గెలవకుంటే.. రాజకీయ సన్యాసం పక్కా: కేటీఆర్ త్వరలో జరగనున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవకుంటే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని, ప్రజలకు మళ్లీ తన ముఖం చూపించనని టీఆర్ఎస్ నేత కేటీఆర్ స్పష్టం చేశారు. గురువారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన ‘మీట్‌ ది ప్రెస్’ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ పలు విషయాలను పంచుకున్నారు. టీఆర్ఎస్ గెలవబోతుందని పూర్తి ఆత్మవిశ్వాసంతో చెబుతున్నట్టు పేర్కొన్నారు. ప్రతీ సర్వేలోనూ టీఆర్ఎస్ గెలుపు ఖాయమనే తేలిందన్నారు. బీజేపీకి వందకుపైగా స్థానాల్లో డిపాజిట్ కూడా దక్కకుండా చేస్తామన్నారు. ఈ ఎన్నికలు నాలుగేళ్ల మూడు నెలల టీఆర్ఎస్ పాలనకు రిఫరెండమేనని కేటీఆర్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ గెలిస్తే కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారంటూ జరుగుతున్న ప్రచారంపైనా కేటీఆర్ స్పందించారు. ఆ వార్తల్లో వాస్తవం లేదన్నారు. తనకు మంత్రి పదవే ఎక్కువన్నారు. కేసీఆర్ మరో 15 ఏళ్లు సీఎంగా ఉంటారని చెప్పుకొచ్చారు. కేసీఆర్ కేబినెట్‌లో మహిళా మంత్రులు ఎందుకు లేరన్న ప్రశ్నకు కేటీఆర్ ఒకింత అసహనం ప్రదర్శించారు. కేబినెట్ కూర్పు అన్నాక బోల్డన్ని సమీకరణాలు ఉంటాయని, వాటి ప్రకారమే మంత్రివర్గం ఉంటుందని కేటీఆర్ పేర్కొన్నారు. అయితే, భవిష్యత్తులో మాత్రం తప్పకుండా తమ మంత్రివర్గంలో మహిళలు ఉంటారని పేర్కొన్నారు.

సుహాసిని ఎంపిక వెనక టీడీపీ భారీ వ్యూహం!

నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినిని కూకట్‌పల్లి నుంచి ఎన్నికల బరిలోకి దింపడం వెనక భారీ వ్యూహం దాగి ఉందని టీడీపీ నేతలు చెబుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. స్థానికంగా కూడా ఎన్టీఆర్ కుటుంబంపై సానుకూలత ఉంది. కాబట్టి ఈ ఎన్నికల్లో ఎన్టీఆర్ కుటుంబం నుంచి వ్యక్తిని బరిలోకి దింపడం వల్ల ఆ ప్రభావం మొత్తం మహాకూటమి అభ్యర్థులపై పడుతుందని చెబుతున్నారు. వారి గెలుపునకు కూడా దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

హరికృష్ణ మరణించినప్పుడు చంద్రబాబు రెండు రోజుల పాటు హైదరాబాద్‌లోనే ఉండి అన్నీ దగ్గరుండి చూసుకున్నారు. ఇప్పుడు సుహాసినిని బరిలోకి దింపడం వల్ల హరికృష్ణ కుటుంబానికి పార్టీ అండగా నిలిచిందని, ఆయన రాజకీయ వారసత్వాన్ని టీడీపీ కొనసాగిస్తోందన్న అభిప్రాయం ప్రజల్లోకి తీసుకెళ్లినట్టు అవుతుందని భావిస్తున్నారు. ఎన్టీఆర్ వారసురాలిగా కూకట్‌పల్లిలో ఆమె గెలుపు నల్లేరుమీద నడక కాగలదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, బీజేపీ నేత పురందేశ్వరి తప్ప ఎన్టీఆర్ కుటుంబం మొత్తం ఏకతాటిపై ఉందన్న సంకేతాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లినట్టు అవుతుందని భావిస్తున్నారు.