home page

కోర్టు ధిక్కరణలో జగన్ ఆల్ టైమ్ రికార్డు

4500 కేసుల్లో  ధిక్కరణ! 

 | 
Raghu

కోర్టు ఆదేశాల ఉల్లంఘన లో జగన్ సర్కార్ ఆల్ టైం రికార్డ్

 క్విడ్ ప్రోకో జరిగినట్టు స్పష్టంగా ఉందన్న సుప్రీంకోర్టు

 ఎంపీ రఘురామకృష్ణంరాజు

 హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ దేశంలోనే ఆల్ టైం రికార్డ్ సృష్టించిందని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు అపహాస్యం చేశారు. గత మూడేళ్లలో 4700 కోర్టు 
 ఆదేశాల ఉల్లంఘన   పిటిషన్లను ప్రభుత్వం దాఖలు చేసిందన్నారు. హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని మామూలుగా చివాట్లు పెట్టలేదని, సిగ్గున్న అధికారి ఎవరు కూడా కోర్టుకు వెళ్లి ఎన్నిసార్లు చివాట్లు తినరని ఎద్దేవా చేశారు. వారి దౌర్భాగ్యానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏమైనా సౌభాగ్యాన్ని కలిగిస్తున్నారేమోనని అనుమానాన్ని వ్యక్తం చేశారు. శనివారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... రాష్ట్రంలో పనులు చేసిన ఎవ్వరికీ డబ్బుల చెల్లింపులు లేవన్నారు. ఆదాయం బ్రహ్మాండంగా ఉందని  జగన్మోహన్ రెడ్డి అంటున్నారని, ఆదాయమే ఉంటే అప్పులు ఎందుకు చేస్తామని ఆర్దిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పేర్కొంటున్నారన్నారు. కరోనా కారణంగా ఆదాయం కుంటు పడిందని బుగ్గన చెబుతుంటే, కరోనా అనే సమర్ధవంతంగా ఎదుర్కొన్న వీరుడిని తానేనని జగన్మోహన్ రెడ్డి అంటున్నారని ఎద్దేవా చేశారు. కరోనా కష్టకాలంలోనూ ఆదాయం తగ్గకుండా చూశానని గొప్పలు పోతున్నారన్నారు. ఇప్పటికే ఈ సంవ్సరంలోనే 50 వేల కోట్ల రూపాయల అప్పులు చేశారని, ఇంకా ఎన్ని అప్పులు చేస్తారో తెలియదన్నారు.  పెద్ద మొత్తం అప్పులు చేస్తూ ,  బాకీలను కూడా తీర్చకపోవడం విస్మయాన్ని కలిగిస్తోందన్నారు. ఎన్ ఆర్ జి ఎస్ పనులు చేసిన  వారికి డబ్బులు చెల్లించడం లేదని, రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ నుంచి మాత్రం డబ్బులు డ్రా చేశారన్నారు. ఈ డబ్బులను పక్కదారి పట్టించినట్లు  వెల్లడించారు.

 ఉన్నత విలువలకు మార్గదర్శి రామోజీరావు

 ఉన్నత విలువలకు మార్గదర్శి, మార్గదర్శి చిట్ ఫండ్ వ్యవస్థాపకులు రామోజీరావు అని  రఘురామకృష్ణంరాజు కొనియాడారు. పూర్తి పారదర్శకత తో నడుస్తున్న మార్గదర్శి చిట్ ఫండ్ పై రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం దాడులు చేసి సోదాలు నిర్వహించిందన్నారు. తన జన్మ దినోత్సవ రోజు తనని అరెస్టు చేసి వేధించినట్లుగానే, 
రామోజీరావు జన్మదినోత్సవం సందర్భంగా వేధించాలని  చూశారన్నారు. కేసులే లేని మార్గదర్శిపై సాక్షి దినపత్రికలో నానా కూతలు కూస్తున్నారని  మండిపడ్డారు. సుప్రీం కోర్టు చివాట్లు పెట్టిన వార్త మాత్రం సాక్షి దినపత్రికలో కనిపించదని ఎద్దేవా చేశారు.

