హథీరాంజీ భూములపై కన్నేసిన రాజకీయ రాబందులు

హథీరాంజీ మఠం కస్టోడియన్ అర్జున్ దాస్ పై రాష్ట్ర ప్రభుత్వం ఆకస్మికంగా సస్పెన్షన్ వేటు వేయడమే కాకుండా జిల్లాలో దేవాదాయ శాఖ ఉన్నతాధికారి వుండగా చిన్న స్థాయి అధికారికి మఠం బాధ్యతలు అప్పగించడం పలు అనుమానాలకు తావిస్తోందని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి అన్నారు.

అనంత పద్మనాభస్వామి ఆలయ నేలమాళిగలకు దీటుగా హథీరాంజీ మఠంలో నేలమాళిగలు ఉన్నాయా అన్న అనుమానాల నేపథ్యంలో ఇది జరగడం గమనార్హమని ఆయన అన్నారు. హథీరాంజీ మఠం కస్టోడియన్ అర్జున్ దాస్ కు తక్షణమే పోలీస్ కస్టడీలో రక్షణ కల్పించాలని, రాష్ట్ర సరి హద్దులు దాటకుండా నిఘా పెట్టాలని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి హథీరాంజీ మఠానికి సంబంధించిన స్థిర,  చరాస్తులతో పాటు నగలకు సంబంధించిన బ్యాంకు లాకర్ లను సీజ్ చేసి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వారు స్వాధీనం చేసుకోవాలని నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.

ఆలస్యం చేస్తే పుట్టపర్తి సాయిబాబా మరణం తర్వాత ఆ ట్రస్టు ఆస్తులు మాయమైనట్లు హథీరాంజీ మఠం స్థిర, చరాస్తులు మాయమవడం తథ్యమని ఆయన అన్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి శ్రీకృష్ణదేవరాయలు 7 సార్లు తిరుమలకు వచ్చినప్పుడు కానుకలుగా సమర్పించిన వజ్రవైఢూర్యాలు ఉన్నాయా? లేవా? అనే అనుమానం కలుగుతోందని ఆయన అన్నారు.

టీటీడీ ఏర్పడక ముందు శ్రీవారి ఆలయ నిర్వహణ మహంతుల ఆధీనంలో ఉన్న సమయంలో శ్రీవారికి వున్న వజ్ర కిరీటాలు,నగలు మొత్తం ఆ తర్వాత ఏర్పడిన టిటిడి స్వాధీనం చేసుకున్నారా? లేక మహంతులు మాయం చేశారా? అనే విషయాలలో కూడా నిగ్గు తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటి నగలు తమ వద్ద లేవని టీటీడీ స్పెషల్ ఆఫీసర్ ధర్మారెడ్డి ఇటీవల స్పష్టం చేశారని నవీన్ కుమార్ రెడ్డి అన్నారు.

అయితే తిరుమల శ్రీవారి ఆలయ ప్రాకారంలోని శాసనాలలో శ్రీ కృష్ణదేవ రాయలు స్వామివారికి నగలు ఇచ్చినట్లు  స్పష్టంగా ఉందని ఆయన అన్నారు. ఇదే విషయాన్ని  ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా తమ రికార్డులలో స్పష్టం చేసిందని నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. హథీరాంజీ మఠం బ్యాంకు లాకర్లను తెరిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆయన తెలిపారు.