home page

50 ఏళ్లు వెనక్కి వెళ్ళిన రాష్ట్రం

ఎంపి రఘు రామరాజు 

 | 
Raghu

రాష్ట్రాన్ని 50 ఏళ్లు వెనక్కి తీసుకు వెళ్లిన ఘనుడు  జగన్

 నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు

 రాష్ట్రాన్ని 50 ఏళ్లు వెనక్కి తీసుకువెళ్లిన మహానుభావుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని నర్సాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు మండిపడ్డారు. రాష్ట్రాన్ని అప్పుల్లో, గంజాయి సరఫరాలో, అమ్మాయిలపై అత్యాచారాలలో, రైతుల ఆత్మహత్యలలో  నెంబర్ వన్ గా నిలిపిన ఘనుడు కూడా  జగనే అంటూ ఎద్దేవా చేశారు. శుక్రవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా  రఘురామ కృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.... రాష్ట్రాన్ని జగన్ 50  ఏళ్లు వెనక్కి తీసుకెళ్లినట్లు కడప జిల్లా, పులివెందుల నియోజకవర్గానికి చెందిన  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి కన్ఫామ్ చేశారన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులకు  జీతాలు ఎందుకు చెల్లించడం లేదని న్యాయస్థానం సి ఎస్  ను ప్రశ్నించిందన్నారు. దానికి సమాధానంగా ఆయన తన తండ్రి కూడా ఉపాధ్యాయుడే నని, ఆయనకు కూడా తన చిన్నతనంలో మూడు నెలల పాటు జీతాలు చెల్లించలేదని చెప్పుకొచ్చారన్నారు. జవహర్ రెడ్డి చిన్నతనం అంటే దాదాపు 50 ఏళ్ల క్రితం అని  రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు. న్యాయస్థానం సాక్షిగా రాష్ట్రాన్ని జగన్ 50 ఏళ్ల వెనక్కి తీసుకు వెళ్లినట్టు జవహర్ రెడ్డి ఎండార్స్ చేశారన్నారు. ఇక విద్యాశాఖ మంత్రి సత్తిబాబు  సైతం జీతాలు చెల్లించక పోవడాన్ని సమర్థించుకోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తండ్రికి  గతంలో జీతాలు చెల్లించలేదని, ఇప్పుడు ఇతరుల తండ్రులకు జీతాలు చెల్లించమని అంటే ఎలా అని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు.

 ఉత్తరాంధ్రలో పసుపు ప్రభంజనం

 ఉత్తరాంధ్రలో పసుపు ప్రభంజనం కొనసాగుతుందని రఘురామ కృష్ణంరాజు అన్నారు. రాజాం వంటి చిన్న పట్టణంలో  చంద్రబాబు నాయుడు నిర్వహించిన రోడ్ షోకు అశేష జనవాహిని  హాజరయ్యారని తెలిపారు. ఉత్తరాంధ్రలో మరో రెండు రోజులు ఈ పసుపు తుఫాను కొనసాగనుందన్నారు. విశాఖలో రోడ్ షో నిర్వహిస్తే, జన సునామి వెల్లువెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే ఈసారి చంద్రబాబు నాయుడు పర్యటనలో విశాఖ లేదని తెలిపారు. తమ పార్టీ పాలెగాళ్ల చేతుల్లో ఆస్తులు పోగొట్టుకున్న వారు, వారితో వేధించబడిన వారి సంఖ్య అధికమని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కడప పర్యటన సందర్భంగా నిర్వహించే సభకు డ్వాక్రా మహిళలు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారని తెలిసిందన్నారు. సభకు హాజరు కాకపోతే 500 రూపాయల జరిమానా తో పాటు, ప్రభుత్వం అందజేయనున్న ఆసరా వంటి పథకాలను నిలిపివేస్తామని హెచ్చరించారని తెలిపారు. సభకు హాజరయ్యే వారికి బిర్యాని ప్యాకెట్ తో పాటు, ప్రోత్సాహకాలు అందజేస్తామనిపేర్కొనడం జరిగిందన్నారు. తమ పార్టీ పరిస్థితి ఇలా ఉంటే, పసుపు పార్టీ ప్రభంజనం కొనసాగుతోందన్నారు. జగన్మోహన్ రెడ్డి సభలకు హాజరైన జనాలు గోడలు, కందకాలను దూకి పారిపోతున్నారని తెలిపారు. జనం రాకపోతే తిరగడం మానివేయాలని, అంతేకానీ జరిమానాలు వేస్తామంటే ప్రజలు సహించరని హెచ్చరించారు. గడపగడపకు కార్యక్రమంలో  ఉండవల్లి ఎమ్మెల్యే శ్రీదేవి పై దాడి చేసినంత పని  చేశారని గుర్తు చేశారు. 

