వైసీపీ బంద్ కు మద్దతు ఇవ్వం: రఘువీరారెడ్డి

బంద్ ల పేరిట ప్రజలను ఇబ్బంది పెట్టడం సరికాదు
బీజేపీ వ్యూహంలో వైసీసీ బందీగా మారింది
ఏపీకి ప్రత్యేక హోదా రాహుల్ ద్వారానే సాధ్యం
రాహుల్ గాంధీ ద్వారానే ప్రత్యేక హోదా అమలు సాధ్యమని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. వైసీపీ పిలుపునిచ్చిన రేపటి బంద్ కు తాము మద్దతు ఇవ్వడం లేదని ఆయన స్పష్టం చేశారు. బంద్ ల పేరిట ప్రజలను ఇబ్బంది పెట్టడం సరికాదని… బీజేపీ వ్యూహంలో వైసీపీ బందీగా మారిందని చెప్పారు. బంద్ ల పేరుతో వైసీపీ నాటకాలాడుతోందని విమర్శించారు. బీజేపీకి నాలుగేళ్ల పాటు మద్దతిచ్చిన టీడీపీ, పరోక్షంగా మద్దతు తెలిపిన వైసీపీలు ఏపీకి ప్రత్యేక హోదాను ఇప్పించలేకపోయాయని అన్నారు.

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ద్వారానే ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యమవుతుందని… 2018 మార్చి17,18వ తేదీల్లో జరిగిన ఏఐసీసీ 84వ ప్లీనరీలో ఏపికి ప్రత్యేక హోదాపై తీర్మానం చేయబడిందని, నిన్న జరిగిన సీడబ్ల్యూసీ మీటింగ్ లో తీర్మానం చేసి ఏపీకి మరోసారి భరోసా ఇచ్చిందని రఘువీరారెడ్డి తెలిపారు. లోక్ సభలో అవిశ్వాసం పైన జరిగిన చర్చలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని అంశాలు అన్నీ అమలు చేయాలని డిమాండ్ చేయడంతో పాటు కాంగ్రెస్ వీటి అమలుకు కట్టుబడి ఉందని స్పష్టం చేసినా… జగన్ విమర్శలు చేయడం చూస్తుంటే బీజేపీతో అతని బంధం ఎంత బలీయంగా ఉందో స్పష్టమవుతోందని అన్నారు