 విజయసాయిని ప్యానల్ చైర్మన్ గా తప్పించాలి

 రాజ్యసభ ప్యానల్ చైర్మన్ గా వ్యవహరిస్తున్న విజయసాయిరెడ్డిని తక్షణమే ఆ పదవి నుంచి తప్పించాలని రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతిని రఘురామకృష్ణం రాజు కోరారు. మహిళా లోకం పై, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై దుర్గంధం వెదజల్లే ట్విట్ల ను విజయ సాయి రెడ్డి  పెడుతున్నారన్నారు. పెద్దల సభలో చైర్మన్ స్థానంలో కూర్చున వ్యక్తి మహిళల గురించి జుగుస్సాకరంగా, దేశ రాజకీయాలను కొన్నాళ్లు శాసించి, 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి గురించి అసహ్యమైన  ట్విట్లను విజయసాయిరెడ్డి చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు విజయసాయిరెడ్డిని క్షమించరని, తమ పార్టీ అధ్యక్షుడు కూడా దీని వెనుక  ఉన్నాడని జనం అనుకుంటున్నారని అన్నారు. తమ పార్టీ పార్లమెంటరీ నాయకుడు  మహిళా సమాజం గురించి తప్పుగా మాట్లాడినందుకు అతన్ని పార్లమెంటరీ పార్టీ నాయకుడి పదవి నుంచి తప్పిస్తే, పోగొట్టుకున్నది కొద్దిగా సాధించవచ్చునని అన్నారు. సహచర ఎంపీగా తనపై ఏమైనా ట్వీట్లు వేస్తే వేయవచ్చునని, తాను నాలుగు ట్విట్లు వేస్తానని తెలిపారు. మనం మనం ఎంపీలమని మనలో మనం అనుకుంటే పెద్ద ఇబ్బంది ఏమి లేదన్నారు. దేశ నాయకులు, మహిళల గురించి జుగుస్సా కరంగా మాట్లాడితే పార్టీ భూస్థాపితం అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్లను ఉపరాష్ట్రపతికి లేఖ రాస్తానని, త్వరలోనే ఆయన అపాయింట్మెంట్ తీసుకొని కలుస్తానని రఘురామకృష్ణం రాజు తెలిపారు.

 జగన్ మీటింగ్ కు ఎంత మంది  వస్తారో... తనకు స్వాగతం పలికేందుకు ఎంతమంది వస్తారో చూసుకుందాం

 నరసాపురంలో అభివృద్ధి పనులు చేయడానికి ముఖ్యమంత్రి వెళ్తున్నారని, స్థానిక ఎంపీ మాత్రం ఢిల్లీలో కూర్చున్నారని విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా చేసిన ట్వీట్ పై రఘురామకృష్ణం రాజు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తనపై దొంగ కేసులు, ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద  అక్రమ కేసులు పెడుతూ, తాను ఢిల్లీలో కూర్చున్నానని ట్విట్ చేయడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ 15 రోజులపాటు తనపై అక్రమ కేసులు నమోదు చేయనని హామీ ఇస్తే, రాష్ట్రానికి వస్తానని అన్నారు. తనకు స్వాగతం పలికేందుకు ఊర్లకు ఊర్లే కదిలి వస్తాయని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభకు ఎంత మంది వస్తారో... తనకు స్వాగతం పలికేందుకు ఎంతమంది వస్తారో చూసుకుందామని సవాల్ చేశారు. అడాన్ డిస్టలరీస్ మద్యాన్ని పంచిన, బిర్యానీ పొట్లాలను అందజేసిన జగన్మోహన్ రెడ్డి సభకు హాజరయ్యే ప్రజలకంటే  ఎక్కువగానే తనకు స్వాగతం పలికేందుకు ప్రజలు హాజరవుతారన్నారు.