 జన్మదిన వేడుకలు జగనన్నకు ఇష్టం లేదట...!

 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి జన్మదిన వేడుకలు ఆర్భాటంగా జరుపుకోవడం ఇష్టం లేదని ఆయన తల్లి విజయమ్మ పేర్కొనడం  హాస్యాస్పదంగా ఉందని రఘురామకృష్ణం రాజు అన్నారు. జగన్ 50వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని రెండున్నర కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ,  పత్రికల్లో  అడ్వర్టైజ్మెంట్ లు ఇచ్చారన్నారు. ఇక మంత్రులంతా ఆయన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని రికార్డింగ్ డాన్స్ లు చేశారని ఎద్దేవా చేశారు. దాదాపు 40 నుంచి 50 కోట్ల మేర  సాక్షి దినపత్రిక ద్వారా అడ్వర్టైజ్మెంట్ రూపంలో ఆదాయాన్ని సమకూర్చుకున్నారని రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు. బాబుకు జన్మ దినోత్సవ వేడుకల నిర్వాహణకు  ఒప్పుకోకుండానే, ఆయనకు తెలియకుండానే పత్రికల్లో అడ్వర్టైజ్మెంట్ లు ఇచ్చారా అంటూ ప్రశ్నించారు.  ప్రభుత్వ కార్పొరేషన్ల ద్వారా కూడా  పత్రికల్లో అడ్వర్టైజ్మెంట్ లు ఇవ్వడం  విడ్డూరంగా ఉందన్నారు. ఇక  మద్యం  100 అవుట్లెట్లకు అనుమతి ఇచ్చిన రోజే... మధ్య నిషేధం కోసం జగనన్న కృషి అంటూ  పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారని అపహాస్యం చేశారు. విద్యార్థులకు అందజేసిన ట్యాబులను ఓపెన్ చేయగానే చిక్కటి చిరునవ్వు చిందించే జగన్మోహన్ రెడ్డి ఫోటో... నవరత్నాల అడ్వర్టైజ్మెంట్  వస్తుందన్నారు. పబ్లిసిటీ అంటే ఇంట్రెస్ట్ లేని జగన్ కు,  ఈ పబ్లిసిటీ పిచ్చి ఏమిటో అర్థం కావడం లేదని విస్మయం వ్యక్తం చేశారు. చివరకు విద్యార్థులకు అందజేసే కోడిగుడ్లపై కూడా జగన్ ఫోటోలను ముద్రించడం  ఎబ్బెట్టుగా ఉందన్నారు.

 221 కోట్ల అవినీతి చేయలేదట... ఆదా చేశారట

 జగన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు అందజేస్తున్న  ట్యాబ్ ల కొనుగోళ్లలో  221 కోట్ల రూపాయల అవినీతి చేయలేదని, ఆదా చేశామని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పేర్కొనడం  హాస్యాస్పదంగా  ఉందని రఘురామకృష్ణం రాజు  అన్నారు. బైజూస్  సంస్థ ఉచితంగా అందజేసిన కంటెంట్ కు లెక్కలు కట్టి ఆ డబ్బులను ఆదా చేశామనడం విడ్డూరంగా ఉందన్నారు. బైజు సంస్థ పై ఎన్సిపిఆర్ ఇప్పటికే  కేసులు నమోదు చేసిందన్నారు. విద్యార్థులకు సొంత ఫ్రీ కంటెంట్ అని చెప్పి ఆ తరువాత బెదిరించి వారిని కొనుగోలు చేయాలని ఇబ్బందులు పెడుతున్నట్లుగా ఎన్సీపీఆర్ కు ఫిర్యాదులు అందాయని తెలిపారు. దివాలా తీసిన బైజూస్ సంస్థ షేర్ వాల్యూ ను పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆ సంస్థతో ఒప్పందాన్ని కుదుర్చుకుందని రఘురామకృష్ణం రాజు అన్నారు.

 అమరావతి రైతులను సర్వనాశనం చేసిన ఘనుడు జగన్

 అమరావతి రైతులను సర్వనాశనం చేసిన ఘనుడిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వినతి కెక్కారని  రఘురామకృష్ణం రాజు  అన్నారు. మాజీ ప్రధానమంత్రి చౌదరి చరణ్ సింగ్ జయంతి,  జాతీయ రైతు దినోత్సవాన్ని రాష్ట్ర రైతులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. వ్యవసాయంలోనే సాయం ఉందని, అగ్రికల్చర్ లో కల్చర్ ఉందని  పేర్కొన్నారు. అన్యాయాలు,  దారుణాలు... రైతుల ఆత్మహత్యలు రాష్ట్రం నెంబర్ వన్ గా ఉందని పార్లమెంటులో చెప్పారన్నారు.

