సుచీ లీక్స్‌: డిఎస్‌పి, తమన్‌ మాట్లాడరేం?

సింగర్‌ సుచిత్ర ఎక్కువగా పాటలు పాడింది దేవిశ్రీప్రసాద్‌, తమన్‌ సంగీత సారధ్యంలోనే. వేదిక ఎక్కిందంటే హుషారైన పాటలు పాడుతూ మెరికలా కదిలిపోయే సుచిత్ర దేవి, తమన్‌తో పాలు మార్లు స్టేజ్‌పై సందడి చేసింది. తమకి అంతగా పరిచయమున్న సింగర్‌ కెరియర్‌ ఇప్పుడు ప్రమాదంలో పడింది. ఆమెపై దాడి జరిగిందో, మానసికంగా కృంగిపోయిందో, అకౌంట్‌ హ్యాకే అయిందో లేక నిజంగా ప్రపంచం మీద విరక్తే వచ్చిందో, కారణం ఏమైనా కానీ సుచిత్ర ప్రస్తుతం ఇబ్బందుల్లో వుంది.

తనకిక్కడ అవకాశాలే కాదు అసలు ఇక్కడ వుండే అవకాశమే లేదని కూడా అంటున్నారు. ఈ విషయంలో సుచిత్రకి మద్దతుగా తనకి తెలిసిన గాయనీమణులు మాట్లాడుతున్నారు. గీతామాధురి అయితే సుచిత్రకి మనోస్థైర్యం ఎక్కువ అని, ఆమె చిన్నవాటికి కృంగిపోయి మనసు విరిచేసుకోదని, ఎక్కడో ఏదో జరిగి వుంటుందని, దానిని కనిపెట్టాల్సిన అవసరం వుందని వ్యాఖ్యానించింది. సుచిత్రని ఇంత ఓపెన్‌గా సమర్ధించిన వాళ్లు ఇండస్ట్రీలో చాలా తక్కువ. మరి తనకి అంత సన్నిహితులై వుండి, తనతో అన్ని పాటలు పాడించుకున్న తమన్‌, డిఎస్‌పి ఓపెన్‌గా తనకి సంఘీభావం ఎందుకు తెలపడం లేదు? ఇలాంటి టైమ్‌లో తన కెరియర్‌కి ఎలాంటి ప్రమాదం లేదనే భరోసా తనకి కావాలి కదా? మరి దానిని వీరిద్దరూ ఇస్తున్నారా? ఆమె వ్యవహారంతో సంబంధమున్న హీరోలతో వున్న సంబంధాలు చెడిపోతాయనే భయంతో సుచిత్రకి ఏం జరిగినా తమకెందుకు అనుకుంటున్నారా?