హైద్రాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనే 1 20 పైగా పోటీ

హైద్రాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనే 1 : 20 పైగా పోటీ

ముందస్తు ఎన్నికలు అసలు ఘట్టానికి చేరువయ్యాయి. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసినప్పటి నుంచి గురువారం నామినేషన్ ఉపసంహరణ రోజు వరకు రాష్ట్రంలో ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి సహా రాష్ట్రంలోని పార్టీలన్నీ అభ్యర్థులను ప్రకటించడంతో వారంతా ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నారు. మరోవైపు టికెట్ ఆశించి భంగపడిన వారు రెబెల్స్‌గా, స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్స్ దాఖలు చేశారు. దీంతో ఆయా పార్టీల అధిష్ఠానాలు వారిని బుజ్జగించే ప్రయత్నం చేశాయి.

ఇందులో మెజారిటీ స్థానాల్లోని తిరుగుబాటు అభ్యర్థులు చల్లబడ్డారు. కొంత మంది మాత్రం అలాగే ఉండిపోయారు. దీంతో వీరి ప్రభావం ఆయా పార్టీల విజయావకాశాలను దెబ్బతీసే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు, నామినేషన్ దాఖలు చేసే రోజు నుంచి గడువు పూర్తయ్యే వరకు దాదాపు రెండు వేల పైచిలుకు మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్దుల సంఖ్యను ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్ ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 119 నియోజక వర్గాల్లో 1831 మంది అభ్యర్ధులు బరిలో నిలిచినట్టు వెల్లడించారు. తెలంగాణలోని ఉమ్మడి జిల్లాల్లో నియోజక వర్గాల ప్రకారం బరిలో ఉన్న అభ్యర్దుల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి. ఈ నెల 19న నామినేషన్ల దాఖలు గడువు ముగిసే నాటికి 3,584 మంది నామినేషన్లను దాఖలు చేశారు. అందులో రాజకీయ పార్టీల నుండి 1203 మంది, స్వతంత్రులు 2,441 మంది ఉన్నారు. రాజకీయ పార్టీలు బుజ్జగింపుల తర్వాత రెబల్స్‌తోపాటు కొందరు స్వతంత్ర అభ్యర్దులు కూడా ఎన్నికల బరిలో నుండి తప్పుకున్నారు
1. హైదరాబాద్ జిల్లాలోని 15 నియోజక వర్గాల్లో 313 మంది
2. రంగారెడ్డి జిల్లాలోని 17 నియోజక వర్గాల్లో 345 మంది
3. ఖమ్మం జిల్లాలోని 10 నియోజక వర్గాల్లో 133మంది
4. కరీంనగర్ జిల్లాలోని 12 నియోజక వర్గాల్లో 160 మంది
5. నిజామాబాద్ జిల్లాలోని 9 నియోజక వర్గాల్లో 91 మంది
6. వరంగల్ జిల్లాలోని 12 నియోజక వర్గాల్లో 172 మంది
7. నల్లగొండ జిల్లాలోని 12 నియోజక వర్గాల్లో 211 మంది
8. మెదక్ జిల్లాలోని 11 నియోజక వర్గాల్లో 146 మంది
9. అదిలాబాద్ జిల్లాలోని 10 నియోజక వర్గాల్లో 123 మంది
10. మహబూబ్‌నగర్ జిల్లాలోని 11 నియోజక వర్గాల్లో 135 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
Tags: telangana, political, contestants list, trs party, tcongress