home page

ప్రమాదం అంచుల్లో ప్రజాస్వామ్యం!

ఇదీ ఆంధ్రప్రదేశ్ లో నేటి దృశ్యం

 | 
Ap

*ప్రమాదం అంచుల్లో ప్రజాస్వామ్యం!*

*ప్రశ్నించే ప్రతిపక్షం కరవై*
*అంతా ఏకపక్షం!!*

*(ఇ.సురేష్ కుమార్)*

ప్రజాస్వామ్యంలో బలమైన ప్రతిపక్షం ఉండడం ఎంతైనా అవసరం..పాలక పక్షం ఎలాగైతే ప్రజల పనుపున ఏలుబడి సాగిస్తుందని అనుకుంటామో ప్రతిపక్షం అలాగే ప్రజల తరపున ప్రశ్నించే గొంతుగా వ్యవహరిస్తుంది.ఈ రెండూ సజావుగా నడిస్తేనే పాలన..దానిని అనుసరించి అభివృద్ధి..ప్రజాసంక్షేమం తదితరాలు సక్రమంగా సాగుతాయి.అయితే దురదృష్టవశాత్తు ప్రస్తుతం కేంద్రంలో,రాష్ట్రంలో కూడా ప్రతిపక్షం నామమాత్రంగా మిగిలిపోవడంతో పాలన ఏకపక్షంగా మారిపోయి ఇంచుమించు నియంతృత్వ పోకడలో ఏలుబడి సాగిపోతోంది.కేంద్రంలో ఈ తరహా పరిస్థితులు 2014 నాటి నుంచే కొనసాగుతుండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొన్న 2019 ఎన్నికలలో చోటుచేసుకున్న పరిణామాలు గతంలో ఎప్పుడూ కనీవినీ ఎరగని క్రొంగొత్త పోకడలకు తలుపులు తెరిచాయి..
     మన దేశంలో జవహర్ లాల్ నెహ్రూ,లాల్ బహదూర్ శాస్త్రి ఏలుబడి తర్వాత ఇందిరా గాంధీ శకం మొదలైన పిదప తొలిసారిగా ఏకపక్ష విధానాలు..ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే నియంతృత్వ పోకడలు ఊపిరి పోసుకున్నాయి.శాస్త్రీజీ అకాల మరణం తర్వాత పగ్గాలు అందుకున్న ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ రోజుల వరకు తాను చెప్పిందే వేదం..చేసిందే శాసనం అనే రీతిలో ఏలుబడి సాగించారు.ప్రజల్లో తనకు గల అసాధారణమైన ఆకర్షణ కారణంగా ఎన్నికల్లో ఘన విజయం సాధించడం,తాను అనుకున్న రీతిలో పాలన సాగించడం ఇందిరకు పరిపాటిగా మారిపోయింది.అయితే అంతటి ఇందిరా గాంధీ కూడా ప్రతిపక్ష నాయకులను విశ్వాసంలోకి తీసుకుని వారికి సముచిత రీతిన గౌరవం ఇస్తూ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే సందర్భాల్లో వారితో సలహా సంప్రదింపులు 
జరుపుతుండే వారు..ఒకరకంగా ఎమర్జెన్సీ దేశానికి కొంత మేలు చేసింది.అదేమిటంటే ఎమర్జెన్సీ  చీకటి రోజుల తర్వాత దేశంలో ఏకపక్ష విజయాలకు.. ఏలుబడులకు తెరపడింది...అత్యవసర పరిస్థితుల అనంతరం దేశంలో తొలిసారిగా కాంగ్రేసేతర ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.అటు తర్వాత కూడా కాంగ్రెస్ ఆధిపత్యం తగ్గి ఇతర పక్షాలు,కూటములు అధికారంలోకి రావడం మొదలైంది.ఇక రాజకీయాల్లోకి ఎన్టీ రామారావు ఆగమనం..స్వరాష్ట్రంలో సంచలనాల తర్వాత జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశం అనంతరం కాంగ్రెస్ పరిస్థితి మరీ దిగజారింది.అప్పటినుంచి కేంద్రంలో ఏ పార్టీకైనా గాని ఇంచుమించు పరిపూర్ణ 
ఆధిక్యత రావడం..ఏకపక్షంగా ఏలుబడి సాగడం అనే రోజులు చెల్లిపోయాయి.ఇదిగో..మళ్లీ ఆ పరిణామాలు కేంద్రంలో  2014 ఎన్నికల నుండి మొదలయ్యాయి.
వరస రెండు ఎన్నికల్లో తిరుగులేని ఆధిపత్యంతో గెలిచిన భారతీయ జనతా పార్టీ దేశంలో మరోసారి ఏకపక్ష పాలనకు,ఒంటెత్తు పోకడలకు తెర ఎత్తింది.
