విజయ్ సినిమా ‘సర్కార్’కూ తప్పని లీకుల గోల..

  • విదేశీయుల పనిగా అనుమానం!
  • ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో వస్తున్న సర్కార్
  • హీరోహీరోయిన్లుగా విజయ్-కీర్తి సురేశ్
  • 21 సెకన్ల నిడివి గల పాట లీక్

ఇండస్ట్రీ ఏదైనా లీకులు కామనేనని మరోమారు అర్థం అయింది. తెలుగు చిత్రసీమలో ఇది ఒకింత ఎక్కువగా ఉండగా, ఇప్పుడు కోలీవుడ్‌నూ ఇది వేధిస్తోంది. తాజాగా, తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న ‘సర్కార్’ సినిమా పాటకు సంబంధించి 21 సెకన్ల నిడివి ఉన్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. అమెరికాలోని లాస్‌వేగాస్‌లో చిత్రీకరించిన ఈ పాటకు డ్యాన్స్ మాస్టర్ శోభి కొరియాగ్రఫీ అందించారు. ఇందులో విదేశీ డ్యాన్సర్లు కూడా చిందేశారు. దీంతో ఈ వీడియో లీక్‌పై వారి హస్తం ఉందేమోనని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోను వెనక నుంచి తీసినట్టు తెలుస్తోంది. తమిళ రాజకీయ నేత కళ కరుప్పయ్య ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విజయ్‌కు జోడీగా కీర్తి సురేశ్ నటిస్తోంది. సన్‌పిక్చర్స్‌ సంస్థ‌ నిర్మిస్తున్న ‘సర్కార్‌’కు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.