 ప్రజల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూడవద్దు

 ప్రజల వ్యక్తిగత జీవితాలలోకి  వాలంటీర్లు తొంగి చూసే ప్రయత్నం చేయవద్దని రఘురామకృష్ణం రాజు అన్నారు. సి ఆర్ పి సి   149 ప్రకారం క్రైమ్ జరిగే అవకాశాలు ఉన్న వాటిపై పోలీసులు  ఇన్వెస్టిగేషన్ చేసి తెలుసుకోవచ్చునని అన్నారు. దేశ రాష్ట్ర భద్రత కోసం ఈ తరహా ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అయితే ప్రజల వ్యక్తిగత జీవితానికి ఇబ్బంది కలిగేలా  ప్రభుత్వం వ్యవహరిస్తుందని మండిపడ్డారు. సెక్సువల్ రిలేటెడ్  నేరాలను తగ్గించేందుకు కొంత సమాచారం ఉంటే తగ్గించవచ్చునున్న పోలీసులకు సూచనలతో, వాలంటీర్లు రంగంలోకి దిగారన్నారు. ప్రజలను వాలంటీర్లు అడుగుతున్న ప్రశ్నలు చాలా జూగుస్సాకరంగా ఉంటున్నా యని అన్నారు. ప్రజల వ్యక్తిగత జీవితాలలోకి, పడకగది సమాచారాన్ని తెలుసుకునే విధంగా వాలంటీర్ల ప్రశ్నలు ఉండడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపి, ముఖ్యమంత్రి, షాడో ముఖ్యమంత్రులు పౌరుల వ్యక్తిగత జీవితం గురించి వారిని ప్రశ్నించి మనోక్లేషానికి గురి చేయవద్దని కోరారు.

 ఇతరుల ఇళ్లపై నిఘా అంటే...  నా ఇంటి గేటు ముందు కాపు కాస్తారా?

 ఇతరుల ఇళ్ల వద్ద నిఘా అంటే నా ఇంటి గేటు ముందు పోలీసులు కాపు కాస్తారా అని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. ఈ ఏడాది  ఫిబ్రవరి 26వ తేదీన హైదరాబాదులోని తన  ఎమ్మార్ నివాసం  వద్ద  ఏఎస్ఐ  రామకృష్ణారెడ్డి  కాపుకాశారని తెలిపారు. ఈ విషయాన్ని తనను కలిసేందుకు వచ్చిన ఒక వ్యక్తి తెలియజేశారన్నారు. తన గేటు ముందు కాపు కాసిన ఏఎస్ఐ ఫోటోలను తీసి అతను పంపారని  వివరించారు. మరుసటి రోజు తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు. అలాగే తన సెక్యూరిటీ సిబ్బంది సిఆర్పిఎఫ్ పోలీసులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. అయినా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. ఈనెల 22వ తేదీన తనకు ప్రివిలేజ్ కమిటీ నుంచి ఒక లేఖ అందిందని తెలిపారు. కొడాలి వెంకటేశ్వరరావు అలియాస్ నాని ఇంటిముందు తెలుగు యువత కార్యకర్తలు  ఆందోళనకు దిగడంతో వారి సెక్యూరిటీ పై నిఘా కోసమే పోలీసులు కాపు కాశారని  పేర్కొనడం జరిగిందన్నారు. కొడాలి నాని ఇల్లు మణికొండ లో ఉండగా, తన నివాసం ఎమ్మార్ ప్రాపర్టీస్ లో ఉందని తెలిపారు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, కాసు మహేష్ ల భద్రత కోసమే సెక్యూరిటీని ఏర్పాటు చేసినట్లు పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎందుకంటే ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, కాసు మహేష్ ల నివాసాలు కూడా తన ఇంటికి దూరంగా ఉన్నాయన్నారు. ప్రధానమంత్రి తెలంగాణ పర్యటన సందర్భంగా కూడా తన ఇంటి ముందు ఇలాగే కాపుకాశారని తెలిపారు. బేగంపేట్ లో ప్రధానమంత్రి విమానాన్ని ఎక్కుతుంటే, గచ్చిబౌలిలోని తన ఇంటి వద్ద కాపు కాయడం ఏమిటో అర్థం కావడం లేదన్నారు. ఇలాంటి కట్టు కథలు  చెప్పడానికి మూడు నెలల సమయం తీసుకున్నారని విమర్శించారు.