      పెద్ద నోట్ల రద్దు, ప్రభుత్వ రంగ సంస్థల విక్రయం..
ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న కొన్ని వ్యవస్థల నిర్వీర్యం,అస్మదీయులకు అవాంచిత ఉపకారాలు...
రాష్ట్రాలకు కల్పించే ప్రయోజనాల విషయంలో అసమానతలు,
పారదర్శకత లోపం..
ఇలాంటి ఎన్నో కీలక అంశాల్లో  ఎన్డీఏ ప్రభుత్వం అవలంబిస్తున్న ఏకపక్ష ధోరణులపై ప్రశ్నించే గొంతులు కరవయ్యాయి..చట్టసభల్లో,
బయటా కూడా నిలదీసే విపక్షాల గొంతుకలను ప్రభుత్వంలోని పెద్దలు మెజారిటీ ఇచ్చిన బలంతో పట్టించుకునే పరిస్థితి గడచిన ఏడు సంవత్సరాల కాలంలో 
ఏ దశలోనూ కనిపించలేదు..
చేసిన తప్పుల వల్లనైతెనేమి..అధికారంలో ఉన్న రోజుల్లో అవలంబించిన ఇదే తరహా ఏకపక్ష ధోరణుల ఫలితం అయితేనేమి కాంగ్రెస్ పూర్తిగా చచ్చుబడిపోయింది.
ఇక కమ్యూనిస్టుల సంగతి సరేసరి..ఎప్పుడూ వారి పోరాటాలు సరాసరే..పార్టీల కేడర్లు,శ్రేణులు బలంగానే ఉన్నా ఏ దశలోనూ చట్టసభల్లో తగినంత బలం లేకపోవడంతో వామపక్షాలది స్వతంత్ర భారతంలో ఆది నుంచి 
అరణ్యరోదనే..ప్రభుత్వాలను నిలదీసే వారి గొంతు సమ్మెలు, బందులు ..ఇత్యాదులకే పరిమితం అయిపోయింది. నరేంద్ర మోడీ సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కమ్యూనిస్టులు..ఇతర రెగ్యులర్ ప్రతిపక్షాలతో సహా మొన్నటి వరకు దేశంలోనే మహాశక్తిగా విరాజిల్లిన కాంగ్రెస్ పరిస్థితి కూడా నానాటికీ తీసికట్టు అయిపోయింది..
      ఇక ఆంధ్రప్రదేశ్ సంగతి..ఇక్కడ ఏం జరిగినా అడిగే నాథుడు లేని పరిస్థితి దాపురించింది.ఈ రాష్ట్రంలో గతంలో  అయితే కాంగ్రెస్,లేదంటే తెలుగుదేశం ప్రభుత్వాలు పెద్ద శక్తులుగా అసెంబ్లీలో ఆవిర్భవించి అధికారం చెలాయించిన సందర్భాల్లో ప్రతిపక్షాల పరిస్థితి ఇప్పుడున్నట్టు లేదు.ఒకనాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు వెంగళరావు,చెన్నారెడ్డి..వైఎస్ రాజశేఖర రెడ్డి వంటి వారు ఎదురులేని సంఖ్యాబలంతో అధికారం చేసినా ప్రతిపక్షాలకు  తగిన గౌరవం  ఉండేది.అదే పరిస్థితి ఎన్టీ రామారావు..
నారా చంద్రబాబు నాయుడు హయాంలో కూడా సాగింది.. ప్రతిపక్షానికి దక్కే గౌరవాన్ని మొన్నటి వరకు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి కూడా అనుభవించిన వారే. 
     ఇక వర్తమానానికి వస్తే..2019 ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 సీట్లకు గాను 151 సీట్లు గెలుచుకుని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార పగ్గాలు అందుకున్న నాటి నుంచి పూర్తిగా అధికారపక్షం పెత్తనం లో ఏలుబడి సాగుతోంది. నంది అంటే నంది...తీరులో..ఏ నిర్ణయం అయినా..అది ఎలాంటిదైనా మారుమాటాడే పరిస్థితి లేదు..వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే గత తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిన ఎన్నో పథకాలను రద్దు చేసి..కొన్ని కట్టడాలను కూల్చి వేసి గందరగోళం సృష్టించింది. పరాకాష్టగా మూడు రాజధానుల నిర్ణయం..ఆపై ఉచితాలు..