home page

కర్ణాటకలో జోరుగా పోరు పందాలు

 | 

సమీప దూరంలో అత్యధిక నియోజకవర్గాలున్న కర్ణాటకకు ఎన్నికలు నిర్వహించటం, రెండు జాతీయ పార్టీలు, ఒక ప్రాంతీయ పార్టీ, గుజరాత్‌ ఎన్నికలతో జాతీయ హోదా పొందిన ఆమ్‌ ఆద్మీ పార్టీలు రానున్న విధానసభ ఎన్నికలతో తమ రాజకీయ భవిష్యత్తుకు గట్టి పునాదులు వేసుకునేందుకు కసరత్తు చేస్తున్నాయి. దక్షిణ భారత రాష్ట్రాల్లో 2024 లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు(27) రాబట్టాల్సిన జాతీయ పార్టీలు విధానసభ ఎన్నికలు అత్యంత కీలకమైనవిగా పరిగణిస్తాయి. ఈ ఎన్నికల్లో సాధించే విజయం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోనూ ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. ఈ ఎన్నికల్లో జాతీయ పార్టీల పోటీని తట్టుకునేందుకు రెండు చిన్నపార్టీలుగా భావించే జేడీఎస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌)లు పటిష్ఠమైన ప్రణాళికలు రచిస్తున్నాయి.

గుజరాత్‌ కంటే మెరుగ్గా-ఆప్‌ ధీమా

గుజరాత్‌ ఎన్నికల్లో 5 సీట్లను సాధించిన ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) అక్కడ సాధించిన ఓట్లతో జాతీయ పార్టీగా ఆవిర్భవించింది. ఇదే ఎన్నికల్లో కొన్ని చోట్ల కాంగ్రెస్‌ కంటే ఎక్కువ ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచింది. అంతకు ముందు నిర్వహించిన దిల్లీ కార్పొరేషన్‌ ఎన్నికల్లో సాధికారిక విజయాన్ని సాధించిన ఆప్‌ కర్ణాటకలో సత్తా చాటేందుకు సిద్ధమైంది. ఆ పార్టీ ఉపాధ్యక్షుడు భాస్కర్‌ రావ్‌ శుక్రవారం మాట్లాడుతూ గుజరాత్‌ కంటే మెరుగైన స్థానాలను కర్ణాటకలో సాధిస్తామని ప్రకటించి జాతీయ పార్టీలకు సవాలు విసిరారు. జాతీయ పార్టీల అవినీతి, ఓటుకు నోటు రాజకీయాల నుంచి రాష్ట్ర ప్రజలకు విముక్తి కలిగిస్తామని ఆయన చేసిన ప్రకటన పార్టీ ఎత్తుగడను వెల్లడించింది. ఈ ఎన్నికల్లో మొత్తం 224 స్థానాల్లో అభ్యర్థులను బరిలో దింపేందుకు కసరత్తు ప్రారంభించింది. ఈ ఎన్నికల్లో కొత్త ముఖాలు, గెలిచే సత్తా ఉన్నవారికి సీట్లిచ్చి కనీసం 60 స్థానాల్లో గెలుస్తామని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కర్ణాటకలో జాతీయ పార్టీలు, సంకీర్ణ ప్రభుత్వాల పాలనకు భిన్నమైన రాజకీయాలను పరిచయం చేస్తామని ప్రకటించిన ఆప్‌..ఆ దిశగా పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌తో విస్తృతంగా ప్రచారం చేయించే కార్యాచరణను సిద్ధం చేసింది. భాజపా నుంచి మోదీ, అమిత్‌ షా, జేపీ నడ్డాలు, కాంగ్రెస్‌ నుంచి రాహుల్‌గాంధీ, సోనియా, ప్రియాంక గాంధీల వంటి కీలక నేతల ప్రచారాన్ని దీటుగా ప్రచారాలు చేయించేందుకు ఆప్‌ కార్యవర్గం యోచిస్తోంది.

బీఆర్‌ఎస్‌ తోడుగా...

శుక్రవారం జాతీయ పార్టీగా కేంద్ర ఎన్నికల కమిషన్‌ నుంచి ధ్రువీకరణ పొందిన భారత్‌ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్‌ కొత్త రూపం)తో జేడీఎస్‌ అత్యంత సన్నిహితంగా మెలుగుతోంది. శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్‌ అధికారిక ప్రకటనా కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి హాజరయ్యారు. ఆ సందర్భంగా బీఆర్‌ఎస్‌ వ్యవస్థాప అధ్యక్షులు కేసీఆర్‌ చేసిన ప్రకటనతో జేడీఎస్‌ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. రానున్న కర్ణాటక ఎన్నికల్లో జేడీఎస్‌కు బహిరంగంగా మద్దతిస్తామని కేసీఆర్‌ ప్రకటించారు. కర్ణాటకలో మరోమారు కుమారస్వామిని ముఖ్యమంత్రిగా చూడాలని కేసీఆర్‌ ప్రకటించారు. బీఆర్‌ఎస్‌ తరఫున తెలంగాణ సరిహద్దు నియోజకవర్గాల ఎమ్మెల్యేలను కర్ణాటక ఎన్నికల పర్యవేక్షకులుగా నియమించింది. ఇదే సందర్భంగా మాట్లాడిన కుమారస్వామి..బీఆర్‌ఎస్‌ పార్టీ మద్దతుతో 2023 ఎన్నికల్లో మరిన్ని సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. జనవరి 3 నుంచి మొదలయ్యే హైదరాబాద్‌ కర్ణాటక పంచరత్న రథయాత్రలోనూ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. ఇదే ప్రచారంలో తెలంగాణా మంత్రి కేటీఆర్‌ కూడా పాల్గొంటారని సమాచారం.

చేదు అనుభవాలే పాఠాలుగా..

కర్ణాటకలో రాజకీయాలు నిత్యం ఆసక్తి గొలిపేందుకు కారణమైన పార్టీ జేడీఎస్‌. కర్ణాటకలో 2013 ఎన్నికలు మినహా 25 ఏళ్లుగా జాతీయ పార్టీలేవీ అధికారాన్ని చేపట్టేంత సంఖ్యలో సీట్లు గెలవలేదు. మిగిలిన ఎన్నికల్లో జేడీఎస్‌ సాధించే సీట్లు జాతీయ పార్టీల ప్రభుత్వ ఏర్పాటుకు ఆలంబనగా నిలిచేవి. 2003లో 70స్థానాలు గెలుచుకున్న భాజపాకు, 2018లో 80స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్‌కు జేడీఎస్‌తో పొత్తు అనివార్యంగా మారింది. ఈ రెండు సార్లూ జాతీయ పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జేడీఎస్‌ పూర్తి స్థాయిలో అధికారంలో ఉండలేకపోయింది. ప్రాంతీయ పార్టీగా జేడీఎస్‌ లక్ష్యాలకు, జాతీయ పార్టీల విధానాలకు వ్యవస్థాగత భిన్నాభిప్రాయాలు పొడచూపేవి. జాతీయ పార్టీల పొత్తుతో ఎదురైన చేదు అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకున్న జేడీఎస్‌ ఈ ఎన్నికల్లో కొత్త వ్యూహాలను రచిస్తోంది.