home page

వైసీపీ ఎమ్మెల్యేల నెత్తిన ఐ పాక్

 | 
ఎమ్మెల్యేలను చీకాకుపెడుతున్న ఐప్యాక్ సర్వేలు
వెంటాడుతున్న ఐప్యాక్ ఉద్యోగులతో వైసీపీ ఎమ్మెల్యేలకు పెద్ద చిక్కు వచ్చిపడింది. వైసీపీ ఎమ్మెల్యేలపై ఐప్యాక్ నిరంతర నిఘా వేసి ఉంచింది. ఎమ్మెల్యే ఎక్కడకు వెళ్తుతున్నారు? ఏం చేస్తున్నారు? నియోజకవర్గంలో ఎన్ని రోజులు ఉంటున్నారు? ఇలాంటి డేటా మొత్తం ఐప్యాక్ ఉద్యోగులు ఎప్పటికప్పుడు తమ ప్రధాన కార్యాలయానికి పంపుతున్నారు. దాంతో వైసీపీ ఎమ్మెల్యేలు ఐప్యాక్ ఉద్యోగులను చూసి బెంబేలెత్తుతున్నారు. కొందరైతే బహిరంగంగానే చీకాకు వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేల పనితీరుపై ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐప్యాక్ (ఇప్పుడు ఆయన లేకపోయినా ఆయన స్థాపించిన కంపెనీనే) వైసీపీ రాజకీయ వ్యవహారాలను చూస్తున్నది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి రూపకల్పన చేసి ఆ కార్యక్రమంలో ఎందరు ఎమ్మెల్యేలు ఎన్ని రోజులు పాల్గొన్నారనే అంశంపై నివేదిక ఇచ్చింది కూడా ఐప్యాక్ సంస్థే. ఈ సంస్థ ఇచ్చిన నివేదికల ఆధారంగానే వైసీపీ అధిష్టానవర్గం అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నది. దాదాపు 27 మంది ఎమ్మెల్యేలు అసలు గడప గడపకు మన ప్రభుత్వంలో పాల్గొనలేదని కూడా ఐప్యాక్ సంస్థ అధిష్టానానికి చెప్పినట్లు వార్తలు వెలువడ్డాయి. తమపై నిరంతర నిఘా కొనసాగిస్తున్న ఐప్యాక్ అంటేనే కొందరు ఎమ్మెల్యేలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే తమ అభిప్రాయాన్ని బహిరంగంగా వ్యక్తం చేస్తే అసలుకే ప్రమాదం వస్తుందని వారు లోలోనే మదనపడుతున్నారు. ఐప్యాక్ చేస్తున్న సర్వేల ఆధారంగానే ముఖ్యమంత్రి జగన్ ఎమ్మెల్యేలపై వ్యాఖ్యలు చేస్తున్నదున ఆ సంస్థకు ఎనలేని ప్రాధాన్యత ఏర్పడింది. తమ రాజకీయ జీవితంతో ఐప్యాక్ సంస్థ ఆడుకుంటున్నదని కూడా కొందరు ఎమ్మెల్యేలు తమ సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నారని సమాచారం. ఐప్యాక్ ప్రభావం వైసీపీ పై ఎంతగా ఉందంటే ఒక వైసీపీ పూర్తి స్థాయి కార్యకర్త ఒక అగ్ర నేతను కలుసుకుని తనకు ఏదైనా నామినేటెడ్ పోస్టు ఇవ్వాలని కోరాడట. తన చేతిలో ఏమీ లేదని, ఐప్యాక్ సర్వేలో పేరు వస్తే పార్టీనే పిలిచి పదవి ఇస్తుందని ఆ అగ్రనేత సదరు వ్యక్తికి చెప్పాడట. పార్టీ కోసం అహర్నిశలూ కష్టపడ్డ తాను కూడా తన శీలాన్ని ఐప్యాక్ వద్ద నిరూపించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని సదరు వ్యక్తి వ్యాఖ్యానిస్తూ వెళ్లిపోయాడని అంటున్నారు. ఈ విధంగా వైసీపీ కీలక నిర్ణయాలన్నింటిలో ప్రధాన పాత్ర పోషిస్తున్న ఐప్యాక్ సంస్థ తమ జీవితాలతో ఆడుకుంటున్నదని వైసీపీ ఎమ్మెల్యేలు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఎవరు ఎన్ని చెప్పినా ఐప్యాక్ సంస్థ చేసిన సర్వేలో మంచి పాయింట్లు వస్తేనే రాబోయే ఎన్నికలలో ఎవరికైనా సరే మళ్లీ టిక్కెట్ వచ్చేది. ఇది కఠోర సత్యంగా కనిపిస్తున్నది. దాంతో తమలో తామే మదనపడటం వైసీపీ ఎమ్మెల్యేలకు అలవాటు అయిపోయింది.