హరికృష్ణ వెళ్లాల్సిన కావలి కల్యాణ మండపంలో పరిస్థితి ఇది!

  • కావలిలోని బృందావన్ కల్యాణ మండపంలో వివాహం
  • ఆ వివాహానికే బయలుదేరిన హరికృష్ణ
  • హఠాన్మరణంతో పెళ్లింట విషాద ఛాయలు

నెల్లూరు జిల్లా కావలిలోని బృందావన్ కల్యాణ మండపం. ఈ మధ్యాహ్నం ఇక్కడో వివాహం జరగాల్సివుంది. హరికృష్ణ మిత్రుడు మోహన్, తన కుమారుడి వివాహాన్ని తలపెట్టి, పెళ్లికి వచ్చి వధూవరులను ఆశీర్వదించాలని హరికృష్ణను కలిసి ఇటీవల స్వయంగా ఆహ్వానించారు. తమ ప్రియ మిత్రుడు మోహన్ కుమారుడి పెళ్లికి తన కారును స్వయంగా నడుపుతూ బయలుదేరిన ఆయన, హైదరాబాద్ కు దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో రోడ్డు ప్రమాదానికి గురై హఠాన్మరణం చెందారు.

ఈ వార్తను విన్న మోహన్ కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపిస్తుండగా, పెళ్లి మండపంలో ఒక్కసారిగా విషాదం అలముకుంది. పెళ్లికి వచ్చి తన కుమారుడిని ఆశీర్వదిస్తాడని భావించి, ఆయనకు స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్న వేళ, ఈ వార్త తెలిసిందని మోహన్ బోరున విలపించారు. పెళ్లికి వస్తాడనుకున్న మిత్రుడు హరికృష్ణ ఇక లేడని, శాశ్వతంగా కనిపించడన్న వార్త తనను కలచి వేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.