హ్యాపీ వెడ్డింగ్‌ రివ్యూ

చిత్రం: హ్యాపీ వెడ్డింగ్‌ ‌
నటీనటులు: సుమంత్‌ అశ్విన్‌, నిహారిక కొణిదెల, మురళీ శర్మ, నరేష్‌, పవిత్ర లోకేష్‌, తులసి, ఇంద్రజ, అన్నపూర్ణ తదితరులు
సంగీతం: శక్తికాంత్‌ కార్తీక్‌
నేపథ్య సంగీతం: తమన్‌
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, శ్రీమణి
ఛాయాగ్రహణం: బాల్‌రెడ్డి
ఎడిటింగ్‌: కె.వి. కృష్ణారెడ్డి
నిర్మాత: ఎం. సుమంత్‌ రాజు
రచన-దర్శకత్వం: లక్ష్మణ్‌
సంస్థ: పాకెట్‌ సినిమా, యూవీ క్రియేషన్స్‌
విడుదల తేదీ: 28-07-2018

తనకు సరిపోయే కథలను మాత్రమే ఎంచుకుంటూ కెరీర్‌లో ముందుకు వెళ్తున్న యువ కథానాయకుడు సుమంత్‌ అశ్విన్‌. ఇక మెగా కుటుంబ నుంచి బుల్లితెరపైకి వచ్చి, ఆ తర్వాత వెబ్‌ సిరీస్‌లతో తన సత్తా చాటుతోంది నిహారిక కొణెదల. ‘ఒక మనసు’తో కథానాయికగా ఎంట్రీ ఇచ్చి తనదైన నటనతో మెప్పించారు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి లక్ష్మణ్‌ దర్శకత్వంలో నటించిన చిత్రం ‘హ్యాపీ వెడ్డింగ్‌’. పెళ్లి తాలుకూ సంతోషాలకు అద్దం పట్టే కథతో శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చిందీ చిత్రం. పెళ్లి అనగానే అమ్మాయిలు ఎలా ఆలోచిస్తారు? ఏయే విషయాల గురించి భయపడతారు? వాటిని దర్శకుడు ఎలా చూపించాడు? పెళ్లి జంటగా నటించిన సుమంత్‌ అశ్విన్‌, నిహారిక ఏ మేరకు ఆకట్టుకున్నారు?

కథేంటంటే: ఆనంద్‌(సుమంత్‌ అశ్విన్‌), అక్షర(నిహారిక) వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకుందామని అనుకుంటారు. పెళ్లి ఇంకొన్ని రోజుల్లో ఉందనగా, అక్షరలో లేనిపోని కన్‌ఫ్యూజన్లు మొదలవుతాయి. పెళ్లయిన తర్వాత తన స్వేచ్ఛ, ఇష్టాయిష్టాలకు దూరంగా ఉండాలేమోనన్న భయం ఆమెలో ఆవరిస్తుంది. తన పట్ల ఆనంద్‌ చిన్నపాటి అలసత్వం చూపించినా భరించలేకపోతుంది. ఈలోగా, తన మాజీ బాయ్‌ ఫ్రెండ్‌ మల్లి.. అక్షర జీవితంలోకి వస్తాడు. ఇన్ని తికమకల మధ్య అక్షర ఎలాంటి నిర్ణయం తీసుకుంది? అక్షరను ఆనంద్‌ ఎలా తన దారిలోకి తీసుకొచ్చాడు అనేదే ‘హ్యాపీ వెడ్డింగ్‌’ కథ.

ఎలా ఉందంటే: పెళ్లి అనగానే చాలా మంది అమ్మాయిల్లో ఉండే కన్‌ఫ్యూజన్లు, భయాలు, వాటి వల్ల ఎదురయ్యే పరిణామాలు ఎలా ఉంటాయన్నదే సినిమా ఇతివృత్తం. చాలా సున్నితమైన అంశానికి కుటుంబ బంధాలు, ఒక పండగలాంటి వాతావరణం జోడించి తెరపై అందంగా భావోద్వేగంగా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. సాధారణంగా ప్రతి అమ్మాయిలో ఉండే గందరగోళాన్ని కథానాయిక పాత్రకు ఆపాదించి దాని చుట్టూనే కథను నడిపించడం వల్ల సన్నివేశాలన్నీ సహజంగా అనిపిస్తాయి. అక్షర పాత్రలో ఉన్న గందరగోళాన్ని తెరపై బాగా తీసుకురాగలిగాడు దర్శకుడు. ఆ పాత్రలో చాలా మంది అమ్మాయిలు తమను తాము చూసుకునే అవకాశం దక్కింది. అటు అక్షర కుటుంబలోనూ ఇటు ఆనంద్‌ కుటుంబంలోనూ అన్ని పాజిటివ్‌ పాత్రలే కనిపించడంతో కథ, కథనాలన్నీ సాఫీగా సాగిపోతుంటాయి. ఎటొచ్చీ అక్షర పాత్ర, ఆమె ప్రవర్తించే విధానమే, సాఫీగా సాగే ప్రయాణాన్ని కుదుపుల్లోకి నెట్టేస్తుంది. చాలా సన్నివేశాలు సహజంగా ఉన్నప్పటికీ కొన్ని చోట్ల మాత్రం దర్శకుడు మరింత స్వేచ్ఛను తీసుకున్నాడు. చిన్న చిన్న కారణాలకే అక్షర.. ఆనంద్‌ను దూరం పెట్టడం చూస్తే, థియేటర్‌లో కూర్చొన్న ప్రేక్షకుడికి ఆశ్చర్యం వేస్తుంది.

