home page

పరిశ్రమలకు కేరాఫ్ అడ్రస్ కె.వి.రంగారెడ్డి జిల్లా

రంగారెడ్డి జిల్లా చుట్టూ పరిశ్రమల వెల్లువ

 | 
ఇండస్ట్రీ

పెరుగుతున్న పెట్టుబడులు

  • జిల్లాలో పుష్కలంగా ఐటీ, ఏరోస్పేస్‌, హార్డ్‌వేర్‌ కంపెనీలు
  • రూ.53వేల కోట్ల పెట్టుబడులతో 101 మెగా ఇన్‌ఫ్రా ప్రాజెక్టులు
  • ఇప్పటికే పూర్తయిన 53 ప్రాజెక్టులతో 4 లక్షలకుపైగా ఉద్యోగావకాశాలు
  • ఐటీ రంగ విస్తరణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు

 రంగారెడ్డి జిల్లా పరిశ్రమలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది.

రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక రంగంలో తీసుకొచ్చిన మార్పులతో జిల్లాకు భారీగా పెట్టుబడులొచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఐటీ రంగ విస్తరణకూ సర్కారు చర్యలు చేపట్టింది. హైదరాబాద్‌కు ఆనుకొని ఉన్న రంగారెడ్డి జిల్లాలోని శివారు ప్రాంతాల్లో ఐటీ సంస్థలకు సంబంధించి ఇప్పటికే పదుల సంఖ్యలో మెగా ఇన్‌ఫ్రా ప్రాజెక్టులు ప్రారంభమవగా, జిల్లా పరిధిలో మరిన్ని ఐటీ టవర్స్‌ను త్వరితగతిన పూర్తిచేసే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తున్నది. నిజానికి పారిశ్రామికాభివృద్ధికి అధిక ప్రాధాన్యతనివ్వడంతోపాటు పరిశ్రమల స్థాపనకు సులువుగా అనుమతులిచ్చేలా టీఎస్‌ ఐ-పాస్‌ విధానాన్ని సీఎం కేసీఆర్‌ ఎప్పుడో అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఇది జిల్లాకు పెద్ద ఎత్తున కలిసొస్తున్నది. ఐటీ సంస్థలతోపాటు ఏరోస్పేస్‌, హార్డ్‌వేర్‌ తదితర పరిశ్రమలూ వస్తున్నాయి.

101 ప్రాజెక్టులు.. రూ.52,863 కోట్ల పెట్టుబడులు
రంగారెడ్డి జిల్లాలో ఐటీ రంగం వేగంగా విస్తరిస్తున్నది. 101 మెగా ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల కోసం టీఎస్‌-ఐపాస్‌ ద్వారా ఆయా సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి. ఈ ప్రాజెక్టుల పెట్టుబడుల విలువ రూ.52,862.89 కోట్లు. పూర్తయితే 8,83,431 ఉద్యోగాలు వస్తాయని అంచనా. ఇప్పటివరకు 53 ప్రాజెక్టుల్లో ఉత్పత్తి మొదలవగా, రూ.29,752.79 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 4,04,065 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలూ లభించాయి. శేరిలింగంపల్లి, సరూర్‌నగర్‌, రాజేంద్రనగర్‌ మండలాల్లో మెజారిటీ కంపెనీలు కొలువుదీరుతున్నాయి.

సూక్ష్మ, చిన్న, మధ్య, భారీతరహా పరిశ్రమల ఏర్పాటుతో రంగారెడ్డి జిల్లాకు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు
గత ఏడేండ్లలో రూ.870 కోట్ల పెట్టుబడులతో వచ్చిన 2,277 సూక్ష్మతరహా పరిశ్రమలు
1,168 చిన్నతరహా పరిశ్రమలతో రూ.2,988 కోట్ల పెట్టుబడులు
63 మధ్యతరహా పరిశ్రమలతో రూ.1,239 కోట్ల పెట్టుబడులు
105 భారీ పరిశ్రమలతో వచ్చిన రూ.4,267 కోట్ల పెట్టుబడులు

'జిల్లాలో ఐటీ రంగం మరింత విస్తరించనున్నది. మెగా ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున ప్రోత్సాహం లభిస్తున్నది. ఈ ప్రాజెక్టులతో రానున్న రెండేండ్లలో సుమారు 9 లక్షల మందికి ఉపాధి లభించనున్నది. కాటేదాన్‌ పారిశ్రామికవాడలోనూ ప్రభుత్వ పాలసీ ప్రకారం ఐటీ టవర్స్‌ అందుబాటులోకి రానున్నాయి'
-రాజేశ్వర్‌ రెడ్డి, రంగారెడ్డి జిల్లా పరిశ్రమల శాఖ అధికారి ,కలిసొస్తున్న కేటీఆర్‌ అమెరికా టూర్‌

రాష్ట్రంలోకి పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ నేతృత్వంలోని బృందం అమెరికాలో చేసిన పర్యటన కలిసొస్తున్నది. ఇప్పటికే పలు అగ్రరాజ్య సంస్థలు భారీ పెట్టుబడులతో తెలంగాణకు వస్తున్న విషయం తెలిసిందే. వీటిలో కొన్ని కంపెనీలు రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటయ్యే అవకాశాలున్నట్టు అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఔటర్‌ రింగ్‌ రోడ్‌ పరిధిలో వైట్‌, గ్రీన్‌ కేటగిరీ పరిశ్రమలే ఉండాలనే నిబంధనల్ని ప్రభుత్వం తీసుకొచ్చిన దృష్ట్యా.. ఆరెంజ్‌, రెడ్‌ కేటగిరీలో ఉన్న పరిశ్రమలను ఇతర ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక స్టీల్‌, ఐరన్‌ ఓర్‌ పరిశ్రమలను జహీరాబాద్‌, వికారాబాద్‌కు తరలించేందుకు ఇప్పటికే నిర్ణయించిన నేపథ్యంలో కాటేదాన్‌లోని 245 ఎకరాల్లో కమర్షియల్‌, రెసిడెన్షియల్‌కుపోను మిగతా 100 ఎకరాల్లో ఐటీ టవర్స్‌ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించారు.