ఏపీ పై కేవీపీ ఆత్మ ఘోష!
జగన్ పాలనపై తొలిసారి నోరు విప్పిన వైస్సార్ ఆత్మ
ఎస్ ఆత్మ కేవీపీ. ఆ ప్రకారం జగన్ అంటే అమితమైన ప్రేమ ఉండాలి. కేవీపీకి వ్యక్తిగతంగా జగన్ పై ఎంత ప్రేమ అయినా ఉండవచ్చు కానీ.. పాలకుడిగా మాత్రం ఆయనపై తీవ్ర వ్యతిరేకత చూపిస్తున్నారు.
తాజాగా విజయవాడలో కొత్త పీసీసీ బాధ్యతలు చేపట్టే కార్యక్రమానికి హాజరైన ఆయన తన ప్రసంగంలో ఏపీలో జరుగుతున్న పాలనపై ఆవేదన వ్యక్తం చేశారు. ''బంగారు భవిష్యత్ కలిగిన ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పాలన చూస్తుంటే ఆవేదన కలుగుతోంది. విభజన హామీల అమలు కోసం జగన్ పోరాడడం లేదు. ప్రత్యేక హోదా కోసం కేంద్రాన్ని జగన్ నిలదీయడం లేదు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో రాష్ట్రం దశదిశ మారేదు. ఇప్పుడు దాని దుస్థితి చూస్తుంటే బాధేస్తోంది'' అని నేరుగానే చెప్పుకొచ్చారు.
జగన్ పోలవరాన్ని పట్టించుకోవడం లేదు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించేందుకు కేంద్రం సిద్ధపడుతున్నా.. ఆపేందుకు ప్రయత్నించడం లేదు.. అని అసంతృప్తి వ్యక్తం చేశారు. జగన్ కూడా ఈ విషయాలను నేరుగా అంగీకరించకపోయినా పరోక్షంగా తన పని తీరు ద్వారా అదే చెబుతున్నారు. అందిరి లాంటి పాలన తనది కాదని.. కేవలం బటన్ నొక్కడం ద్వారా డబ్బులు అందుతున్నాయా లేదా అన్నది చూడటమే తన లక్ష్యం అని చాలా సార్లు చెప్పారు. ఆ ప్రకారమే పాలన చేస్తున్నారు.
వైఎస్ సన్నిహితుల్లో చాలా మంది జగన్‌కు వ్యతిరేకంగా ఉన్నారు. వైసీపీలో చేరిన వారు .. పదవులు పొందిన వారు కూడా అసంతృప్తిగానే ఉన్నారు. కానీ వారు బయటకు చెప్పుకోలేకపోతున్నారు. బయట ఉన్నవారు మాత్రం.. బహిరంగంగానే చెబుతున్నారు. జగన్ తీరును ఎండగట్టడానికి వైఎస్‌తో తమకు ఉన్న అనుబంధాన్ని కాసేపు మర్చిపోవడానికి కూడా వారు వెనుకాడటం లేదు.