వాయిదాల మీద వాయిదాలు పడుతున్న ఇమ్రాన్ ప్రమాణ స్వీకారం…

తాజాగా ఈ నెల 18కి మారిన వైనం!
పలుమార్లు వాయిదా పడిన ఇమ్రాన్ ప్రమాణ స్వీకారం
భారత్ నుంచి గవాస్కర్, కపిల్, సిద్ధులకు ఆహ్వానం
1992 ప్రపంచ కప్ గెలుచుకున్నప్పటి పాక్ జట్టు సభ్యులు కూడా
పాక్ సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైన పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. తొలుత ఈ నెల 11 అని, ఆ తర్వాత 14న ప్రధానిగా ఇమ్రాన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారన్న వార్తలు వచ్చాయి. అయితే, ఇది కూడా తాజాగా వాయిదా పడింది. ఈ నెల 18న ఇమ్రాన్ ప్రమాణ స్వీకారం చేస్తారని పీటీఐ అధికార ప్రతినిధి పైసల్ జావేద్ ఖాన్ వెల్లడించారు. ఇమ్రాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారత క్రికెట్ దిగ్గజాలు, ఇమ్రాన్ సమకాలీనులు అయిన సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, నవజోత్ సింగ్ సిద్ధూలను ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. అలాగే, 1992లో ప్రపంచకప్ సాధించిన పాక్ క్రికెట్ జట్టులో ఉన్నవారిని కూడా ఆహ్వానిస్తున్నట్టు జావేద్ ఖాన్ తెలిపారు.