సీమంతైనా మేలుచేసేరా? గర్జన ఎవరికోసం? ఏమి ప్రయోజనం?
సీమంతైనా మేలు చేశారా?
రాయలసీమలో రూ.34 వేల కోట్లతో 23 ప్రాజెక్టులకు ఆర్భాటంగా శ్రీకారం
మూడేళ్లలో ఖర్చు పెట్టింది 1,650 కోట్లే
అందులో వెయ్యి కోట్ల బిల్లులు పెండింగ్
కర్నూలులో పెట్టాల్సిన కృష్ణా బోర్డు విశాఖకు తరలింపు
అభివృద్ధి వదిలేసి ‘గర్జన’ అంటూ వైకాపా రాజకీయం
సాగునీటి ప్రాజెక్టులపై చిత్తశుద్ధి ఉందంటూ సభల్లో ఊదరగొట్టిన ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి.. సీమలో కరవు శాశ్వత నివారణకు చేపట్టిన ప్రాజెక్టులకు నిధులివ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. రాయలసీమ జిల్లాలకు వరంలాంటి ప్రాజెక్టులపై శీతకన్నేశారు. నిధులు లేకున్నా ఆర్భాటంగా 23 ప్రాజెక్టులు ఒకేసారి మొదలుపెట్టి, ఆదిలోనే కాడిపడేశారు. ఫలితంగా సాగు నీటికి రైతులు ధర్నాలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. వ్యవసాయ పనుల్లేక రైతు కూలీలు వలస బాట పట్టాల్సి వస్తోంది. సాగునీటి ప్రాజెక్టుల సమస్యలన్నీ గాలికొదిలేసి ఇప్పుడు కర్నూలులో లక్ష మందితో ‘రాయలసీమ గర్జన’కు పిలుపునిచ్చి వైకాపా రాజకీయం చేస్తుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రాజెక్టులకు ముఖద్వారమైన కర్నూలులో కృష్ణా బోర్డు కార్యాలయం ఏర్పాటు చేయాలన్న ఆకాంక్షను పక్కనపెట్టి విశాఖకు తరలించడమేంటని మేధావులు ప్రశ్నిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రాయలసీమ దుర్భిక్ష నివారణ మిషన్ (ఆర్‌డీఎంపీ) పేరుతో ఒకేసారి 23 ప్రాజెక్టులు చేపట్టింది. నిధుల్లేకుండా ఏకంగా రూ.33,862 కోట్ల పనులకు టెండర్లు పిలిచి ఆర్భాటంగా శంకుస్థాపనలు చేశారు. ఈ పథకం కింద ఉమ్మడి కర్నూలు జిల్లాలో 6, కడప జిల్లాలో 10, అనంతపురంలో 2, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో 5 ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. హంద్రీనీవా, గాలేరు-నగరి, తెలుగుగంగ కాల్వలకు లైనింగ్‌తోపాటు పలు ఎత్తిపోతల పథకాలు ప్రారంభించారు. మూడేళ్లలో జరిగింది సుమారు రూ.1,650 కోట్ల విలువైన పనులే. అందులోనూ రూ.వెయ్యి కోట్లపైగా బిల్లులు బకాయిలున్నాయి. ఆర్‌డీఎంపీ ప్రాజెక్టులకు నిధుల్లేక చివరకు 11 ప్రాజెక్టులను కేంద్రం ఇచ్చే పీఎంకేఎస్‌వై గ్రాంటు కోసం ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇందుకు రూ.16,568 కోట్లు అవసరమని కోరినా ఇంత వరకు రూపాయి రాలేదు. దీంతో ‘సీమ మిషన్’ అటకెక్కింది.
పడకేసిన రాయలసీమ ఎత్తిపోతల
పోతిరెడ్డిపాడు నుంచి 80 టీఎంసీల నీటిని తీసుకునే ఉద్దేశంతో చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం పడకేసింది. ఇప్పటి వరకు రూ.1300 కోట్ల పనులు జరిగాయి. వీటిలో రూ.200 కోట్ల బిల్లులు మాత్రమే చెల్లించినట్లు సమాచారం. ఎన్జీటీ, తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం తెలపడంతో పథకం మూలనపడింది.