ఇంచుమించు రాష్ట్రప్రభుత్వం దివాలా తీసే పరిస్థితి..వీటిపై ప్రధాన  ప్రతిపక్షం తెలుగుదేశం ప్రశ్నిస్తూ..నిలదీస్తూ..ఆందోళనలు చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నా సంఖ్యాబలం లేకపోవడం సైకిల్ పార్టీకి అతి పెద్ద మైనస్ పాయింట్!ఒక దశలో కేవలం ప్రతిపక్షం మీద దుగ్ధతో ప్రభుత్వం అకారణంగా కౌన్సిల్ ను కాన్సిల్ చేయాలని చూసినా అడిగే దిక్కు లేకుండా పోయింది.అఫ్కోర్స్..అది జరగలేదు..ప్రభుత్వం ఏం చేస్తున్నా రాష్ట్రంలో ప్రతిపక్షం అడ్డుకునే పరిస్థితి ఎటూ లేకపోయినా కేంద్రం కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కానరావడం లేదు..దీంతో వైసిపి ప్రభుత్వం ఎదురే లేని రీతిలో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్న పరిస్థితి..కోర్టు కేసులను సైతం లెక్క చేయని విధంగా కొన్ని నిర్ణయాలు జరుగుతున్నాయి.
2019 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ మెజారిటీతో
గెలిచిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అటు తర్వాత జరిగిన పంచాయతి..మునిసిపల్ ఎన్నికల్లో కూడా అదే ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా ఆవిర్భవించింది..అదే రీతిలో ప్రశ్నించే నాథుడే ఉండని స్థాయిలో ఏలుబడి సాగిస్తోంది.
దాని వల్ల రాష్ట్రం ఎటు పోతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది..అసలు ఇంచుమించు రెండు సంవత్సరాలకు పైగా రాష్ట్ర రాజధాని ఏదో తెలియని అయోమయ పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు.రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టులు రాకపోగా ఉన్నవి చేజారిపోతున్న దుస్థితి.అలాగే కేంద్రం నుంచి  పోలవరం వంటి పెద్ద ప్రాజెక్టులకు నిధులు తీసుకువచ్చే పరిస్థితి లేదు.అంతేకాకుండా  రాష్ట్రానికి గుండెకాయ వంటి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేస్తున్నా అటు పార్లమెంటులో కూడా మంచి బలం ఉన్న వైసిపి అడ్డుకోలేకపోవడం విచారించదగ్గ మరో విషయం.ఇలాంటి అంశాల్లో రాష్ట్రంలోని అన్ని పార్టీలు కలిసి పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంటుంది.కానీ ఆ పరిస్థితి  కనిపించడం లేదు.అసలు ప్రతిపక్షాన్ని కలుపుకుపోయే ధోరణి అధికార పక్షానికి కిమ్మన్నాస్తి..ఇక పోతే పంపిణీల పేరిట ఖజానా ఖాళీ అవుతూ జీతాలు కూడా సరిగ్గా ఇచ్చుకోలేని..పెన్షన్లు సకాలంలో చెల్లించలేని దుస్థితి ఏర్పడి ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టే దారుణ చర్యకు సర్కారు తెగబడినా అడిగే నాథుడు లేడు..ఇది గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని దయనీయ పరిస్థితి..
        ఇలా కేంద్రంలో,రాష్ట్రంలో అధికార పార్టీలు పూర్తి మెజారిటీతో ఏకపక్ష ధోరణిలో పాలన సాగిస్తుంటే ప్రజాస్వామ్యం ఉనికి ప్రమాదంలో పడుతోందా అనే సందేహాలు సర్వత్రా వ్యక్తం అవుతున్న పరిస్దితుల్లో కొన్ని రకాలైన ప్రమాదాల అంచున 
మన దేశంలో వ్యవస్థలు నడుస్తున్నాయనేది నిస్సందేహం..!!