సుహాసిని కోసం నేను ప్ర‌చారం చేయట్లేదు

సుహాసిని కోసం నేను ప్ర‌చారం చేయట్లేదు

తెలంగాణ ఎన్నిక‌ల‌లో అత్యంత ఆస‌క్తిని క‌లిగిస్తున్న నియోజ‌క‌వ‌ర్గాల్లో ఒక‌టి కూక‌ట్‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం. మునుపు ఎన్న‌డూ ఎవ‌రికి తెలియ‌ని వ్య‌క్తి అనూహ్యంగా ఎన్నిక‌ల బ‌రిలో దిగారు. నంద‌మూరి కుటుంబం నుంచి వ‌చ్చిన ఆ అభ్య‌ర్థి సుహాసిని. నంద‌మూరి హ‌రికృష్ణ కూతురు కావ‌డంతో స‌డెన్‌గా నియోజ‌క‌వ‌ర్గ రాజ‌కీయాలు కొత్త మ‌లుపు తిరిగాయి. ప్ర‌జాకూట‌మి పొత్తులో భాగంగా ఆ సీటును టీడీపీ తీసుకోవ‌డంతో ఇటీవ‌లే మ‌ర‌ణించిన టీడీపీ తొలి ర‌థ‌సార‌థి అయిన హ‌రికృష్ణ కూతురికి ఇచ్చారు.  ఆమె ప్ర‌చారం మొద‌లుపెట్టిన నాటి నుంచి అనేక ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌పై చ‌ర్చ సాగుతోంది.

ఆమెను ప్ర‌క‌టించిన వెంట‌నే ఆమెకు మ‌ద్ద‌తు సోద‌రులు ఎన్టీఆర్‌, క‌ళ్యాణ్‌రామ్ ఆమె విజ‌యం కోరుతూ ఉమ్మ‌డి ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఇపుడు తార‌క‌ర‌త్న ప్ర‌చారానికి కూడా వ‌చ్చారు. క‌ళ్యాణ్‌రామ్ కూడా రానున్నారు. అయితే, ఆమె మేన‌త్త పురంధేశ్వ‌రి ప్ర‌స్తుతం బీజేపీలో ఉన్నారు. అయితే, పార్టీ పరంగా ఆమె బీజేపీ అభ్య‌ర్థికి అదే నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌చారం చేశారు. మ‌హాకూట‌మిపై, టీఆర్ఎస్ పై విమ‌ర్శ‌లు చేశారు. కానీ కోడలిని ఏమీ అన‌లేదు. అయితే, అంత‌కుముందు ఓసారి త‌న కోడ‌లికి త‌న ఆశీర్వాదాలు ఎపుడూ ఉంటాయ‌ని ఓ ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్పారు. రాజ‌కీయాలు వేరు, కుటుంబం వేరు అన్నారు. తాజాగా సుహాసిని విష‌యంలో నారా చంద్ర‌బాబు భార్య భువ‌నేశ్వ‌రి కూడా స్పందించారు.

“నా కోడ‌లు సుహాసినికి శుభాకాంక్ష‌లు, ఆమె గెలుపుపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. అయితే, నేను ప్ర‌చారంలో పాల్గొన‌డం లేదు” అన్నారు. మొత్తానికి ఇద్ద‌రు అత్త‌లు కోడ‌లికి ఆశీర్వాదంతో స‌రిపెట్టారు. అనూహ్య‌మైన ప్ర‌క‌ట‌న కావ‌డంతో సోద‌రికి ప్ర‌చారం చేయాల‌ని ఉన్నా…ఎన్టీఆర్‌కు ముందే ఫిక్స‌యిన షెడ్యూల్ వ‌ల్ల ఇబ్బందిగా ఉందట. మ‌రి వ‌స్తారో రారో ఇంకా క్లారిటీ రాలేదు.