సీట్ల సర్దుబాటుపై క్లారిటీ వచ్చే ఛాన్స్

టీటీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ..పొత్తులు, సీట్ల సర్దుబాటుపై క్లారిటీ వచ్చే ఛాన్స్!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరికాసేపట్లో తెలంగాణ పార్టీ నేతలతో(టీటీడీపీ) భేటీ కానున్నారు. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ ను దీటుగా ఎదుర్కొనేందుకు వీలుగా మహాకూటమి ఏర్పాటైన నేపథ్యంలో టీడీపీ వ్యూహాలను చంద్రబాబు ఖరారు చేయనున్నారు. మహాకూటమిలో టీడీపీ పోటీ చేయనున్న స్థానాలు, పార్టీ తరఫున ఆశావహుల పేర్లను చంద్రబాబు ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణతో పాటు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, జిల్లాల అధ్యక్షులతో పాటు ఇతర ముఖ్య నేతలతో బాబు సమావేశం కానున్నారు.

మహాకూటమిలో సీట్ల ఖరారుపై ఇంకా స్పష్టత రాని సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్న హైదరాబాద్ కు చేరుకున్న చంద్రబాబు ఈ రోజు ఎన్టీఆర్ భవన్ లో టీటీడీపీ నేతలతో సమావేశం కానున్నారు. కాగా, ఈసారి ప్రచారానికి రావాల్సిందిగా చంద్రబాబుపై టీటీడీపీ నేతలు కోరుతున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో సీట్ల ఖరారు, పోటీ చేసే అభ్యర్థుల విషయమై కూడా స్పష్టత వచ్చే అవకాశముందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.