సర్వ ప్రాణులకు న్యాయం

వాల్మీకి రామాయణం ఉత్తర కాండలో రామ రాజ్య వైభోగం విస్తారంగా ఉటుంది . యుగయుగాలకు రామరాజ్యమే ఆదర్శం . అలాంటి పాలన కావాలంటే దేవుడే దిగి రావాలి . అలా దేవుడే దిగి వచ్చిన పాలన అది .
రాముడి గుణాలను వర్ణించే ప్రతి సందర్భంలో వాల్మీకి సర్వ భూత హితే రతాః – అని ఒక మాట చెబుతుంటాడు . మనుషులతోపాటు అన్ని ప్రాణుల బాగు కోరుకునే రాముడు – అని అర్థం .
రాముడు అడవికి వెళుతున్నప్పుడు రాముడితో పాటు వెళ్ళడానికి తమ వేళ్ళు అడ్డు అని చెట్లు బాధపడి కొమ్మలను రాముడి వైపు తిప్పి విలపించాయట . ఇక ఆవులయితే దూడలకు పాలివ్వలేదట .

రామ రాజ్యం అంతా సుభిక్షం . ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా ఎవరైనా ఏదయినా సమస్య చెప్పుకోవడానికి రోజూ ఉదయం రాముడు కొంత సమయం కేటాయించేవాడు . అయితే ఆ సమయంలో రాముడు లక్ష్మణుడిని ఎవరయినా వచ్చారేమో చూడు అని అడగడం – తెరతీసి చూసి ఎవరూ లేరని చెప్పడం పరిపాటి అయిపోయింది . అంటే అన్నీ సవ్యంగా ఉన్నాయి కాబట్టి రాజుకు ఫిర్యాదు చేయాల్సిన అవసరమే ఎవరికీ రాలేదు .

ఒక రోజు ఉదయాన్నే తల మీద గాయంతో నెత్తురోడుతున్న కుక్క ఒకటి రాముడి న్యాయం కోసం వేచి చూస్తూ ఉండడంతో లక్ష్మణుడు ఆశ్చర్యపోతాడు . ఏమిటి నీ సమస్య రాముడు రమ్మంటున్నాడు లోపలికి రా – అంటాడు . యజ్ఞ యాగాలు జరిగేచోట , విప్రుల , రాజుల ఇళ్లలోకి నేను రాకూడదు – రాజునే బయటికి రమ్మను అంటుంది కుక్క .

మొత్తం మీద కుక్కను ధర్మ పరిషత్ లో ప్రవేశ పెట్టారు . తనను అకారణంగా ఒక భిక్షువు కొట్టాడు అన్నది కుక్క ఫిర్యాదు . ధర్మ విచారణలో యతులు , ఋషులు , భిక్షువుల మొదటి తప్పును క్షమించాలి అని తేలింది . రాముడు ఆ మాటే చెప్పి సభ ముగించబోయాడు . ఈ లోపు భిక్షువు అన్నాడు – నేను చేసిన తప్పుకు ఈ జన్మలోనే రాజ దండనతో విముక్తి కలుగుతుంది . మీరు తగిన శిక్ష వేయకపోతే రాజధర్మాన్ని పాటించని పాపంలో మీరుపడతారు – అది నాకు ఇష్టం లేదు అంటాడు . రాముడు కుక్కనే అడిగాడు – నీ అభిప్రాయం చెప్పు అని .
ఆ కుక్క ఒక శిక్ష లాంటి పదవి ఏదో ఇవ్వమంటుంది – అదంతా పెద్ద కథ . భిక్షువు , కుక్క న్యాయం జరిగిందని ఎవరిదారిన వాళ్లు వెళ్ళిపోతారు .

నదులు , చెట్లు , జంతువులకు కూడా రామ రాజ్యంలో న్యాయం జరిగింది . మనదిప్పుడు సమసమాజం . రామరాజ్యంతో పోల్చుకోగలమా ?
గెలిచేదంతా న్యాయమే అని చెప్పగలమా ?
ఇప్పుడు మనుషులతో పాటు సర్వప్రాణులను రక్షించడానికి ఏ రాముడు దిగి రావాలి ?

శుభోదయం
– పమిడికాల్వ