సొంత ఇలాకాలోనూ..
కడప జిల్లాలో బ్రహ్మంసాగర్ ఎత్తిపోతల పథకం, కుందూ నదిపై నంద్యాల జిల్లాలో జొళదరాశి (కోవెలకుంట్ల), రాజోలి (చాగలమర్రి) జలాశయాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. రూ.2,600 కోట్లతో మూడు ప్రాజెక్టులకు 2019 డిసెంబరులో ఒకేసారి శంకుస్థాపన చేశారు. రాజోలి, జొళదరాశి పనులను రూ.1,758 కోట్లతో ఎంఆర్‌కేఆర్-రుత్విక్ జాయింట్ వెంచర్ (హైదరాబాద్) దక్కించుకుంది. ఈ రెండు జలాశయాల నిర్మాణానికి సుమారు 8 వేల ఎకరాల భూసేకరణ చేయాలి. ప్రభుత్వం ఎకరాకు రూ.11.50 లక్షల పరిహారం నిర్ణయించగా, రైతులు రూ.30 లక్షలు అడుగుతున్నారు. భూసేకరణ జాప్యంతో ఏడాదిన్నరగా ఈ రెండు ప్రాజెక్టులు నిలిచిపోయాయి. తద్వారా కుందూ నీటితో నింపాలని చేపట్టిన బ్రహ్మంసాగర్ ఎత్తిపోతలకు బ్రేక్ పడింది.
* ముఖ్యమంత్రి సొంత జిల్లా గండికోటకు నీళ్లు తీసుకెళ్లే అవుకు సొరంగం పనులకు రూ.45 కోట్ల బిల్లులు చెల్లించక నిలబెట్టేశారు. గాలేరు-నగరి ప్రాజెక్టు ప్యాకేజీ-30 కింద రెండు సొరంగాల పనులకు శ్రీకారం చుట్టారు. ఎడమ సొరంగం తెదేపా హయాంలో పూర్తయింది. వైకాపా వచ్చాక రూ.108 కోట్లతో చేపట్టిన 160 మీటర్ల ఫాల్ట్‌జోన్, 2.50 కి.మీ లైనింగ్ పనులు జాప్యమవుతున్నాయి. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయిన ఏడాది తర్వాత ప్రభుత్వం రూ.787 కోట్లకు పాలనామోదం తెలిపింది.
కర్నూలు పశ్చిమాన..
* కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో కరవు నివారణకు రాజోలిబండ మళ్లింపు పథకం (ఆర్డీఎస్), వేదవతి ప్రాజెక్టులకు తెదేపా శ్రీకారం చుట్టింది. ఎమ్మిగనూరు, మంత్రాలయం, కోడుమూరు నియోజకవర్గాల్లోని 45 వేల ఎకరాలకు సాగు లక్ష్యంగా రూ.1985.42 కోట్లతో పనులు ప్రారంభించారు. భూసేకరణ ఇబ్బందులతో ప్రాజెక్టు ముందుకు కదలడం లేదు.
* కేసీ కెనాల్ (ఎస్‌ఐఎంపీ) సింప్ పథకం కింద రూ.513 కోట్లతో ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు ఆమోదం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం 11 శాతం వాటాగా చెల్లించాలి. ఇందుకు ప్రభుత్వం కన్సెంట్ (సమ్మతి పత్రం) ఇంత వరకు ఇవ్వలేదు. ఫిబ్రవరిలోగా స్పందించపోతే ప్రాజెక్టు వెనక్కిపోయినట్లే.
