్ని శుద్ధిచేసి, వినియోగించుకొనే సౌలభ్యం కలిగింది. ఈ వాస్తవాలను కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోక పోవడం దారుణం. సమాజానికి ఇనుము అవసరం నిరంతరాయంగా ఉంటుంది. మార్కెట్ ధరల్లో స్థిరత్వం లేక పోవచ్చు. దానికి కారణం మార్కెట్ ఆర్థిక విధానాలే. వాటిని ప్రాతిపదికగా తీసుకొని "ఫీజిబిలిటీ" లేదన్న నిర్ధారణకు రావడంలో హేతుబద్ధత ఉన్నదా! రాయలసీమ వెనుకబాటుతనంపైన, సమగ్రాభివృద్ధిపైన గంభీరోపన్యాసాలిచ్చే పాలకులు ఎందుకు అలసత్వాన్ని  ప్రదర్శిస్తున్నారు? ఉపాథి అవకాశాలు లేక లక్షల సంఖ్యలో గల్ఫ్ దేశాలకు, దేశంలోని వివిధ ప్రాంతాలకు ప్రజలు వలసలు వెళుతున్నారు. ఉపాథి కల్పించి, వలసలను నివారించి, ప్రజల జీవన ప్రమాణాలను పెంచాలన్న సంకల్పమే ప్రభుత్వాలలో లోపించింది. 

టి. లక్ష్మీనారాయణ