15 నెలల్లో కమల్ నాథ్అంతా తలకిందులు

15 నెలల్లో అంతా తలకిందులు.. కమల్ vs కమల్‌లో కాంగ్రెస్ కోల్పోయిందేంటి?

”మేరా క్యా కసూర్ థా?.. అసలు నేను చేసిన తప్పేంటి?” అంటూ గుండెలు బాదుకున్నారు 73 ఏళ్ల కమల్ నాథ్. స్వతంత్ర భారత చరిత్రతో దాదాపు సమానమైన వయసు ఆయనది. శుక్రవారం బలపరీక్షకు కొద్ది గంటల ముందు ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన ఆయన తన మనసులో ఉన్నదంతా మీడియా ముందు కక్కేశారు. బీజేపీ 15 ఏళ్ల పాలనతో తన 15 నెలల పనిని పోల్చుతూ అనేక సోదాహరణలిచ్చారు. కమల్ రాజీనామాను ప్రజావిజయంగా నయా కమలనాథుడు, మాజీ కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా పోల్చారు. ఇద్దరిలో ఎవరు చెప్పింది నిజం? అసలు మధ్యప్రదేశ్ లో ఎవరిది విజయం? కళ్లుండీ కానలేని కాంగ్రెస్.. వయసురీత్యా వృధ్ధ పార్టీనే అయినప్పటికీ.. రాజకీయ చతురలో తనదైన శైలిని ఫాలో అయ్యే జాతీయ కాంగ్రెస్ పార్టీకి.. 2014 నాటి మోడీ హవా తర్వాత మనుగడ సంకటంగా మారింది. లోక్ సభలో ప్రతిపక్ష హోదా కూడా గల్లంతైపోవడంతోపాటు ఒక్కో రాష్ట్రంలో వరుసగా ఓటమిపాలవుతూ వచ్చింది. కొన్ని చోట్ల మెజార్టీ ఎమ్మెల్యేలు గెలిచినా.. పొత్తుల విషయంలో సమయానుకూల నిర్ణయాలు తీసుకోలేక చతికిలపడింది. సీట్లు గెలవడం తప్ప సర్కారు నిలుపుకునే ఎత్తుగడల్ని అమలు చేయడంలో క్రమంగా ఫెయిలవుతూ వచ్చింది. అయితే మధ్యప్రదేశ్ విషయంలో మాత్రం ఆ పార్టీ కళ్లుండీ గుంతలో పడిపోయినట్లయింది.. మొదటి రోజు నుంచే.. ఇక కాంగ్రెస్ ఖేల్ ఖతం అనుకున్న దశలో 2018 చివర్లో అనూహ్యంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో దక్కిన విజయం ఆ పార్టీకి కొత్త ఊపిరులూదినట్లయింది. ఛత్తీస్ లో క్లీన్ మెజార్టీ, రాజస్థాన్ లో ఒక మోస్తారు బలంతో గద్దెనెక్కిన హస్తం పార్టీ.. మధ్యప్రదేశ్ లో మాత్రం మ్యాజిక్ ఫిగర్ కు ఒక సీటు దూరంలో నిలిచింది. నలుగురు ఇండిపెండెంట్, ఇద్దరు బీఎస్పీ, ఒక ఎస్పీ ఎమ్మెల్యే మద్దతుతో కమల్ నాథ్ సీఎం అయ్యారు. దాంతో, సీఎం సీటుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న జ్యోతిరాదిత్య సింధియా డంగైపోయారు. తన ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి రోజు నుంచే దాన్ని కూల్చేయడానికి కమలనాథులు ప్రయత్నాలు ఆరంభించారని, సింధియా ద్వారానే ఆపరేషన్ కమల్ అమలుచేశారని కమల్ నాథ్ వాపోయారు. ఆ పుస్తకంలో కీలక అధ్యాయం.. మరి, ‘‘15 నెలలుగా సర్కారు కూల్చివేతకు ప్రయత్నాలు జరుగుతుంటే మీరెందుకు చూస్తూ ఊరుకున్నారు?” అన్న విలేకరుల ప్రశ్నకు కమల్ నాథ్ అదోరకం సమాధానాలిచ్చారు. ‘‘కొండ మహ్మద్ వద్దకు రానప్పుడు.. మహ్మదే కొండ వద్దకు వెళ్లాలి”అనే సూఫీ సామెతను ఉల్లేఖిస్తూ.. ‘‘రాజమహళ్లలో కాంగ్రెస్ పార్టీ ఉండదని.. కాంగ్రెస్ వద్దకే రాజమహళ్లు వస్తాయి”అని పరోక్షంగా జ్యోతిరాదిత్యపై కమల్ నాథ్ మండిపడ్డారు. మధ్యప్రదేశ్ ఎపిసోడ్ ద్వారా బీజేపీ ‘‘ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం ఎలా?”అనే పుస్తకంలో మరో కీలక అధ్యాయాన్ని రాసిందని ఎద్దేవా చేశారు. అయితే తనను ముంచిన 22 మంది రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాల్ని స్పీకర్ ఆమోదించిన తర్వాత మాత్రమే కమల్ గద్దెదిగడం గమనార్హం. కాగా దీనిపై బీజేపీ వెర్షన్ మరోలా ఉంది.. కమలానికి బుదర అంటకుండా.. ఒక రొట్టే కోసం రెండు కోతులు కొట్లాడుకుంటుంటే.. మధ్యలో పిల్లి వచ్చి పంచాయితీ తీర్చిన కథ గుర్తుందికదా.. సరిగ్గా ఆ కథలోని నీతి మాటల్నే రిపీట్ చేశారు ‘మామాజీ’ శివరాజ్ సింగ్ చౌహాన్. ‘‘వాళ్లలో వాళ్లు కొట్టుకుని, ప్రభుత్వాన్ని కూలగొట్టుకున్నారు. కమల్ నాథ్ గద్దెదిగడంలో కమలనాథుల పాత్ర లేనేలేదు. అనవసరంగా మా పార్టీపై బురదజల్లొద్దు”అని స్పష్టంచేశారాయన. గతంలో గోవా, మణిపూర్ లో ఇతర పార్టీలకు మెజార్టీ ఉన్నా తామే అధికారాన్ని క్లెయిమ్ చేసుకోవడం.. ఇటీవల కర్నాటకలో ప్రత్యర్థి ప్రభుత్వాలు కూలగొట్టడం లాంటి పరిణామాలు బీజేపీలో మారిన విలువలకు సంకేతాలుగా నిలిచాయి.

Leave a Reply