home page

అసైన్డ్ భూములు అమ్ముకోవచ్చు

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం  

పరిశీలనకు కమిటీ  ఏర్పాటు  

 | 
assianed lands

పదకొండు మంది ఎమ్మెల్యేల కమిటీ  

  • 13మంది ప్రజాప్రతినిధులతో కమిటీ ఏర్పాటు
  • జీఓను గోప్యంగా ఉంచిన ప్రభుత్వం
  • ఈనెల 21న సచివాలయంలో కమిటీ భేటీ
  • అమరావతి బ్యూరో  : అసైన్డ్‌ భూముల క్రమబద్దీకరణకు ప్రభుత్వం గ్రీన్‌ సిగల్‌ ఇచ్చింది.
  • భూములు లేని నిరుపేదలు, ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీలకు ప్రభుత్వం ఎపి అసైన్డ్‌ ల్యాండ్స్‌ (పిఓటి) యాక్ట్‌-1977 కింద ప్రభుత్వ భూములను పంపిణీ చేశారు. 1954నుంచి 1977 వరకు , 77 తర్వాత ఇటువంటి భూములో పాటు చుక్కల భూములకు సంబందించిన సమస్యలు తలెత్తిన వాటిని కూడా పరిష్కారానికి ప్రభుత్వం మార్గం సుగమం చేయనుంది. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం లక్షలాదిమంది పేద, సన్నకారు రైతులకు ఎంతో లాభించనుండగా ఇదే సందర్భంలో అసైన్డ్‌ ల్యాండ్‌ గతంలో కొనుగోలు చేసిన వారు కూడా భారీగా లబ్ధి పొందే అవకాశాలు కూడా లేక పోలేదు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అసైన్డ్‌భూములు సాగుచేసుకుంటున్న పేదలు వారి కుటుంబ అవసరాలు, ఇతరత్రా వైద్య సౌకర్యాలు, పిల్లల వివాహాల కోసం ఆయా భూములను అమ్ముకునే వీలు కలుగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా విజయనగరం, వైఎస్‌ఆర్‌ కడప, తిరుపతి, చిత్తూరు, డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాల కలెక్టర్లనుంచి పెద్ద ఎత్తున వినతులు ప్రభుత్వానికి అందాయి. ఈనేపథ్యలో వినతులను పరిశీలించిన ప్రభుత్వం క్రమబద్దీకరణను మానిటరింగ్‌ చేసి, ఆయా సర్వే నెంబర్లు దరకాస్తుదారుని పేరుతో ఉన్నాయా? ప్రస్తుతం ఆయా భూములు ఎవరి ఆధీనంలో ఉన్నాయి? తదితర అంశాలను మానిటరింగ్‌ చేసేందుకు ప్రభుత్వం 13మంది ప్రజాప్రతినిధులతో కమిటీని నియమించింది. ఇందుకు సంబందించిన జీఓ గత నెల30న జీఓ ఆర్‌టి నెంబరు 822ని విడుదల చేసినప్పటికీ జీఓ బయటకు పొక్కకుండా ప్రభుత్వం గోప్యత పాటించింది. గోప్యత వెనుక బలమైన రాజకీయ కారణాలు ఉండవచ్చని పలువురు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం నియమించిన కమిటీలో మంత్రులు, ఎమ్మెల్యేలు సభ్యులుగా నియమించారు. వీరిలో కంభాల జోగులు (రాజాం), తానేటి వనిత (కొవ్వూరు), కైలే అనిల్‌కుమార్‌ (పామర్రు),మూరుగ నాగార్జున (వేమూరు), మేకతోటి సుచరిత (ప్రత్తిపాడు), ఆదిమూలపు సురేష్‌ (యర్రగొండపాలెం), టిజెఆర్‌ సుధాకర్‌ బాబు (సంతనూతలపాడు), కోరుముట్ల శ్రీనివాసులు (రైల్వే కోడూరు), జన్నలగడ్డ పద్మావతి (శింగనమల) కోనేటి ఆదిమూలం (సత్యవేడు), రాజన్న దొర పీడిక (సాలూరు), కొట్టగుల్లి భాగ్యలక్ష్మీ (పాడేరు), తెల్లం బాలరాజు (పోలవరం) కమిటీ సభ్యులుగా నియమించారు. రాష్ట్ర వ్యాప్తంగా అసైన్డ్‌ ల్యాండ్స్‌ కోసం వచ్చిన దరకాస్తులను పరిశీలించి ఏయే భూములను క్రమబద్దీకరించవచ్చనే అంశంపై నిర్ణయం తీసుకుంటారు. ఇందుకోసం విడుదల చేసిన జీఓలో సూచించిన విధంగా నెల రోజుల్లో కమిటీ కార్యకలాపాలను ప్రారంభించాల్సి ఉంది. ఇందుకోసం మొదటి సమావేశం ఈనెల 21న సచివాలయంలో డిప్యూటీ సిఎం, రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అధ్యక్షతన కమిటీ భేటీ జరుగనుంది.
    భూమి లేని నిరుపేదలకు స్వాతంత్య్రం వచ్చినప్పటినుంచి ఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నా భూములు పంచడం ఆనవాయితీగా జరుగుతుండేది. దశాబ్ధాలుగా సాగుచేసుకుంటున్న సన్నకారు, చిన్న కారు రైతులు కేవలం ఆయా భూములు సాగుచేసుకోవడం మినహా ఆయా భూములు అమ్ముకునేందుకు వీలు కలిగేది కాదు. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం పేదలకు ఎంతో కొంత ఉపశమనాన్ని కలిగిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.
    విశాఖలో భూములు ఆక్రమణలు, దసపల్లా భూములు, ప్రభుత్వ భూములు, అసైన్డ్‌భూములను పెద్దలు ఆక్రమించుకున్నారని, నిబంధనలను తమకు అనుకూలంగా మలుచుకుని పెద్ద ఎత్తున లబ్ది పొందారనే ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. ఇందుకు సంబందించిన కథనాలు పత్రికల్లో పతాకశీర్షికల్లో వస్తుండటం, హైకోర్టుల్లో కేసులు నడుస్తుండటం, రాజకీయంగా అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి మధ్య భూ ఆక్రమణలపై ఆరోపణలు, ప్రత్యారారోపణలు తారా స్ధాయికి చేరిన నేపథ్యంలో అసైన్డ్‌ ల్యాండ్స్‌ క్రమబద్దీకరణకు సంబంధించిన జీఓ ఆలస్యంగా వెలుగులోకి రావడం రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపింది.