సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

వర్కౌట్స్ చేస్తూ ఒళ్లు తగ్గించే పనిలో పడింది అందాలతార అనుపమ పరమేశ్వరన్. ఇటీవలి కాలంలో ఈ ముద్దుగుమ్మ కాస్త బొద్దుగా తయారైందంటూ కామెంట్లు వినిపిస్తుండడంతో ప్రస్తుతం బరువు తగ్గడంపై ఆమె దృష్టి పెట్టింది. ‘నాకు ఇష్టమైన ఆహారం కనిపించిందంటే ఆగలేను, లాగించేస్తాను, దాంతోనే ఇబ్బంది వస్తోంది. అందుకే నోరు ఎలాగూ కట్టలేను కాబట్టి, ఇక ఇప్పుడు వర్కౌట్స్ చేస్తాను’ అని చెప్పింది అనుపమ.
* త్రిష, విజయ్ సేతుపతి జంటగా నటించిన ’96’ రొమాంటిక్ డ్రామా చిత్రాన్ని వచ్చే నెల 4న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేయడానికి నిర్ణయించారు. తెలుగులో ఈ చిత్రం ప్రదర్శన హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకున్నారు.
* ఎన్టీఆర్, చరణ్ హీరోలుగా రాజమౌళి రూపొందించే భారీ చిత్రంలో సమంత ఓ కథానాయికగా నటించనుందంటూ టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ వార్తలను సమంత తాజాగా ఖండించింది. ఈ చిత్రంలో తాను నటించడం లేదని, ఈ వార్తలలో ఏమాత్రం వాస్తవం లేదని పేర్కొంది.