ఆమ్ ఆద్మీది మామూలు విజయం కాదు

ఢిల్లీ అసెంబ్లీ ఫలితాల్లో బిగ్ షాకింగ్..ఆమ్ ఆద్మీది మామూలు విజయం కాదు..ఓట్ల శాతం లెక్కలివే..!] దేశమంతా ఉత్కంఠ భరితంగా ఎదురుచూసిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. మోదీ-షా చాణక్యనీతిని బలంగా ఢీకొడుతూ.. అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) వరుసగా మూడోసారి అధికారంలో వచ్చేసింది. ఆప్ గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ కూడా అంచనావేసినప్పటికీ… మంగళవారం వెల్లడైన ఫలితాల్లో ఆ పార్టీ సాధించిన ఓట్ల శాతం.. ఎన్నికల పండితుల్ని సైతం షాక్ ‌కు గురిచేశాయి. మొత్తం 70 స్థానాలకుగానూ 58 చోట్ల విజయాన్ని ఖాయం చేసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఏకంగా దాదాపు 54 శాతం ఓట్లు సాధించడం గమనార్హం.  ఆమ్ ఆద్మీ పార్టీతో హోరాహోరీగా తలపడ్డ బీజేపీ కేవలం 12 సీట్లకే పరిమితమైనప్పటికీ ఓట్ల పరంగా చెప్పుకోదగ్గ సంఖ్య సాధించింది. ఢిల్లీలోని 70 స్థానాల్లో కలిపి బీజేపీకి దాదాపు 40 శాతం ఓట్లు దక్కాయి. లోక్ సభ ఎన్నికలతో పోల్చుకుంటే ఇది తక్కువే అయినప్పటికీ.. అసెంబ్లీ ఎన్నికల పరంగా చూస్తే బీజేపీ భారీగా లాభ పడినట్టే లెక్క . మొత్తం    94 శాతం ఓట్ల రెండు పార్టీలకేపడ్డాయి. ఢిల్లీ  అసెంబ్లీ ఎన్నికల్లో డజనుకుపైగా పార్టీలు పోటీ చేసినప్పటికీ.. యుద్ధం ప్రధానంగా ఆప్, బీజేపీల మధ్యే జరిగినట్లు పోలైన ఓట్ల లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఢిల్లీలో పోలైన ఓట్లలో ఆ రెండు పార్టీలకే దాదాపు 94 శాతం ఓట్లు పడ్డాయి. అంటే మిగతా పార్టీల పాత్ర దాదాపు ఆటలో అరటిపండులా అయింది.
కేజ్రీ కమాల్.. కమలం డీలా.. ఏడు నెలల కిందట జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఢిల్లీలోని అన్ని స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. అప్పుడా పార్టీ రికార్డు స్థాయిలో 56.58శాతం ఓట్లు సాధించింది. అదే ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేని ఆప్ కేవలం 18 శాతం ఓట్లతో సరిపెట్టుకుంది. మంగళవారం వెల్లడైన అసెంబ్లీ ఫలితాల్లో కేజ్రీవాల్ కమాల్ చేస్తూ 54 శాతం ఓట్లు సాధించగా… బీజేపీ 40 శాతం ఓట్లకే పరిమితమైపోయింది.