2019వ సంవత్సరం ఏపీ రాజకీయాల్లో చాలా కీలకం: పవన్ కల్యాణ్

అందరూ ఓట్లు నమోదు చేసుకోవాలి
ఓట్లు తీసేస్తే తిరిగి చేర్చే వరకు పోరాటం చేయాలి
మహిళల భద్రతే జనసేన పార్టీ ప్రధాన అజెండా
2019వ సంవత్సరం ఏపీ రాజకీయాల్లో చాలా కీలకమని, అందరూ ఓట్లు నమోదు చేసుకోవాలని, ఓట్లు తీసేస్తే తిరిగి చేర్చే వరకు పోరాటం చేయాలని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సూచించారు. పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం సమీపంలోని నిర్మలాదేవి ఫంక్షన్ హాల్ లో డీఎన్ ఆర్ కళాశాల విద్యార్థులు, భీమవరం, ఉంగుటూరు, ఉండి నియోజకవర్గాల జనసైనికులతో పవన్ విడివిడిగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సామాజిక, రాజకీయ వ్యవస్థను మార్చకపోతే గూండాలు, ఫ్యాక్షనిస్టులు రాజ్యమేలుతారని, ఏమీ ఆశించకుండా స్వార్థం లేని వ్యక్తులే రాజకీయాల్లో ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా మహిళల భద్రత గురించి ఆయన ప్రస్తావించారు. అర్ధరాత్రి ఆడపిల్లలు రోడ్డుపై తిరిగిన రోజే నిజమైన స్వాతంత్ర్యం అని మహాత్ముడు చెప్పారు కానీ, ప్రస్తుతం పగలు కూడా ఆడపిల్లలు రోడ్డుపై తిరిగలేని పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. మహిళల భద్రతే జనసేన పార్టీ ప్రధాన అజెండా అని పేర్కొన్నారు.

సినిమాల్లో చెప్పిన నీతులు ఒక్క క్షణం ఆలోచింపజేస్తాయి తప్ప వాస్తవరూపం దాల్చవని, ఆ నీతులు వాస్తవరూపం దాల్చాలంటే ఏం చేయాలని ఆలోచించే రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. తుపాకీతో కాల్చేసినోళ్లు, దోపిడీలు చేసేవాళ్లు చట్టం నుంచి తప్పించుకుని మన మీద పెత్తనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రోకర్ పని చేసేవాడు కోట్లు సంపాదిస్తుంటే, పీజీలు, హీహెచ్ డీలు చేసిన విద్యావంతులు వాడికింద పనిచేస్తున్నారని, ఇలాంటి వ్యవస్థ మారాలని అని పవన్ ఆకాంక్షించారు.