 భూములు కేటాయించిన రోజే... సాక్షి షేర్ల కొనుగోలు

హెటిరో, అరబిందో ఫార్మా కంపెనీలకు 2006 నవంబర్ లో  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూములు కేటాయించిన రోజే, ఆ రెండు కంపెనీలు జగతి పబ్లికేషన్స్ పది రూపాయల షేర్ ను 350 రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిందని  రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఒకే రోజు అన్ని జరిగాయని, చాలా క్లియర్ గా ఉందంటూ న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు పరిశీలిస్తే పరోక్షంగా క్విడ్ ప్రోకో జరిగిందని చెప్పకనే చెప్పారన్నారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తండ్రి,  అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 2006లో హెటిరో, అరబిందో ఫార్మా కంపెనీలు తమకు 75 ఎకరాల   భూములు కేటాయించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగానే, అదే రోజు ఏపీఐఐసీ ద్వారా భూములను కేటాయించారన్నారు.  అంతకుముందే మరొక ఫార్మా కంపెనీ పది ఎకరాల స్థలాన్ని కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరితే, రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం నిరాకరించిందని తెలిపారు. హెటిరో, అరబిందో ఫార్మా కంపెనీలు దరఖాస్తు చేసుకున్న రోజే ప్రభుత్వం భూములు కేటాయించడం, అదే రోజు  ఈ రెండు కంపెనీలు జగతి పబ్లికేషన్ షేర్లను కొనుగోలు చేయడం క్విడ్ ప్రోకోలో భాగమేనని మాజీ మంత్రి శంకర్ రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు  సిబిఐ జెడి లక్ష్మీనారాయణ దర్యాప్తు చేసి చార్జి షీట్ దాఖలు చేశారని తెలిపారు. చార్జ్ షీట్ ను  కొట్టివేయాలని  కోర్టును ఆశ్రయించగా, చార్జిషీట్ కొట్టివేయడానికి కోర్టు తిరస్కరించిందని తెలిపారు. చార్జిషీట్లో శరత్ చంద్రారెడ్డి,  రోహిత్ రెడ్డి, అరబిందో ఫార్మా మేనేజింగ్ డైరెక్టర్ నిత్యానంద రెడ్డి పేర్లు ఉన్నాయని తెలిపారు. వీరంతా కుటుంబ సభ్యులు బంధువులేనని వెల్లడించారు.

 ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లో అన్న అధ్యక్షుడు... తమ్ముడు ఉపాధ్యక్షుడా?

 ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న శరత్ చంద్రారెడ్డి 
 ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్   అధ్యక్షుడిగా మరొకసారి
ఎన్నికయ్యారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో శరత్ చంద్ర రెడ్డి తరఫున ఆయన తమ్ముడు రోహిత్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారన్నారు. అధ్యక్షుడిగా శరత్ చంద్రారెడ్డి, ఉపాధ్యక్షుడిగా రోహిత్ రెడ్డి ఎన్నిక కాగా, వీరి వ్యాపార భాగస్వామి అయిన  గోపీనాథ్ రెడ్డి ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక కావడం ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు. గోపీనాథ్ రెడ్డి కంపెనీకి  రోహిత్ రెడ్డి అప్పు ఇచ్చారని, దస పల్లా భూములను   డెవలప్మెంట్ కోసం తీసుకున్న వ్యక్తి గోపీనాథ్ రెడ్డే నని తెలిపారు. ఒకే కుటుంబానికి చెందిన  అన్నదమ్ములను, వారి వ్యాపార భాగస్వామిని   అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడానికి  క్రికెట్ ఆడేవాళ్ళకైనా బుద్ధి ఉండాలని అన్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యవర్గ ఎన్నికల వెనుక ఎవరున్నారని, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు ఈ వ్యక్తులకు మధ్య ఉన్న సంబంధం ఏమిటని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు.