దేవాలయాల్లోకి ప్రవేశాలపై ఇటీవల జరుగుతున్న వివాదాలు, ప్రతివాదాలు సమస్యను జటిలం చేస్తున్నాయి. భారతదేశం సర్వమత సామరస్య ం కలిగిన దేశంగా ముద్రపడినా, ప్రధానంగా ఇటీవల హిందూ దేవాలయాల్లోకి మహిళలు ప్రవేశించడంపైనా, తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలోకి అన్యమతస్తులు ప్రవేశంపైనా వివాదాలు చెలరేగతున్నాయి.
మహారాష్ట్రలోని శనిసింగనాపూర్ లోని పవిత్రదేవాలయంలోకి మహిళలను అనుమతించాలని కోరుతూ దేశాయ్ చేసిన పోరాటానికి ముంబై హైకోర్టు తీర్పుతో తెరపడింది. భూమాతా బ్రిగేడ్ పేరుతో తృప్తి దేశాయ్ సుదీర్ఘకాలం కోర్టులలో చేసిన పోరాటాలు ఫలించాయి. అందుకు ఫలితమే శని సింగనాపూర్ దేవాలయం ట్రస్ట్ బోర్డు 400 సంవత్సరాలనుంచి అమలులో ఉన్న సంప్రదాయాన్ని కాదని మహిళలకు ఆలయ ప్రవేశం కల్పించింది. ఇటీవల కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయంలోకి కొంత వయస్సు దాటిన మహిళలకే ప్రవేశం కల్పించాలన్న విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు సైతం వివాదాస్పదమైంది. తిరుమలలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలోకి అన్య మతస్తులు ముఖ్యంగా క్రీస్టియన్ల ప్రవేశాలు నిరంతరం వివాదాస్పదం అవుతున్నాయి. హిందూ దేవాలయ ప్రవేశాలే ఎందుకు తరచు వివాదాస్పదం అవుతున్నాయన్న విషయంపై కూడా అనేక విమర్శలు తలెత్తుతున్నాయి.