* హంద్రీనీవా నీటితో 68 చెరువులు నింపేందుకు రూ.224 కోట్లతో తెదేపా హయాంలో శ్రీకారం చుట్టారు. అప్పట్లోనే 52 శాతం పనులు పూర్తయ్యాయి. ఈ మూడున్నరేళ్లలో ఆర్థిక మంత్రి బుగ్గన ఇలాకాలో వైకాపా ప్రభుత్వం కేవలం 24 శాతం పనులే చేసింది. హంద్రీనీవా పరిధిలో కాలువ వ్యవస్థ ఏర్పాటు, పందికోన జలాశయం సమస్యలు పరిష్కరించేందుకు రూ.150 కోట్లతో ప్రతిపాదనలు పంపామని జిల్లా మంత్రులు ఆర్భాటంగా ప్రకటించినా ఆ దస్త్ర్రానికి అతీగతీ లేదు. కాలువలు అందుబాటులోకి రాకపోవడంతో 60 వేల ఎకరాలకు నీరందడం ప్రశ్నార్థకమైంది.
* గుండ్రేవుల ప్రాజెక్టుకు సంబంధించి రూ.5,400 కోట్లతో డీపీఆర్ సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపినా, ఇంత వరకు ఆమోదం తెలపలేదు. ఉమ్మడి కర్నూలు, కడప జిల్లాల్లో కేసీ కెనాల్ కింద 2.65 లక్షల ఎకరాలకు రెండు పంటలకు నీళ్లివ్వడంతోపాటు అదనంగా 2 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించే వరంలాంటి ప్రాజెక్టును పక్కన పెట్టేశారు.
అనంతలో అడుగు పడలేదు
జీడిపల్లి- పేరూరు (ఎగువ పెన్నా)కు 2020 డిసెంబరులో శంకుస్థాపన చేశారు. మూడు రిజర్వాయర్లు నిర్మించాలని నిర్ణయించిన ఈ ప్రాజెక్టు శిలాఫలకాలకే పరిమితమైంది. తెదేపా హయాంలో హెచ్చెల్సీ 60 శాతం పూర్తయింది. వైకాపా ప్రభుత్వం వచ్చాక రూ.300 కోట్లతో కొత్త ప్రతిపాదనలు పెట్టి చేతులెత్తేశారు. 2021లో రాయదుర్గం పర్యటనలో ఆంజనేయస్వామి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణానికి సీఎం ఇచ్చిన హామీ అమలయ్యేలా అడుగులు పడలేదు. హంద్రీనీవా 33, 34, 36 ప్యాకేజీలు చివరిదశలో ఉన్నప్పటికీ నిధుల్లేక నిలిచిపోయాయి. మడకశిర బ్రాంచి కెనాల్ తెదేపా హయాంలో 80 శాతం పూర్తవగా.. వైకాపా వచ్చాక బైపాస్ కెనాల్‌కు రూ.240 కోట్లతో ప్రతిపాదనలు చేసి అటకెక్కించారు.
నాడు దీక్షలు చేశారు.. ఇప్పుడు మాట్లాడరే?
తెదేపా హయాంలో అప్పటి ప్రతిపక్ష ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వేదవతి ప్రాజెక్టు ప్రారంభించాలని గూళ్యంలో ఒకరోజు జలదీక్ష చేపట్టారు. ఆదోని, ఆలూరు పరిధిలో 80 వేల ఎకరాల ఆయకట్టు లక్ష్యంగా రూ.1942.80 కోట్లతో చేపట్టిన వేదవతి ప్రాజెక్టు ప్రస్తుతం భూసేకరణలో జాప్యం, గుత్తేదారుకు సుమారు రూ.100 కోట్ల బిల్లుల బకాయిలతో నిలిచిపోయింది. నాడు జలదీక్ష చేసిన జయరాం నేడు మంత్రిగా ఉన్నా ప్రాజెక్టుకు నిధులు సాధించి ముందుకు నడిపించలేకపోతున్నారని రైతులు విమర్శిస్తున్నారు.
(ఈనాడు దినపత్రిక సౌజన్యం )