పతాక సన్నివేశాలకు ముందొచ్చే ఘట్టాలు సినిమా కథలోని ఆత్మకు అద్దం పట్టాయి. దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడో, అక్కడ పూర్తిగా చెప్పగలిగాడు. అటు అబ్బాయిలకు, ఇటు అమ్మాయిలకు ఆ పాయింట్‌ కనెక్ట్‌ అవుతుంది. అలా దర్శకుడి లక్ష్యం నెరవేరినట్లు అయింది. మధ్య మధ్యలో సీరియల్‌ తరహాలో సాగే సన్నివేశాలు, షార్ట్‌ ఫిల్మ్‌లా అనిపించే సందర్భాలు కొన్ని కనిపించినా, కాస్త ఓపికగా కూర్చుంటే ఓ ఫీల్‌ గుడ్‌ మూవీని ఎంజాయ్‌ చేసి రావచ్చు.

ఎవరెలా చేశారంటే: సుమంత్‌ అశ్విన్‌, నిహారిక జంట బాగుంది. ఈ కథకు పక్కాగా సరిపోయారు. జోష్‌గా ఉండాలన్న సుమంత్‌ తపన తెరపై కనిపించింది. అయితే, ప్రతి సన్నివేశానికి ఒకే తరహా బాడీ లాంగ్వేజ్‌ పండించాడు. పతాక సన్నివేశాల్లో అతని నటన నచ్చుతుంది. సినిమా అంతా తనవైపు తిప్పుకోగలిగింది నిహారిక. అక్షర పాత్రలో ఉన్న కన్‌ఫ్యూజన్‌ను చక్కగా పలికించింది. ఒక్క ఫ్రేమ్‌లోనూ తడబడలేదు. ఈ తరహా పాత్రలకు కచ్చితంగా మంచి ఛాయిస్‌ అవుతుంది. నరేష్‌ మరోసారి తనదైన శైలిలో నవ్వించాడు. ఓ మంచి తండ్రిగా బాధ్యతాయుతమైన పాత్రలో కనిపించాడు. మురళీశర్మ నటన కూడా ఆకట్టుకుంటుంది. పవిత్రా లోకేష్‌, అన్నపూర్ణ, పూర్ణిమ ఇలా అందరూ అనుభవజ్ఞులే కాబట్టి, ప్రతి పాత్రకు న్యాయం జరిగింది.

పాటలన్నీ కథలో భాగంగా వచ్చేవే. ప్రత్యేకించి డ్యూయెట్‌లు లేకపోవడం ఉపశమనం కల్పించింది. ప్రతి పాటలోనూ కథను చెప్పే ప్రయత్నం చేశారు. తమన్‌ అందించిన నేపథ్య సంగీతం కూల్‌గా ఉంది. పెళ్లి వాతావరణాన్ని కెమెరాలో అందంగా బంధించారు. దర్శకుడు ప్రధాన బలం మాటలు. చాలా చోట్ల కవిత్వాన్ని రంగరించాడు. కొన్ని చోట్ల సంభాషణలు గుండెకు హత్తుకున్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.

బలాలు
+ నిహారిక నటన
+ మెలోడీలు
+ సంభాషణలు

బలహీనతలు
– సీరియల్‌ తరహాలో సాగిన కొన్ని సన్నివేశాలు
– 
కథంతా ఒకే పాయింట్‌ చుట్టూ తిరగడం
చివరిగా: ‘హ్యాపీ వెడ్డింగ్‌’ ఒక కన్‌ప్యూజన్‌ అమ్మాయి కథ